సాక్షి, సిటీబ్యూరో:‘నాకు థాంక్స్ చెప్పొద్దు. అవకాశం వచ్చినప్పుడు మీరు ఓ ముగ్గురికి హెల్ప్ చెయ్యండి. వారిలో ఒక్కొక్కరినీ మరో ముగ్గురికి చొప్పున సాయం చెయ్యమని చెప్పండి’– స్టాలిన్ సినిమాలో తన వద్ద సాయం పొందిన వారితో చిరంజీవి చెప్పే డైలాగ్ ఇది.
‘ఇలా బాధపడవద్దు. మరొకరు బాధితులుగా మారకుండా చూడండి.ఈ షార్ట్‌ఫిల్మ్‌ల్ని కనీసం మూడు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి వారికి అవగాహన కల్పించండి’– ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్న మాట ఇది. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ అధికారులు శుక్రవారం నుంచి ఓ వినూత్న విధానాన్ని ప్రారంభించారు. సైబర్ నేరాల బారినపడిన బాధితులతోపాటు వారి వాట్సాప్‌లో ఉన్న గ్రూపుల్లో సభ్యులకూ అవగాహన కలిగేలా షేరింగ్ విధానాన్ని మొదలు పెట్టారు. మొత్తం ఆరు రకాలైన నేరాలపై రూపొందించిన షార్ట్‌ఫిల్మŠస్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి బాధితుల్నే ప్రచారకర్తలుగా వినియోగించుకుంటున్నారు.
ఆ ఆరింటిపై లఘు చిత్రాలు...
‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్’..అనే నానుడి సైబర్ నేరాల విషయంలో సరిగ్గా సరిపోతుందని అధికారులు చెప్తున్నారు. నేరం బారినపడిన వారి నుంచి ఫిర్యాదు స్వీకరించి ఆ కేసుల్ని కొలిక్కి తీసుకురావడంతో పాటు అసలు ప్రజల వాటిల్లో బాధితులుగా మారకుండా చూడటానికీ కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు దీనికోసం పోస్టర్లు, కరపత్రాలు ముద్రించి పోలీసుస్టేషన్ల వారీగా పంపిణీ చేశారు. ఈ అవగాహనను మరింత సమర్థవంతంగా చేపట్టాలనే ఉద్దేశంతో లఘు చిత్రాల నిర్మాణం ప్రారంభించారు. గతంలో ఓటీపీ ఫ్రాడ్, ఫేస్‌బుక్ మోసాలు, మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ సహా మొత్తం నాలుగింటిని రూపొందించారు. ఇటీవలే ఓఎల్‌ఎక్స్ ఫ్రాడ్, ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్‌పై మరో రెండింటికి రూపమిచ్చారు.
ఇప్పటి వరకు పరిమితంగా...
సెలబ్రెటీలతో సందేశం ఇప్పిస్తేనే ప్రజలకు హత్తుకుంటుందనే ఉద్దేశంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు టాలీవుడ్ తారలతో ఈ ఫిల్మŠస్ రూపొందించారు. ఈ లఘు చిత్రాల్లో రెండింటినీ నగర కొత్వాల్ అంజనీకుమార్ తదితరులు గత నెల్లో జరిగిన హ్యాకథాన్‌లో ఆవిష్కరించారు. గురువారం వరకు ఈ ఆరు లఘు చిత్రాలు నగర పోలీసుల అధికారిక ఫేస్‌బుక్, వెబ్‌సైట్స్‌తో పాటు యూ ట్యూబ్‌లు, కొన్ని సినిమా హాళ్లల్లో అందుబాటులో ఉంచారు. అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసే చోట వీటిని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇవి మరింత ఎక్కువ సంఖ్యలో ప్రజలకు చేరాల్సిన అవసరం ఉందని సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ భావించారు. ఈ చిత్రాలను విస్తృతంగా సోషల్ మీడియాలోకి తీసుకువెళ్ళడంతోనే నగర వాసులు... ప్రధానంగా యువతకు వీటిని దగ్గర చేయవచ్చని అందుకు వాట్సాప్‌ను వినియోగించుకుంటే ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు.
బాధితుల ఫోన్లకు షేర్ చేస్తూ..
శుక్రవారం నుంచి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ‘షేరింగ్’ విధానానికి శ్రీకారం చుట్టారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు ప్రతి రోజూ 40 నుంచి 50 మంది బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తుంటారు. ఇలా వచ్చిన వారిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్న వారి వాట్సాప్‌కు ఈ లఘు చిత్రాలను సైబర్ క్రైమ్ పోలీసులు షేర్ చేస్తున్నారు. ప్రతి ఒక్క బాధితుడు కనీసం తాను ఉన్న మూడు గ్రూపుల్లో ఇవి షేర్ చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రధానంగా ఏ మోసం బారినపడి ఫిర్యాదు చేయడానికి వస్తారో... దానిపై రూపొందించిన లఘుచిత్రాన్ని అతడికి షేర్ చేయడంతో పాటు అతడితో గ్రూపుల్లోకి చేయిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల వీలైనంత ఎక్కువ మందికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. బాధితులకు వాట్సాప్ ద్వారా పంపి..వాళ్లు మరో మూడు గ్రూపుల్లోకి పంపేలా ప్రోత్సహిస్తున్నామని, ఇదంతా బాధితులు స్వచ్ఛందంగా అంగీకరిస్తే మాత్రమే చేస్తున్నామని స్పష్టం చేసుస్తున్నారు. ఎవరైనా తాము ఎవరికీ షేర్ చేయమనో, అసలు తమకే షేర్ చెయ్య వద్దనో కోరితే వీటిని పంపట్లేదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment