జాయింట్ కలెక్టర్ల విషయంలోనే సందిగ్ధత | Shortage also to the Junior IAS officers | Sakshi
Sakshi News home page

జాయింట్ కలెక్టర్ల విషయంలోనే సందిగ్ధత

Published Sun, Oct 9 2016 2:34 AM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM

జాయింట్ కలెక్టర్ల విషయంలోనే సందిగ్ధత - Sakshi

జాయింట్ కలెక్టర్ల విషయంలోనే సందిగ్ధత

- జూనియర్ ఐఏఎస్ అధికారులకూ కొరత
- రెవెన్యూ అధికారులు-గ్రూప్ 1 అధికారుల మధ్య పోటీ
- ఆర్‌డీఓలకూ తప్పని ఇన్‌చార్జుల విధానం
 
 సాక్షి, హైదరాబాద్: జిల్లా పాలనలో కలెక్టర్ కార్యాలయానిదే ప్రధాన భూమిక. జిల్లా పాలనాధికారిగా కలెక్టర్ జిల్లా పాలనను స్వయంగా పర్యవేక్షిస్తారు. ఆయన తర్వాతి స్థానం జాయింట్ కలెక్టర్‌దే. మరో రెండు రోజుల్లో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కావాల్సిన తరుణంలో ఈ రెండు పోస్టుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. శాఖలవారీగా కొత్త జిల్లాల వ్యవస్థను ఏర్పాటు చేసుకునే పనులు మొదలైనప్పటికీ ప్రధానమైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ల విషయంలో అయోమయం కొనసాగుతోంది. ప్రధాన పోస్టులకే పూర్తిస్థాయి ఐఏఎస్ అధికారులను నియమించలేనంతగా ఐఏఎస్ అధికారులకు కొరత ఉన్న తరుణంలో, కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల నియామకం ప్రభుత్వానికి ఇబ్బందిగానే పరిణమించింది. జూనియర్ ఐఏఎస్ అధికారులను నియమించటం ద్వారా ఎలాగోలా కలెక్టర్ స్థానాలను భర్తీ చేసినా.. జాయింట్ కలెక్టర్ల విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఆ పోస్టులను భర్తీ చేసే సంఖ్యలో జూనియర్ ఐఏఎస్ అధికారులు కూడా లేనందున, సాధారణ సీనియర్ అధికారుల(నాన్ కేడర్)ను నియమించకతప్పని పరిస్థితి ఉత్పన్నమైంది.

 జేసీ కోసం పోటాపోటీ..
 ముందు నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పోస్టులు రెవెన్యూ శాఖలో అంతర్భాగంగా ఉన్నందున.. ఇప్పుడు రెవెన్యూ శాఖలోని సీనియర్ అధికారులతోనే జాయింట్ కలెక్టర్ పోస్టులు భర్తీ చేయాలని ఆ శాఖ అధికారుల సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. కాదని వేరే వారిని నియమిస్తే ఆందోళనలకూ వెనకాడబోమని తేల్చి చెబుతున్నాయి. మరోవైపు.. స్థాయి పరంగా తమ హోదానే పెద్దదని, ఎక్కడా రెవెన్యూ అధికారుల కింద తాము పనిచేసిన దాఖలాలు లేనందున ఆ పోస్టుల్లో తమనే నియమించాలని గ్రూప్ 1 అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి విన తులు అందజేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టత వెలువడలేదు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లవైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మిగతా వ్యవస్థ యథాతథంగా ఉండనుంది. డీఆర్‌ఓల విషయంలోనూ సీనియర్ అధికారులను నియమిస్తారు. ఆర్‌డీఓలకు కొరత వస్తే పక్క డివిజన్ అధికారికి ఇన్‌చార్జి బాధ్యత అప్పగించి నెట్టుకొస్తారు. తహసీల్దార్లు లేని చోట డిప్యూటీ తహసీల్దార్లకు బాధ్యత అప్పగిస్తారు.

 కలెక్టరేట్లలో సెక్షన్ల కుదింపు..
 కలెక్టరేట్లలో ఇప్పటి వరకు ఎనిమిదిగా ఉన్న సెక్షన్ల సంఖ్యను ఆరుకు కుదిస్తారు. పరిపాలన సౌలభ్యం కోసం గతంలో ఏర్పాటు చేసిన అదనపు జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేశారు. ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్/కోనేరు రంగారావు రిఫామ్స్ కమిటీ వ్యవస్థలను రద్దు చేశారు. మినిస్టీరియల్ సిబ్బంది సంఖ్యనూ కుదిస్తారు. 12గా ఉన్న సీనియర్ అసిస్టెంట్ల సంఖ్యను పదికి, 35గా ఉన్న జూనియర్ అసిస్టెంట్స్/టైపిస్టు సంఖ్యను 11కు, రికార్డు అసిస్టెంట్స్ సంఖ్యను నాలుగు నుంచి రెండుకు, ఆఫీస్ సబార్డినేట్ల సంఖ్యను 28 నుంచి 9కి కుదిస్తారు. ప్రతి మండలానికి ఓ సర్వేయర్ పోస్టు ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement