- రైతును అక్రమంగా నిర్బంధించిన ఫలితం
- బాధితుడికి రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశం
- వెల్గటూర్ తహశీల్దార్, ఎస్సైల జీతాల నుంచి వసూలు చేయాలన్న కోర్టు
కరీంనగర్ లీగల్ : రెండు నెలలుగా ఓరైతును అక్రమంగా నిర్బంధించడంతో రాష్ట్ర హోం ప్రిన్స్‌పల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వెల్గటూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన రైతు నేరెళ్ల శ్రీనివాస్(42)పై పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. ఆయనను ఈఏడాది ఏప్రిల్ 11వ తేదీన వెల్గటూర్ తహశీల్దార్ ఎదుట హాజరు పరిచారు.
ఒక సంవత్సరం పాటు శాంతి భద్రతలకు భంగం కల్గించరాదనే షరతుతో రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు తీసుకుని వదిలేశారు. అనంతరం రాజారాంపల్లిలో మద్యం కొనుగోలు చేశాడనే ఆరోపణపై పోలీసులు ఆయనపై మరో కేసు నమోదు చేశారు. దీంతో వెల్గటూర్ తహశీల్దార్ నేరేళ్ల శ్రీనివాస్‌కు నోటీస్ జారీ చేశారు. గతంలో బైండోవర్ అయి ఉండి, మరో కేసు నమోదు అయినందున, ఆయన ఇచ్చిన పూచీకత్తు మేరకు రూ.50వేలు నోటీస్ అందిన వారం రోజుల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. శ్రీనివాస్ ఆ మేరకు డబ్బులు చెల్లించక పోవడంతో తహశీల్దార్ ఎస్సైకి నోటీస్ ద్వారా తెలియజేశారు.
ఎస్సై ఆనోటీస్ ఆధారంగా శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి, జిల్లా జైలుకు పంపించాడు. ఆయనను జైలుకు పంపించాలని తహశీల్దార్ ఆదేశించలేదు. దీంతో నిందితుడు కోర్టును ఆశ్రయించడానికి వీలు లేకుండాపోవడంతో ఆయన కొడుకు హైకోర్టును ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు నేరేళ్ల శ్రీనివాస్‌ను వెంటనే విడుదల చేయాలని జిల్లా జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా నిర్బంధానికి బాధ్యులైన వెల్గటూర్ తహశీల్దార్, ఎస్సై బేషరతుగా శ్రీనివాస్ విడుదల కోసం జిల్లా జైలు సూపరింటెండెంట్ వద్దకు వెళ్లాలని ఆదేశించింది.
ఎలాంటి చట్టపరమైన చర్యలు లేకుండా, దాదాపు రెండు మాసాల పాటు శ్రీనివాస్‌ను అక్రమంగా నిర్బంధించినందుకు ఆయనకు రూ.2 లక్షల నష్టపరిహారం ఎందుకు చెల్లించకూడదో, సదరు డబ్బులను ఎస్సై, తహశీల్దార్ల వేతనాల నుంచి ఎందుకు వసూలు చేయకూడదో పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, అంతకుముందు ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
కలెక్టర్, ఎస్పీలకు షోకాజ్ నోటీసులు
Published Mon, Jun 23 2014 12:36 AM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM
Advertisement