
కట్టుకున్న భార్యే.. పొట్టన బెట్టుకుంటుందనుకోలే..
శివునిపల్లి(స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్) : పెద్దలు, కుటుంబ సభ్యుల మాటను కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే తమ కుమారుడిని పొట్టన పెట్టుకుంటుందని అనుకోలేదని ఆ దంపతులు కన్నీరుమున్నీరయ్యూరు. నమ్మించి.. మట్టుబెట్టిందని శాపనార్థాలు పెట్టారు. శివునిపల్లికి చెందిన కుసుమ సత్తెమ్మ, రాజమౌళి దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్(33) హైదరాబాద్‌లో ఈ 9న భార్య చేతిలో హత్యకు గురయ్యూడు.
అతడి మృతదేహాన్ని సోమవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతుడి తల్లిదండ్రులు, సోదరుడి కథనం ప్రకారం.. శ్రావణ్‌కుమార్ సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన అమృత నర్సింహారావు, విజయ దంపతుల కుమార్తె పావనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో బీటేక్ ఫైనలియర్ చదువుతున్న అతడిని తల్లిదండ్రులు ఎంటెక్ చదివించారు.
అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. వారికి కుమారుడు అభినవ్, కుమార్తె వశిష్ట ఉన్నారు. హైదరాబాద్ వనస్థలిపురం బాలాజీనగర్‌లో బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకోవడంతోపాటు ఫైనాన్స్‌లో కారు కొనుగోలు చేశారు. కాగా ఏడాది క్రితం అతడిని కళాశాల యూజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారడంతోపాటు ఏడు నెలల క్రితం దంపతుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో మనోవేదనకు గురైన శ్రావణ్‌కుమార్ తన పిల్లలను తీసుకుని శివునిపల్లిలో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. మూడు నెలల క్రితం పిల్లలు కావాలని ఇంటికి వచ్చిన భార్య పావని పాపను తీసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లింది.
పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచారుుతీలు కాగా ఇద్దరు కలిసి శివునిపల్లిలో ఉండాలని వారు నిర్ణరుుంచారు. అందుకు పావని అంగీకరించలేదు. దీంతో అతడు ధర్మసాగర్ మండలం రాంపూర్ వీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు. కుమారుడిని ఘన్‌పూర్‌లోని హోలీక్రాస్ పాఠశాలలో చేర్పించి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలోనే పావని హైదరాబాద్‌లోని పోలీస్‌స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేసింది.
ఆ తర్వాత దీపావళి పండుగ మరుసటి రోజు ఇంటికి వచ్చిన పావని తాను మారిపోయానని, అంతా కలిసి ఉందామని చెప్పడంతో శ్రావణ్‌కుమార్ నమ్మాడని తల్లిదండ్రులు తెలిపారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వేములవాడకు వెళ్లొచ్చారని, హైదరాబాద్‌లో ఉన్న ఇంటిని అమ్మేందుకని ఈ నెల 8న హైదరాబాద్‌కు వెళ్లిన కొడుకు తిరిగిరాలేదని వారు విలపించారు. ఈ నెల 9న రాత్రి హైదరాబాద్ నుంచి పోలీసులు ఫోన్ చేసి శ్రావణ్ చనిపోయినట్లు చెప్పారని వాపోయూరు. శ్రావణ్‌ను భార్య, అత్త పథకం ప్రకారం హతమార్చారని, వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.