
సాక్షి, హైదరాబాద్: కరోనా... ప్రస్తుతం ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న పేరు ఇది. కేవలం చిన్న దేశాలే కాదు అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని గజగజ వణికిపోతుంది. కంటికి కనిపించని ఈ వైరస్ దాటికి ఏ యుద్దంలోనూ చనిపోనంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అణువంత కూడా లేని ఈ కరోనా అణుబాంబు కంటే ఎక్కువ భయాన్ని కలిగిస్తోంది. ఈ మహమ్మారి విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు దాదాపు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి.
ఈ నేపథ్యంలోనే అధిక జనాభా కలిగిన మనదేశంలో ఈ మహమ్మారి ఒక్కసారి విజృంభిస్తే పరిస్థితులు చేజారిపోయే అవకాశాలు ఉన్నాయని భావించిన భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో ఎక్కడి వారు అక్కడే ఇళ్లకు పరిమితమయ్యారు. చాలా మంది ఉపాధి కోల్పొయి దిక్కులేక ఒక్కపూట కూడా గడవక ఇబ్బంది పడుతున్నారు. ఇక దినసరి కూలీలు, వలస కూలీల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది. పనికి వెళితే కాని పూట గడవని వీరు కుటుంబంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు కొన్ని పథకాలు అమలు చేస్తున్నా అవి కొంతవరకు మాత్రమే సరిపోతున్నాయి. అయితే ఇటువంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంధసంస్థలు, సామాన్యలు సైతం ముందుకు వచ్చి వారికి తోచిన సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. (సేవ సైనికులు)
హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్ చైతన్యపురి, సాయిబాబా కాలనీ కి చెందిన శ్రీ భవాని ఫ్రెండ్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పొయిన వారికి కరోనా కష్టకాలంలో అండగా నిలుస్తోంది. అసోసియేషన్ సభ్యులైన అల్లపి ఆనంద్ రావు, అంబటి లోహిత్ భార్గవ్, నీలా మణిదీప్, పల్స దినేశ్, మాసిపెద్ది వంశీ క్రిష్న, శ్రీకర్ విశ్వనాధుల, గోకుల్ కృష్ణ మూర్తి తదితరులు వారి కుటుంబ సభ్యులు, సాయిబాబా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారంతో రోజు వారి కూలీ చేసుకునే కుటుంబాలకు సాయం అందిస్తున్నారు. ఒక్కొ కుటుంబానికి గత మూడు వారాలుగా నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా డ్యూటీలో ఉన్న పోలీసు వారికి, పురపాలక కార్మికులకు వాటర్ బాటిల్స్, మజ్జిగ, టిఫిన్, బ్రెడ్, బిస్కెట్లు పంచుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అంతే కాకుండా దిల్‌సుఖ్‌నగర్ పరిధిలోని వలస కార్మికులకు ప్రతి రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఉపాధి కోల్పొయిన కొన్ని కుటుంబాలకు నెలకు సరిపడ కిరాణ సామాగ్రి, బియ్యం బ్యాగులు అందించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శ్రీ భవాని ఫ్రెండ్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ 2016 నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమందికి తోడుగా నిలుస్తోంది.
































Comments
Please login to add a commentAdd a comment