
ఓ వైపు జననం.. మరోవైపు మరణం
హైదరాబాద్: కలలు కన్న ఉద్యోగం వచ్చింది. ఎన్నో ఆశలతో ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. పాపం.. ఆయన బతికున్నా తండ్రయ్యానన్ని విషయం తెలుసుకోలేకపోయారు. తన భార్య ప్రసవించిన ఆస్పత్రిలోనే.. అదే సయమంలో మృత్యువుతో పోరాడుతున్నారు. చివరకు తన బిడ్డను చూడకుండానే ఈ లోకాన్ని వీడి శాశ్వతంగా వెళ్లిపోయారు. ఉగ్రవాద కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కామనేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించిన ఎస్ఐ సిద్ధయ్య జీవితం ఇలా విషాదాంతమైంది.
శనివారం నల్గొండ జిల్లా జానకీపురంలో జరిగిన ఎన్కౌంటర్లో సిద్ధయ్య తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. కామినేని ఆస్పత్రిలో నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ ఈ రోజు మరణించారు. సిద్ధయ్య మరణించిన కామినేని ఆస్పత్రిలోనే ఆయన భార్య ధరణి శనివారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. భర్త ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతుండగా.. ఆమె ప్రసవించింది. వాస్తవానికి ఆమె మరో 10 రోజులకు ప్రసవించాల్సి ఉంది. కానీ భర్త పరిస్థితితో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఉగ్రవాదులు కాల్పుల్లో భర్త తీవ్రంగా గాయపడిన రోజు పురిటినొప్పులు రావడంతో.. సిద్ధయ్య చికిత్స పొందుతున్న ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలోనే డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు.
కర్నూలు జిల్లాకు చెందిన చెందిన సిద్ధయ్య కుటుంబం 20 ఏళ్ల క్రితమే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో స్థిరపడింది. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన సిద్ధయ్య స్నేహితుల ప్రోత్సాహంతో పోలీసు ఉద్యోగంలో చేరారు. 2011బ్యాచ్‌కు చెందిన ఆయనకు ఏడాది క్రితమే ధరణితో వివాహమైంది. సిద్దయ్యకు ఇద్దరు అన్నలు ఉన్నారు.