ఎస్‌ఐ సిద్ధయ్య కన్నుమూత | injured s.i siddaiah died on tuesday | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ సిద్ధయ్య కన్నుమూత

Published Wed, Apr 8 2015 3:44 AM | Last Updated on Tue, Oct 16 2018 8:50 PM

ఎస్‌ఐ సిద్ధయ్య కన్నుమూత - Sakshi

ఎస్‌ఐ సిద్ధయ్య కన్నుమూత

హైదరాబాద్: విధి నిర్వహణలో ముష్కరులకు ఎదురొడ్డి నిలిచే క్రమంలో తీవ్రంగా గాయపడిన ఓ యువ పోలీసు అధికారి వీరమరణం పొందాడు. ఉగ్రవాదుల తూటాలను ఎదుర్కొని మృత్యువుతో పోరాడుతూ అమరుడయ్యాడు. సిమి ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నల్లగొండ జిల్లా ఆత్మకూర్ (మం) ఎస్‌ఐ జూలూరి సిద్ధయ్య (29) మంగళవారం సాయంత్రం కన్నుమూశాడు. ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో సాయంత్రం 4 గంటల 6 నిముషాలకు మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
 
 సిద్ధయ్యకు వైద్యులు మూడు శస్త్ర చికిత్సలు నిర్వహించి రెండు బుల్లెట్లను తొలగించగా మరో రెండు బుల్లెట్లు ఆయన శరీరంలోనే ఉన్నాయి. దీంతో అతను కోలుకున్నాక మరోసారి శస్త్ర చికిత్స చేసి వాటిని తొలగించాలని వైద్యులు భావించారు. అయితే వైద్యానికి సిద్ధయ్య శరీరం సహకరించకపోవడంతో సోమవారం ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చినా ఫలితం లేకపోయింది. సిద్ధయ్య మరణవార్త తెలియగానే ఆయన భార్య ధరణీషాతోపాటు ఇతర కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. సిద్ధయ్య మృతిచెందడానికి అరగంట ముందే వైద్యులు ధరణీషాకు భర్తను చూసే అవకాశం కల్పించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ తకియుద్దీన్ పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం అనంతరం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధయ్య పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పించారు. పోస్ట్‌మార్టం అనంతరం ఆయన పార్థివదేహాన్ని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని చింతచెరువుకు తరలించారు.
 
కలత చెందిన సీఎం కేసీఆర్
సిద్ధయ్య మృతిపట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిద్ధయ్య తుది శ్వాస విడిచారనే సమాచారం తెలియగానే సీఎం కలత చెందారు. సిద్ధయ్యను రక్షించేం దుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధాకరమన్నారు. ముష్కరులను ఎదుర్కొనేందుకు సిద్దయ్య ప్రదర్శించిన ధైర్య సాహసాలు పోలీసులకు, పౌరులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. సిద్ధయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతోపాటు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సిద్ధయ్య అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కాగా, సిద్ధయ్య మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో ఆరోగ్య మంత్రి కె.లక్ష్మారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర డీజీ అనురాగ్ శర్మ ఉన్నారు. కాగా, సిద్దయ్య అంత్యక్రియల్లో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, పొన్నాల, డీకే ఆరుణ, శ్రీధర్‌బాబు, మల్లు రవి పాల్గొననున్నారు.
 
జడ్చర్లలో విషాద ఛాయలు..
జడ్చర్ల/చాగలమర్రి: ఎస్‌ఐ సిద్ధయ్య కుటుంబం 20 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చి స్థిరపడింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన సిద్ధయ్య కుటుంబం బాదేపల్లి ప్రభుత్వాస్పత్రి సమీపంలో నివాసముంటోంది. చిన్నతనంలోనే తండ్రి దస్తగీర్ చనిపోవడంతో తల్లి దస్తగీరమ్మ కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది.  కుటుంబంలో చిన్నవాడైన సిద్ధయ్య విద్యాభ్యాసం జడ్చర్లలో కొనసాగింది. గత ఏడాది జనవరి 14న అనంతపురం జిల్లా పొద్దుటూరుకు చెందిన ధరణీషాతో వివాహమైంది. 2011 బ్యాచ్ ఎస్‌ఐగా ఎంపికై నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం) ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆయన ప్రాణాలొదడంతో జడ్చర్లలో విషాద ఛాయలు అలముకున్నాయి.
 
సిద్ధయ్య బిడ్డకు ఆహారనాళంలో రంధ్రం..
ఎస్‌ఐ సిద్ధయ్య చికిత్స పొందిన కామినేని ఆస్పత్రిలోనే ఆయన భార్య మగబిడ్డకు జన్మనివ్వగా ప్రస్తుతం ఆ బిడ్డకు ఆహారనాళంలో రంద్రం ఏర్పడటంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఆ శివువును మంగళవారం బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు. బిడ్డ అనారోగ్యం గురించి మూడు రోజులుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కామినేని ఆస్పత్రి వర్గాలు నిర్లక్ష్యం వహించాయని బంధువులు ఆరోపిస్తున్నారు. రెయిన్‌బో ఆసుపత్రి వైద్యులు బిడ్డకు శస్త్ర చికిత్స చేయాలని తెలిపారన్నారు.
 
వైద్యుల వైఫల్యం వల్లే...
బంధువుల ఆరోపణ
మెరుగైన చికిత్స అందించడంలో కామినేని వైద్యుల వైఫల్యం వల్లే సిద్ధయ్య మృతి చెందాడని పలువురు బంధువులు ఆరోపించారు. స్పెషలిస్టులను పిలిపించి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పిన వైద్యులు ఎవరినీ పిలిపించలేదన్నారు. తాము ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించుకుంటామన్నా ఆసుపత్రి వర్గాలు అంగీకరించలేదన్నారు. ఎలాంటి చికిత్స అందిస్తున్నారో తమకు సమాచారం ఇవ్వకుండా, తమను చూడనివ్వకుండా సిబ్బందితోనే సమాచారం అందజేశారని ఆరోపించారు. సిద్ధయ్యకు మెరుగైన వైద్యం అందిస్తామంటూ హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు ఆచరణలో మాత్రం చూపలేదని విమర్శించారు. భార్యకు ప్రసవం కానున్న నేపథ్యంలో సెలవు కావాలని తన అల్లుడు అడిగినా సీఐ బాలగంగిరెడ్డి సెలవు ఇవ్వకుండా డ్యూటీ చేయాలని బలవంతం చేశారని సిద్ధయ్య అత్త హసీనా ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement