మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం విషాదంలో మునిగింది. ఈ నెల 4వ తేదీన నల్లగొండ జిల్లా జానకిపురంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన జడ్చర్లకు చెందిన ఎస్‌ఐ సిద్ధయ్య మంగళవారం ఆస్పత్రిలో మరణించారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చింతలచెర్వు గ్రామం నుంచి సిద్దయ్య కుటుంబం 20 ఏళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చి స్థిరపడింది. చిన్నతనంలోనే తండ్రి దస్తగీర్ చనిపోవడంతో ఆయన తల్లి దస్తగీరమ్మ కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. పెద్ద కుమారుడు పెద్దమాబాష సొంత ఊరైన చింతలచెరువులో వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. రెండో కుమారుడు దస్తగీర్ జడ్చర్లలో వెండి ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నారు. వీరితో పాటు సిద్ధయ్యకి సోదరి ఉన్నారు.
కుటుంబంలో చిన్నవాడైన సిద్ధయ్య విద్యాభ్యాసం జడ్చర్లలో కొనసాగింది. 1నుంచి 10వ తరగతి వరకు స్థానిక ఆదర్శ ఉన్నత పాఠశాలలో, ఇంటర్ విశ్వవికాస్, డిగ్రీ బీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో చదివినట్లు ఆయన మిత్రులు తెలిపారు. గత ఏడాది కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ధరణీషతో వివాహమైంది. 2012-13 బ్యాచ్‌లో గ్రూప్-1 ద్వారా ఎస్‌ఐగా ఎంపికై నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం) ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో గాయపడిన ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు. ఎస్‌ఐ సిద్ధయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడవడంతో జడ్చర్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
(జడ్చర్ల)