
సిద్దిపేటజోన్: ఆసియాలోనే అతిపెద్ద సిల్క్ రోలింగ్ యూనిట్‌ను స్థాపించేందుకు ఇండోరమ సింథటిక్ లిమిటెడ్ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు శుక్రవారం సిద్దిపేటలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన కంపెనీ బృందం సభ్యులు శనివారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. టెక్స్‌టైల్ రంగంలో రూ.3 వేల కోట్ల టర్నోవర్ సాధించిన తమ సంస్థ సిద్దిపేటలో అతిపెద్ద సిల్క్‌రోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉందని ఇండోరమ ప్రతినిధులు మంత్రికి తెలిపారు.
ప్రభుత్వపరంగా యూనిట్ ఏర్పాటుకు అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని మంత్రి హరీశ్‌రావు సంస్థ బృందానికి భరోసా ఇచ్చారు. మల్బరీ సాగుపై రైతులు మరింత దృష్టిపెట్టారని, రైతులతో బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకుని సంస్థ రోలింగ్ సెంటర్ ఏర్పాటుపై ముందుకు సాగాలని సూచించారు. సిద్దిపేటలో యూనిట్ స్థాపనకు అవసరమైన స్థలాన్ని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, జాప్యం చేయకుండా యూనిట్‌ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. సిల్క్ రోలింగ్ యూనిట్‌కు తమశాఖ పక్షాన సహకారం ఉంటుందని మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.