వేసవి ‘మంట’ | singareni coal wants cool then Fire Fighting System applayed | Sakshi
Sakshi News home page

వేసవి ‘మంట’

Published Fri, Apr 24 2015 2:03 AM | Last Updated on Thu, Sep 13 2018 5:04 PM

వేసవి ‘మంట’ - Sakshi

వేసవి ‘మంట’

 శ్రీరాంపూర్ : సింగరేణి బొగ్గు అగ్నికి ఆహుతి అవుతోంది. సూర్యభగవానుడి ప్రతాపానికి నల్లబంగారం బొగ్గవుతోంది. నిన్నా మొన్నటి వరకు వా ర్షిక ఉత్పత్తి లక్ష్య సాధన కోసం పెద్దయెత్తున బొగ్గును ఉత్పత్తి చేసిన సింగరేణికి ఇప్పుడు ఆ బొగ్గును కాపాడటం పెద్ద సవాల్‌గా మారింది. అక్కడక్కడా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నా పూర్తిస్థాయిలో అదుపు చేయలేకపోతున్నారు.
 
లక్ష్యం పూర్తయినా..
మార్చి 31 నాటికి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అన్ని గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి జరిగింది. ఉత్పత్తి అయిన ఈ బొగ్గు సకాలంలో రవాణా కాకపోవడంతో సగం బొగ్గు స్టాక్ రూపంలో ఎక్కడిక్కడ నిలిచిపోయింది. గనులపై, సీహెచ్‌పీలపై ఉన్న కోల్‌యార్డులో గుట్టలను మరిపించే విధంగా కోల్ స్టాక్ ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలోనే బొగ్గు గాలిలో ఉన్న ఆక్సిజన్‌తో కలిసి అక్సిడేషన్ అనే రసాయక చర్య జరిపి మండటం సహజ స్వభావం.

ఇప్పుడు ఆ రసాయన చర్యకు ఎండలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. దీంతో వేసవి తీవ్రతకు కోల్‌యార్డ్‌లలో అగ్గి రాజుకోవడం మొదలైంది. మే వస్తే మరింత ప్రమాదం ముంచుకొస్తుంది. బొగ్గు కాలిపోతే నాణ్యత పడిపోయి కంపెనీకి నష్టం వచ్చే ప్రమాదం నెలకొంది. ఆర్థిక సంవత్సరానికి మార్చి చివరి నెల కావడంతో అప్పటి వరకు ఉన్న లోటును మొత్తం పూడ్చుకోవడానికి పెద్దయెత్తున ఉత్పత్తి తీయాల్సి వచ్చింది. ఇప్పుడు దాన్ని కాపాడుకోవడానికి అంత కంటే ఎక్కువగానే కష్టపడాల్సి వస్తోంది.
 
బెల్లంపల్లి రీజియన్‌లో 11.28 లక్షల టన్నుల స్టాక్..
బెల్లంపల్లి రీజియన్‌లోని మూడు ఏరియాల్లో 11.28 లక్షల టన్నుల స్టాక్ ఉంది. మొదటి మూడు క్వార్టర్లీ కంటే చివరి క్వార్టర్లలో ఎక్కువగా బొగ్గు వచ్చింది. పూర్తి యంత్ర సామర్థ్యం వినియోగించారు. కొత్త సీఅండ్‌ఎండీగా శ్రీధర్ వచ్చిన తరువాత మల్టీడిపార్టుమెంట్ కమిటీలు ఏర్పాటు చేసి కార్మికులను చైతన్యం చేయడంతో ఉత్పత్తి కుప్పులు తెప్పలుగా వచ్చింది. యంత్రాల పని గంటలను, మానవ శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు.

దీంతో ఎన్నడూ లేని విధంగా 8 భూగర్భ గనులు ఉన్న శ్రీరాంపూర్ ఏరియాల్లో అన్ని భూగర్భ గనులు 100 శాతం సాధించాయి. ఏరియా మొత్తం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యంలో 104 శాతం సాధించింది. మందమర్రి ఏరియా నిర్దేశించిన లక్ష్యంలో 78 శాతం, బెల్లంపల్లి ఏరియా 69 శాతం ఉత్పత్తి సాధించింది. మార్చి 31 వరకు కంపెనీ లెక్కల ప్రకారం శ్రీరాంపూర్ డివిజన్‌లో ఉత్పత్తి అయిన బొగ్గులో మొత్తం 5.48 లక్షల టన్నుల బొగ్గు స్టాక్ ఉంది.

ఇందులో సీహెచ్‌పీ కోల్‌యార్డు వద్ద 1.43 లక్షల టన్నులు, శ్రీరాంపూర్ ఓసీపీ వద్ద 3.76 లక్షల టన్నులు ఉండగా మిగితా భూగర్భ గనుల్లో అక్కడక్కడ కలిపి మొత్తం 36 వేల టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. ఇక మందమర్రి ఏరియాలో మొత్తం 3.5 లక్షల టన్నుల స్టాక్ ఉంది. ఇందులో ఓసీపీలోనే సుమారు 2.75 లక్షలు ఉండగా.. మిగిలింది అండర్ గ్రౌండ్ గనులు, సీహెచ్‌పీ వద్ద ఉంది. ఇక బెల్లంపల్లిలో 2.30 లక్షల టన్నుల నిల్వ ఉంది.
 
నిల్వలకు కారణం ఎన్టీపీసీ..
స్టాక్ నిల్వలు పేరుకుపోవడానికి ప్రధాన కారణం ఎన్టీపీసీ. రామగుండం ఎన్టీపీసీకి సింగరేణి నుంచి బొగ్గు రవాణా జరుగుతుంది. ఒప్పందం ప్రకారం కంపెనీ సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉంది. అంతకంటే ఎక్కువగా ఎన్టీపీసీకి బొగ్గు అవసరం పడితే టన్నుకు రూ.వెయ్యి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జనవరి చివరి వారంలోనే 10 మిలియన్ టన్నుల రవాణా పూర్తయ్యింది.

కానీ.. విద్యుత్ కొరత దృష్ట్యా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి మరింత బొగ్గు ఎన్టీపీసీకి అవసరం ఉంది. ఈ బొగ్గును సింగరేణి నుంచి తీసుకుంటే అదనంగా చెల్లించాల్సిన రూ.వెయ్యి భారం పడుతుండటంతో ఎన్టీపీసీ సింగరేణి బొగ్గును తీసుకోలేదు. సింగరేణి నుంచి సరఫరా చేసే బొగ్గు ధర కంటే ఇండోనేషియా వంటి ఇతర దేశాల నుంచి ఇంత కంటే తక్కువ ధరకు బొగ్గు రవాణా అవుతుండటంతో ఎన్టీపీసీ ఆ బొగ్గునే రెండు నెలలు రవాణా చేసుకుంది.

ఫలితంగా రెండు నెలలుగా సింగరేణి ఎన్టీపీసీకీ రవాణా చేసే బొగ్గు నిలిచింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఒప్పందం ప్రకారం బొగ్గు రవాణా జరిగిన అది నామమాత్రంగానే తీసుకుంటున్నారు. దీంతో ఆ బొగ్గు నిల్వ రూపంలో కంపెనీ వద్దే పేరుకుపోయింది. దీనికితోడు శ్రీరాంపూర్ వంటి పెద్ద ఏరియాలో రోడ్డు మార్గాన వెళ్లాల్సిన బొగ్గు కూడా లారీ ట్రాన్స్‌పోర్టర్ల సమ్మెతో ఆటంకం కలిగింది. బొగ్గు మొత్తాన్ని సీహెచ్‌పీ (కోల్ హాండ్లింగ్ ప్లాంట్)కి తరలించారు.
 
మంటలను అదుపు చేస్తేనే..
స్టాక్ కోల్‌ను వెంటవెంటనే రవాణా చేయడంతోపాటు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం సింగరేణికి ఉంది. పాత బొగ్గును తరలిస్తూ.. కొత్త బొగ్గు స్టాక్ చేస్తే ఫలితం ఉంటుంది. సీహెచ్‌పీ వంటి కోల్‌యార్డులో యార్డుల చుట్టూ నీటి పైపులు, ప్రత్యేక ఫైర్ ఫైటింగ్ సిస్టంతో మంటలు అదుపు చేస్తున్నా సత్ఫలితాల్విడం లేదు. ఎక్కువ కాలం స్టాక్ ఉన్నా, మంటలకు ఆహుతై.. గ్రేడ్ పడిపోయి క్వాలిటీ దె బ్బతిని కంపెనీకి ఆర్థికంగా నష్టం వస్తుంది.
 
తరలింపు కష్టమే..?
ఇదిలా ఉంటే ఇప్పుడున్న స్టాక్ రవాణా చేయాలంటే ప్రత్యేక చర్యలే తీసుకోవాలి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనందునా ఎన్టీపీసీకి బొగ్గు రవాణా మెగురుపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ స్టాక్‌ను వేసవి ముగిసే ముందే తరలించాలంటే సాధ్యమయ్యేలా లేదు. ఎక్కువగా సరుకు రవాణా వేసవిలోనే ఉంటుండడంతో కంపెనీ డిమాండ్‌కు తగ్గట్టు రైల్వే శాఖ రేకులు ఇవ్వదని అధికారులు అంటున్నారు. చివరికి నిన్నా మొన్నటి వరకు బొగ్గు తీయడానికి ఆరాటపడ్డ అధికారులకు.. ఇప్పుడు తీసిన బొగ్గును కాపాడుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు.
 
ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం..

వేసవిలో సహజంగా బొగ్గు ఎక్కువగా అంటుకుంటుంది. దీని నివారణకు ఫైర్‌ఫైటింగ్ సిస్టంను అందుబాటులో ఉంచాం. యార్డుల చుట్టూ పైప్‌లైన్లు వేయించాం. ఎక్కడైనా బొగ్గు తగలబడిందంటే వెంటనే ఆర్పివేయడంతోపాటు దాన్ని ఎత్తి మరో చోట పోయిస్తున్నాం. ఎన్టీపీసీలో కొత్త ఒప్పందం మొదలవడంతో స్టాక్ వెంట వెంటనే రవాణా చేయాల్సి వస్తోంది. రేకుల సరఫరా పెరిగితే రెండు నెలల్లో ఉన్న స్టాక్ క్లియర్ అవుతుంది. అప్పటి వరకు ఎలాంటి నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
- ఎస్‌డీఎం సుబాని, జీఎం శ్రీరాంపూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement