
సాక్షి, కొత్తగూడెం: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్, ఏఐటీయూసీల మధ్య జరిగిన పోరులో టీబీజీకేఎస్ వరుసగా రెండో సారి విజయం సాధించింది. 2012లో జరిగిన గత ఎన్నికలతో పాటు ఈసారి ఈ రెండింటి మధ్యే ప్రధాన పోటీ జరిగింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం టీబీజీకేఎస్, ఏఐటీయూసీలు ఓట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నాయి. సింగరేణిలోని మొత్తం 11 ఏరియాల్లో 9 చోట్ల టీబీజీకేఎస్ విజయం సాధించగా.. ఏఐటీయూసీ 2 చోట్ల గెలిచింది.
2012 ఎన్నికల్లో 5 చోట్ల టీబీజీకేఎస్ విజయం సాధించి గుర్తింపు సంఘంగా ఉండగా.. 2 చోట్ల ఏఐటీయూసీ, 2 చోట్ల ఐఎన్‌టీయూసీ, మరో రెండు చోట్ల హెచ్‌ఎంఎస్ గెలుపొంది ఆయా ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలుగా వ్యవహరించాయి. ఈసారి మాత్రం మొత్తంగా 2 యూనియన్లే గెలుపొందాయి. 2012లో టీబీజీకేఎస్ 38.69 శాతంతో 23,311 ఓట్లు సాధించగా.. ఏఐటీయూసీ 27.76 శాతంతో 16,724 ఓట్లు సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో టీబీజీకేఎస్ 45.40 శాతంతో 23,848 ఓట్లు సాధించగా.. ఏఐటీయూసీ 37.37 శాతంలో 19,631 ఓట్లు సాధించింది.