
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ హామీ ఇచ్చారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)తో మంగళవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్మిక సంఘం సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
సింగరేణిలో గైర్హాజరు కారణంగా తొలగించిన కార్మికులకు ఆఖరి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సింగరేణి, కోల్ ఇండియాలోని క్యాడర్ స్కీమ్‌ను అధ్యయనం చేసి కార్మికులకు మేలు కలిగేలా ప్రతిపాదనలు చేసేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేశామని, ఈ నివేదిక ఆధారంగా ఇంక్రిమెంట్‌ను అమలు చేస్తామన్నారు. సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్రావు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.