సిరిసిల్ల జిల్లా ఉద్యమం ఉధృతం
సిరిసిల్ల జిల్లా కోరుతూ అఖిలపక్ష నాయకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు.
కరీంనగర్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఉద్యమం ఊపందుకుంది. సిరిసిల్ల జిల్లా సాధన సమితి ఉద్యమాన్ని ఉధృతమైంది. బుధవారం జిల్లా సాధనసమితి, అఖిలపక్షనాయకులు, జేఏసీ సంయుక్తంగా మహార్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండు శివారులోని కార్గిల్‌లేక్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అనంతరం రెవెన్యూ డివిజినల్ కార్యాలయాన్ని ముట్టడించారు. మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగుల రాములు ఆర్డీవో కార్యాలయంపైకి ఎక్కి ఆత్మాహుతికి యత్నించారు.
ఈ సందర్భంగా జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ ఆవునూరి రమాకాంత్‌రావు మాట్లాడుతూ సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ఎందుకు మౌనంగా ఉంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఆశ కల్పించిన మంత్రి ద్రోహిగా మిగలొద్దన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షను గౌరవించి జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీవో ఆఫీస్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం సంతకాల సేకరణ, న్యాయవాదులు, టీఆర్‌ఎస్ నాయకులు దీక్షలు కొనసాగించారు.