సిటీకి సిక్స్ ప్యాక్
హైదరాబాద్ చుట్టూ ఆరు సిటీలు
సాక్షి, హైదరాబాద్:రాష్ట్ర రాజధాని చుట్టూ ఆరు సిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇప్పటికే ఫార్మా సిటీ, కెమికల్ సిటీ ఏర్పాటును ప్రస్తావించిన ఆయన తాజాగా మరో నాలుగు కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీలతో పాటు నగరంలో మరో ఫిల్మ్ సిటీని కూడా నెలకొల్పాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. నూతన పారిశ్రామిక విధానం, పరిశ్రమల ఏర్పాటుపై పరిశ్రమల శాఖ అధికారులతో గురువారం సచివాలయంలో సమీక్ష జరిపారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న అపార ఖనిజ నిక్షేపాలను వెలికితీసి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎండీసీ)ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సహజ, మానవ వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే విధంగా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని సూచించారు. వేర్వేరు పరిశ్రమల ఏర్పాటుకు వేర్వేరు విధానాలను పాటించాల్సి ఉన్నందున.. విభాగాలవారీగా విధివిధానాలను తయారు చేయాలని సూచించారు. సమైక్య రాష్ర్టంలో తెలంగాణలో ఉన్న ఖనిజాలు, గనులను నిర్లక్ష్యం చేశారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. వరంగల్-ఖమ్మం సరిహద్దుల్లో లక్షా యాభై వేల ఎకరాల్లో ఖనిజ సంపద ఉన్నా అది పనికిరాదని సీమాంధ్ర పాలకులు దుష్ర్పచారం చేశారన్నారు. ఇక్కడ సెయిల్ ఏకంగా30 వేల కోట్లతో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ముందుకు వచ్చిందని గుర్తుచేశారు.
బయ్యారం ఖనిజం ఉపయోగకరమైనదన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అన్ని రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఒకే దగ్గర ఉండటం వల్ల ప్రజలకు అన్ని సేవలు సులభంగా అందుతాయని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే హైదరాబాద్ నగరం చుట్టూ ఆరు సిటీలను ఏర్పాటు చేయాలని, వాటిలో ఆయా రంగాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి సంస్థలకు అప్పగించేందుకు సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. అదేవిధంగా పరిశ్రమలను ఖాయిలా పడిన తర్వాత(సిక్ ఇండస్ట్రీస్) ఆదుకోవడం కంటే.. ఖాయిలా పడకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడుతున్నారు.
విద్యుత్ కోతలు, ఆర్డర్లు లేకపోవడం వంటి పలు కారణాలతో అనేక పరిశ్రమలు ఖాయిలా పడుతున్న నేపథ్యంలో.. ఈ పరిస్థితిని నివారించడానికి ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ ఫండ్ (బీమా నిధి) ఏర్పాటు చేయాలని కూడా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కాగా, బ్యాంకు రుణాలు లభించక అనేక మంది ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి ప్రభుత్వమే గ్యారంటీ(పూచీకత్తు) ఇవ్వడం లేదా నేరుగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా నిధులు అందించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పరిశ్రమలకు కాస్త ఎక్కువ రాయితీలను ప్రకటించాలని.. వీటిని నూతన పారిశ్రామిక విధానంలో పొందుపర్చాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ తయారు చేసిన ముసాయిదా విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం.
సీడ్ కాలనీలు
రాష్ర్ట వ్యాప్తంగా సీడ్ కాలనీలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వివిధ రకాల పంటలతో పాటు విత్తనోత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఆగ్రో ఇండస్ట్రీస్ భారీగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుగుణంగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ)కు ఐదు లక్షల ఎకరాల భూమిని అప్పగించాలని పేర్కొన్నారు. దీంతో పారిశ్రామిక వాడల అభివృద్ధికి నిధుల సమీకరణ సులభతరం కావడంతో పాటు టీఎస్‌ఐఐసీ బలమైన ఆర్థిక సంస్థగా ఎదుగుతుందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, టీఎస్‌ఐఐసీ ఎండీ జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని హంగులతో ‘సినిమా సిటీ’
సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ర్టంలో మరో ఫిల్మ్ సిటీ రానుంది. ఏకంగా రెండువేల ఎకరాల్లో ఏర్పాటుకానుంది. షూటింగులు, టీవీ సీరియళ్ల నిర్మాణానికి అనుగుణంగా భారీ స్థాయిలో ‘సినిమా సిటీ’ నిర్మించాలని, ఇందులో గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ సౌకర్యాలతో స్టూడియోలు ఉండాలని సీఎం సూచించారు. దీంతో సినీ పరిశ్రమకు మేలు జరగడంతో పాటు స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ తరలిపోదని కూడా కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే అభివృద్ధి చెందిన దేశాల్లో రీసెర్చ్ కారిడార్ వ్యవస్థ ఉందని.. తెలంగాణలోనూ అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫార్మాసిటీ తరహాలో కెమికల్ సిటీ ఏర్పాటు చేయాలన్నారు. పారిశ్రామిక రంగ చట్టాలు, విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, అవసరమైతే పాతవి తొలగించి కొత్త చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించాలని, పరిశ్రమల్లో ప్రాక్టికల్స్ చేసేలా విధానం రూపొందించాలని నిర్దేశించారు.