మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌.. | Six More Coronavirus Positive Cases Registered In Telangana | Sakshi
Sakshi News home page

మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌..

Published Mon, Mar 23 2020 1:32 AM | Last Updated on Mon, Mar 23 2020 7:56 AM

Six More Coronavirus Positive Cases Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 27కు చేరింది. ఆదివారం ఒక్కరోజే ఆరు కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రావడంతో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఉలిక్కిపడింది. 4 రోజుల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యాపారికి కోవిడ్‌ పాజిటివ్‌ రాగా, తర్వాత ఆయన కుమారుడికి శనివారం పాజిటివ్‌ వచ్చింది. ఆదివారం వ్యాపారి  భార్య (50)కు కూడా కోవిడ్‌ సోకింది. ఆమె కూడా భర్తతో కలిసి దుబాయ్‌ వెళ్లొచ్చారు. ఆమెతోపాటు మరో ఐదుగురికి ఆదివారం కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణైంది. వీరిలో ఐదుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. గుంటూరుకు చెందిన 24ఏళ్ల (పెళ్లి కాలేదు) యువకుడు లండన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌ వచ్చాడు. అతను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. (తెలంగాణ@31 దాకా లాక్‌ డౌన్‌) 

హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన యువకుడు (23) లండన్‌ నుంచి దోహా మీదుగా హైదరాబాద్‌ చేరుకోగా అతడికి కూడా కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన 26 ఏళ్ల ఐటీ విద్యార్థి ఈనెల 16న స్వీడన్‌ నుంచి హైదరాబాద్‌ రాగా.. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. అతనికి నగరంలోనే చికిత్స చేస్తున్నారు.రంగారెడ్డి జిల్లా మణికొండకు చెందిన వ్యక్తి (34)కి కూడా కోవిడ్‌ సోకింది. ఇతడు ఈనెల 14న స్వీడన్‌ నుంచి వచ్చాడు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఒక పోలీస్‌ అధికారి కొడుకు (23) ఈ నెల 18న లండన్‌ నుంచి వచ్చాడు. అతనికి కూడా కోవిడ్‌ నిర్ధారణైంది.

రెండో దశకు చేర్చింది అతడే..
ఒకే కుటుంబంలో ముగ్గురికి కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. దుబాయ్‌ నుంచి భార్యతో కలిసి వెళ్లొచ్చిన సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారికి మూడు రోజుల క్రితం పాజిటివ్‌ నిర్ధారణ కాగా, శనివారం ఆయన కుమారుడికి, ఆదివారం ఆయన భార్యకు పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో తొలి లోకల్‌ కాంటాక్ట్‌ కేసు ఇదే. వైరస్‌ను రెండో దశకు చేర్చింది ఈ కేసే అంటున్నారు వైద్య నిపుణులు. ఈ ముగ్గురు.. 11 మందితో కాంటాక్ట్‌ అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వారందరికీ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఆ కుటుంబం నివసిస్తున్న ఇంటి పరిధిలో కిలోమీటర్‌ వరకు అందరి ఇళ్లకు వెళ్లి సర్వే చేస్తూ లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నారు. దీనిపై నిఘా బృందాలు జల్లెడ పడుతున్నాయని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. అయితే వ్యాపారి కొడుకు ద్వారా రాష్ట్రంలో రెండో దశకు కోవిడ్‌ చేరినట్టుగా అధికారులు విశ్లేషిస్తున్నారు. అతడు ఇంకెవరితోనైనా బయట తిరిగాడా అన్నదానిపై నిఘా కొనసాగుతోంది.

జిల్లాల్లోనే ‘ఐసోలేషన్‌’.. హైదరాబాద్‌లో పరీక్షలు
రాష్ట్రంలో కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లో నమోదయ్యే కోవిడ్‌ అనుమానిత కేసులను హైదరాబాద్‌ పంపొద్దని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాల ప్రధాన ఆస్పత్రుల్లో 20 పడకలతో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. కరోనా అనుమానిత లక్షణాలున్న వారిని ఇకపై తొలుత అక్కడికే తీసుకెళ్తారు. అక్కడే నమూనాలను సేకరించి హైదరాబాద్‌ పంపుతారు. ఒకవేళ పాజిటివ్‌ వస్తే తదుపరి చికిత్సకు హైదరాబాద్‌ తరలించాలని ఆదేశించారు. ఇక కోవిడ్‌ కట్టడికి ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల ఆదివారం భేటీ అయ్యారు. (చదవండి : కరోనా సమయాలు)

కోవిడ్‌ కేసుల్లో ఎవర్ని రిఫర్‌ చేయాలనే దానిపై ఈ బృందం కొన్ని మార్గదర్శకాలు రూపొందించి, ప్రభుత్వానికి అందజేసింది. ప్రస్తుతం గాంధీ, ఛాతీ ఆస్పత్రుల్లో ఏర్పాటుచేసిన కోవిడ్‌ ప్రత్యేక వార్డులు దాదాపు నిండిపోయాయి. దాంతో కింగ్‌కోఠి ఆస్పత్రిలో పూర్తిగా కోవిడ్‌ కేసులకు చికిత్స అందించాలని నిర్ణయించారు. దీంతో ఆ ఆస్పత్రిలోని ఇతర రోగుల్ని ఇప్పటికే తరలించారు. మున్ముందు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. గచ్చిబౌలిలోని క్రీడాగ్రామాన్ని ఇప్పటికే ఐసోలేషన్‌ కోసం సిద్ధం చేయగా, అవసరాన్ని బట్టి దాన్ని పూర్తిస్థాయి ఆస్పత్రిగా మార్చాలనుకుంటున్నారు. 

ఈ పని అప్పుడే చేసి ఉంటే..
ఇప్పటిదాకా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగినవారిని తొలుత సర్కారు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు పంపేవారు. తమకు ఇంటివద్ద సదుపాయాలున్నాయని, స్వచ్ఛందంగా క్వారంటైన్‌లో ఉంటామని హామీ ఇవ్వడంతో వారందర్నీ ఇళ్లకు పంపేశారు. కానీ అందులో కొందరి ఇళ్ల వద్ద అటువంటి సౌకర్యాలు లేవని తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం 6వేల మందితో కూడిన ఇంటెలిజెన్స్‌ బృందాలను రంగంలోకి దింపింది. ఒక గ్రామంలో సర్పంచ్, వీఆర్వో, ఆశ, కానిస్టేబుల్‌ను బృందంగా ఏర్పరిచి, వారి ద్వారా ఊళ్లోకి విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సేకరించిన వివరాలను స్థానిక వివరాలతో పోల్చి చూస్తున్నారు. ఎవరైనా మిస్‌ అయితే వారి కోసం పోలీసు బృందాలతో గాలిస్తున్నారు.

మార్చి 1 తరువాత విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను ఇలా సేకరిస్తున్నారు. ఒక గ్రామం నుంచి అసలు ఎంతమంది విదేశాలకు వెళ్లారు? వారి పేర్లు, వయసు, ప్రస్తుతం ఏ దేశంలో ఉంటున్నారో గ్రామస్థాయిలోనే జాబితా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి వస్తున్న వారి చేతికి ప్రత్యేకమైన ఇంకుతో ‘క్వారంటైన్‌’ముద్ర వేస్తున్నారు. తప్పించుకు తిరుగుతున్న వారు ఈ ముద్ర ద్వారా ఎక్కడికపోయినా దొరికిపోతున్నారు. ఈ విధానాన్ని మార్చి 1 నుంచే అమలు చేసి ఉండాల్సిందని వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు తలలు పట్టుకుంటోంది. మొదట్లోనే ఇలా చేసి ఉంటే అనుమానితులంతా క్వారంటైన్లో ఉండేవారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement