తూర్పు డివిజన్‌కు సాగునీరందించే టూ టీఎంసీ రిజర్వాయర్ నిర్మాణ పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. మూడేళ్లలో పూర్తి కావాల్సిన పనులు ఆరేళ్లయినా కొలిక్కి రాకపోగా ప్రభుత్వం మరో నెల గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. భూసేకరణకే దిక్కులేకపోగా నెల రోజుల్లో పనుల పూర్తి అసంభవమే కానుంది.
ముత్తారం : ముత్తారం మండలం మచ్చుపేట పరిధి శుక్రవారంపేట చింతలచెరువు వద్ద రెండు టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 సెప్టెంబర్ 19న శంకుస్థాపన చేశారు. ముత్తారం, కమాన్‌పూర్ మండలాల్లోని 21 గ్రామాల పరిధిలోని 20 వేల ఎకరాలకు సాగునీరందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. రూ.102.07 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు మూడు సంవత్సరాల్లో పనులు పూర్తి చేయాలని గడువు విధించారు. కాంట్రాక్టును మెగా ఇంజినీరింగ్ కంపెనీ సంస్థ దక్కించుకుంది.
చింతల చెరువును రిజర్వాయర్‌గా ఆధునికీకరించి 45.55 కిలోమీటర్ల పొడవున కాలువలు ఏర్పాటు చేసి సాగునీరందించేలా ప్రణాళికలు రూపొందించారు. చెరువును ఇప్పటివరకు ఆధునికీకరించలేదు. ప్రధాన కాలువ తూము నిర్మాణ పనులు అర్ధంతరంగానే నిలిచిపోయాయి. రిజర్వాయర్ నుంచి ఓడేడ్ వరకు 13.5 కిలోమీటర్ల పొడవు ప్రధాన కాలువ నిర్మించాల్సి ఉండగా 5.5 కిలోమీటర్ల పొడవు ప్రధాన కాలువ నిర్మించారు. మధ్యమధ్యలో లైనింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 32 కిలోమీటర్ల పొడవు ఉపకాలువలు నిర్మించాల్సి ఉండగా 15 కిలోమీటర్ల పొడవు మాత్రమే నిర్మాణం పూర్తయింది. ఇందులో కూడా అక్కడక్కడ లైనింగ్ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. కాలువల నిర్మాణానికి 563.11 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉండగా 120 ఎకరాల భూసేకరణ మిగిలిపోయింది. తమ ఆమోదం లేకుండా ఇష్టం వచ్చినట్లు పరిహారం చెల్లిస్తూ తమ భూముల్లో దౌర్జన్యం కాలువలు తవ్వుతున్నారని కేశనపల్లి రైతులు కోర్టును ఆశ్రయించడంతో భూసేకరణలో జాప్యం జరుగుతోంది. కోర్టులో వేసిన పిటిషన్ వెకేట్ అయినా నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం చెల్లించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. మూడేళ్ల క్రితమే గడువు పూర్తికాగా, క్షేత్రస్థాయి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం మరో మూడేళ్లుగా గడువు పొడిగిస్తూ వచ్చింది.
ఇప్పటి వరకు రూ.70 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ.32 కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది. ప్రాజెక్టు పనుల పూర్తికి డిసెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు పొడిగించినా అప్పటిలోగా పనులు పూర్తికావడం అనుమానంగానే ఉంది. ఆరేళ్లలో పూర్తికాని పనులు మరో నెలరోజుల్లో పూర్తవడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని రిజర్వాయర్ పనులు వేగవంతం చేసి సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటేశ్వర్లును ‘సాక్షి’ వివరణ కోరగా రైతులు సహకరిస్తే జూన్‌లోగా పనులు పూర్తి చేసి సాగునీరందిస్తామని తెలిపారు.
నత్తనడకన ‘టూ టీఎంసీ’
Published Thu, Dec 4 2014 1:35 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement