నేతలకు పట్టని పోతిరెడ్డిపాడు | Leaders took the potireddipadu | Sakshi
Sakshi News home page

నేతలకు పట్టని పోతిరెడ్డిపాడు

Published Wed, Aug 7 2013 3:26 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

Leaders took the potireddipadu

సాక్షి ప్రతినిధి, కర్నూలు: నదుల ప్రవాహం కట్టలు తెంచుకుంది. ప్రధాన జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ 204 టీఎంసీలకు చేరింది. 10 గేట్లు తెరిచి దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. రేపో మాపో సాగర్ గేట్లు కూడా తెరిచి లక్షలాది క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలడం కూడా ఖాయమైంది. కానీ... కృష్ణాను ఆనుకొని ఉన్న మన జిల్లాలో మాత్రం చెరువులు, కుంటలు నిండని పరిస్థితి.
 
 రెండు నదులు పక్కనుంచే పారుతున్నా... జలాశయాలు నిండినా... ఈసారైనా కరువుతీరా ఖరీఫ్‌ను సాగుచేసుకుంటామో లేదో తెలియని అయోమయంలో జిల్లా రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. దివంగత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే నాథుడు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. శ్రీశైలం నిండుకుండలా మారినా... పక్కనే ఉన్న వెలుగోడు రిజర్వాయర్ సాధారణ సామర్థ్యానికి రావడానికి ఇంకెన్ని రోజులు వేచిచూడాలో అర్థం కాని పరిస్థితి. తుంగభద్ర నుంచి దిగువకు లక్షన్నర క్యూసెక్కుల వరదనీరు వదులుతున్నా... ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని 16 మండలాలకు నీరందించే ఎల్‌ఎల్‌సీకి నీరు వదిలేందుకు కర్ణాటక అధికారులకు మనసొప్పడం లేదు. తద్వారా జిల్లా రైతాంగం ఖరీఫ్ మీద పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరవుతున్నాయి.
 
 44వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచడం కలేనా?
 పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రవాహ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచాలన్న డిమాండ్ నెరవేర్చడంలో పాలకులు విఫలమవుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో 21.12.2005న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అనంతపురం జిల్లాలోని పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్)కు 10 టీఎంసీల నీరు సరఫరా చేయడంతోపాటు, కర్నూలు జిల్లాలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచాలని అన్ని పార్టీలు తీర్మానించాయి.
 
 ఇందులో భాగంగా శ్రీశైలం కుడికాల్వను వెడల్పు చేసి లైనింగ్ ద్వారా బనకచర్ల కాంప్లెక్స్ వద్ద కూడా 44వేల క్యూసెక్కుల ప్రవాహానికి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసేందుకు జీవోనెంబర్ 170ని విడుదల చేస్తూ పరిపాలక అనుమతులు కూడా మంజూరయ్యాయి. అలాగే పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటి సరఫరా 5 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంచుతూ 698 జీవో జారీ అయింది.
 
 అయితే పోతిరెడ్డిపాడు నుంచి పీఏబీఆర్‌కు తిన్నగా నీటిసరఫరా చేసే అవకాశం లేదు. ఈ నీటిని తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ నుంచి సేకరించి పీఏబీఆర్‌కు సరఫరా చేయాలి. ఈ 10 టీఎంసీల నీరు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా సేకరించి కేసీ కెనాల్‌కు సరఫరా చేయాలి. ఈ నీటితో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి వినియోగించాల్సిన నీరు 112 టీఎంసీలకు పెరుగుతుంది. ఈ నీటిని 30 వరదరోజుల్లో సేకరించాలంటే పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44వేల క్యూ సెక్కుల సేకరణకు అనుకూలంగా ఉం డాలి. కానీ 8ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం కొంతమేర సాఫల్యం చెందినా ఎస్‌ఆర్‌ఎంసీ  పూర్తికాకపోవ డం, కాలువల ఆధునికీకరణ పనులు ముందుకు సాగకపోవడంతో జిల్లా వాసులకు అన్యాయం జరుగుతోంది.
 
 పోతిరెడ్డిపాడుకు 12వేల క్యూసెక్కులేనా?
 మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 882.90 అడుగులు. దాదాపు 204 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 4,12,066 క్యూసెక్కులు వచ్చి చేరుతుంటే, ఔట్‌ఫ్లో 2,52,610 క్యూసెక్కులు. విద్యుదుత్పాదనకు మరో 75వేల క్యూసెక్కుల నీటి ని వదులుతున్నారు. దీంతో నాగార్జున సాగర్ సాధారణ సామర్థ్యానికి చేరుకుంటోంది. కానీ శ్రీశైలం బ్యాక్‌వాటర్ ద్వారా సరఫరా కావలసిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు మాత్రం 12వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతున్నారు. 30 వరద దినాల్లో 102 టీఎంసీల నీటిని సేకరించేందుకు ఇదెంత మాత్రం ఉపయోగం కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా... సర్కారు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం విడుదలవుతున్న 12వేల క్యూసెక్కుల నీటిలో 2వేల క్యూసెక్కులు ఎస్‌ఆర్‌బీసీకి, 3000  కేసీ కెనాల్‌కు, 7వేల క్యూసెక్కులు వెలుగోడు రిజర్వాయర్‌కు వదులుతున్నారు. వెలుగోడు రిజర్వాయర్ సామర్థ్యం 12.5 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి మట్టం 3 టీఎంసీలు మాత్రమే. పోతిరెడ్డిపాడు ద్వారా వదులుతున్న 7వేల క్యూసెక్కులతో రోజుకు 0.6 టీఎంసీల వరద నీరు మాత్రమే వీబీఆర్‌కు చేరుతోంది. ఈ లెక్కన రిజర్వాయర్ ఎప్పుడు నిండుతుందో... కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు ఖరీఫ్ సీజన్ మొత్తం ఎలా ఇస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కాగా 30 వరద రోజుల్లోనే పోతిరెడ్డిపాడుకు నీరు విడుదల చేయాలన్న నిబంధన వల్ల 12వేల క్యూసెక్కుల నీటి విడుదల ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement