మెదక్ రూరల్: తొలకరి చినుకుల పలకరింపుతో కోరలుచాచిన మృత్యువు విషం జిమ్ముతోంది. వానాకాలం ప్రారంభమైందంటే చాలు బుసలు కొడుతున్న పాములు కాటేసేందుకు మాటేస్తున్నాయి. ఆదమరిచి అడుగు వేస్తే పాముకాటుకు బలయ్యే ప్రమాదం పొంచి ఉంది. విషసర్పాల కాటుకు ఎంతో మంది అభాగ్యులు అర్ధాంతరంగా తనువు చాలిస్తుండటంతో బాధిత కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. దీనిపై సాక్షి కథనం...
జిల్లాలో ప్రతి ఏటా పాముకాటుకు గురై పదుల సంఖ్యలో మృతి చెందుతున్నారు. ఇందులో రైతులు, చిన్నారుల సంఖ్యనే అధికంగా ఉంది. వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు బుసలు కొడుతున్న పాములు చల్లదనాన్ని వెతుక్కుంటూ భయటకు వస్తుంటాయి. తొలకరి చినుకులకు ఎక్కువగా పెరిగిన చెట్ల పొదలు, పాత నివాస గృహాలలోకి, కప్పలు, ఎలుకలు, క్రిమిసంహారకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాముల సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తూ కొందరు, ఇంటి పరిసరాల్లో మరికొందరు, రాత్రి సమయంలో ఇంట్లో నిద్రపోతుండగా ఇంకొందరు పాముకాటుకు బలవుతున్నారు. ఖరీఫ్ ప్రారంభమవడంతో పంటసాగు కోసం రాత్రింబవళ్లు తేడా లేకుండా రైతులు వ్యవసాయ పనులు చేసేందుకు పొలాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో చల్లదనానికి భయటకు వచ్చే పాములు కాటేసే అవకాశముంది. అలాగే మైదానాలలో ఆడుకునే చిన్నపిల్లలకు, రాత్రి వేళల్లో నివాస పూరిగుడిసెల్లో నిద్రపోతున్న సమయాల్లో విషసర్పాలు కాటువేసే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాముకాటుకు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయని నాటువైద్యులను ఆశ్రయించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కాగా పాముకాటుకు గురవకుండా ముందుజాగ్రత్త చర్యలుగా ప్రజలకు అర్థమయ్యో విధంగా నాటు వైద్యాన్ని ఆశ్రయించొద్దని, ప్రభుత్వ ఆసుపత్రులలో పాముకాటుకు నివారణ వ్యాక్సిన్‌లు ఉన్నాయని గ్రామాలల్లో వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా అధికారులు విసృత్త ప్రచారం నిర్వహించాల్సి ఉండగా, అది ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాముకాటు పై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసనరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
⇔ పొలం పనులు చేసే రైతులు, అడవుల్లో కట్టెలు, ఆకుల కోసం తిరిగే వ్యక్తులు, పూరి గుడిసెల్లో నివసించే వ్యక్తులు విషసర్పాల బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
⇔ రైతులు రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా టార్చిలైట్‌ను వెంట తీసుకెళ్లాలి.
⇔ కప్పలు, ఎలుకలు ఎక్కువగా ఉండే చోట పాములు సంచరిస్తుంటాయి. అది దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండి పనులను చేసుకోవాలి.
⇔ పాములు ఎక్కువగా మోకాల కింది భాగంలోనే కాటువేస్తాయి. కాబట్టి కాళ్లు పూర్తిగా కప్పినట్లుగా ఉండే చెప్పులను ధరించి, కాళ్ల కిందికి ఉండేలా బట్టలను వేసుకోవాలి.
⇔ పాముకాటుకు గురైతే ఆందోళనకు గురికాకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి.
ప్రథమ చికిత్స:
⇔ పాముకాటుకు గురైన వ్యక్తికి ప్రమాదం లేదని ధైర్యం చెప్పాలి.
⇔ కాటువేసిన చోట సబ్బుతో శుభ్రంగా కడగాలి.
⇔ పాముకాటుకు గురైన వెంటనే కంగారుపడి నాటు వైద్యులను ఆశ్రయించకూడదు.
⇔ పాముకాటు వేసినప్పుడు నోటితో కాని బ్లేడుతో కాని గాట్లు పెట్టకూడదు.
⇔ కాటువేసిన చోటుకు మూడు అంగులాల పై భాగాన బట్టతో కట్టాలి.
⇔ ప్రథమ చికిత్స అందించిన వెంటనే ఏరియా ఆస్పత్రికి, లేదా దగ్గరలోని అర్హులైన వైద్యులను సంప్రదించాలి.
నాటు వైద్యం ప్రమాదకరం
పాములు అన్నీ విషపూరితమైనవి కాకున్నా అప్రమత్తంగా ఉండాలి. పాముకాటుకు గురైన చాలా మంది అవగాహనలేమితో నాటు వైద్యులను ఆశ్రయించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీ సెంటర్‌లలో పాముకాటుకు సంబంధించిన వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. పాముకాటుకు గురైనప్పుడు అనవసరంగా కంగారుపడి కాటువేసిన చోట నోటితో కాని బ్లేడుతో కాని గాట్లు వేయకూడదు. పాముకాటుకు గురైన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు, రైతులు జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోవాలి. గ్రామాల్లో వైద్యారోగ్య సిబ్బందిచే పాముకాటు పై అవగాహన కల్పిస్తున్నాం. –వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి, మెదక్
Comments
Please login to add a commentAdd a comment