మాది పెద్దపల్లి మండలం కాసులపల్లి. వ్యవసాయ కుటుంబం. వారసత్వంగా మా తాత నుంచి వందలాది ఎకరాల స్థిరాస్తి వచ్చింది. మా ఊళ్లోనే అయిదో తరగతి వరకు చదువుకున్నా. తర్వాత అమ్మమ్మ వాళ్ల ఊరు గర్రెపల్లిలో హైస్కూల్ చదివినా. రోజు నాలుగు కిలోమీటర్లు నడిచి బడికెళ్లినా. సుల్తానాబాద్‌లో ఇంటర్, మంచిర్యాలలో డిగ్రీ, నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీజీ. ఉత్కల్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ. నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ చదువుకున్నా. మేం ఆరుగురం సంతానం. ముగ్గురు అన్నాదమ్ముళ్లం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు. సోదరుల్లో ఒకరు లాయర్... మరొకరు వ్యవసాయం చేస్తున్నారు.
గాల్లో ఎగరలేదు..
డిగ్రీ పూర్తయ్యాక ఎయిర్‌మేన్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు వెళ్లాలని అనిపించలేదు. ప్రైవేటు పాఠశాల పెట్టిన కొత్తలోనే గవర్నమెంట్ టీచర్ జాబ్ కూడా వచ్చింది. అప్పటికే నా దగ్గర వందమంది పిల్లలు చదువుకుంటున్నారు... ఆ ఉద్యోగం ఎందుకులే అనుకున్నా... వెళ్లలేదు. ఇతరత్రా వ్యాపకాలు.. ఉద్యోగాల కంటే చదువు నేర్పటమే నాకు నచ్చింది. పదిమందికి పాఠాలు చెప్పటం.. పిల్లలకు విద్య నేర్పించటమే ఎంతో సంతృప్తినిస్తుంది. అంతకుమించిన ఆనందమేదీ లేదు.
అప్పటి కాలం వేరు..
నేను ఉన్నత చదువులు పూర్తిచేసిన కాలంలో చదువుకున్నవారి సంఖ్య తక్కువే. ఈ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. తెలిసీ తెలియని తనంతో ఎందరో జనజీవనం వీడిపోయారు. విచక్షణ, వివేచన ఉంటే.. వాళ్లంతట వాళ్లే ఆలోచించే శక్తి ఉంటే ప్రజలు తమంతట తాముగా బాగుపడుతారు. సమాజం కూడా బాగుపడుతుందని నమ్మినవాణ్ని. అందుకే అందరు చదువుకోవాలి. అందరికీ చదువు రావాలి. చదువు నేర్పితేనే నా వంతుగా సమాజానికి సేవ చేసినట్లు అవుతుంది. నాకు జీవనోపాధి దొరుకుతుంది. అందుకే విద్యారంగంలో అడుగుపెట్టాను.
ప్రైవేటు బడిలో టీచర్..
మొదట్లో పెద్దపల్లిలోనే ఓ ప్రైవేటు బడిలో టీచర్‌గా పనిచేసినా. రెండేళ్ల తర్వాత నేనే పాఠశాల పెట్టాలని అనుకున్నా. ఓ పూరిపాకలో ఇరవై మంది పిల్లలతో ట్రినిటీ స్కూల్ స్థాపించాను. అదే వరుసలో ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీ. అదీ మొదలు ఇప్పుడు ఎల్‌కేజీ నుంచి పీజీ, ఫార్మసీ, ఇంజనీరింగ్, బీఈడీ, డీఈడీ, ఎంఈడీ.. దాదాపు ఇరవై కాలేజీలున్నాయి. ఏటేటా మా విద్యాసంస్థల్లో 23వేల మంది విద్యార్థులు చదువు నేర్చుకుంటున్నారు. సమకాలికులతో పోలిస్తే విద్యారంగంలో నేనే ఆలస్యంగా అభివృద్ధిలోకి వచ్చాను.
ఇంచుమించు నేను స్కూల్ ప్రారంభించినప్పుడు విజ్ఞాన్ రత్తయ్య స్కూల్ పెట్టాడు. ఇప్పుడు విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీగా ఏర్పడింది. దాంతో పోలిస్తే.. నేను వెనుకే ఉన్నాను కదా. దాదాపు ఇరవై ఏళ్లు నేనే పిల్లలకు సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ పాఠాలు చెప్పాను. ఇప్పటికీ తీరిక దొరికితే మా స్కూళ్లలోనే ఎక్కువ సమయం గడుపుతా. అన్నింటినీ నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తా. ఎమ్మెల్యే అయ్యాక విద్యాసంస్థల బాధ్యతలను నా కుమారుడు ప్రశాంత్‌రెడ్డికి అప్పగించినా. ఇప్పుడు ఆయనే ట్రినిటీ విద్యాసంస్థల ఛైర్మన్.
రాజకీయాలంటే..
పుట్టి పెరిగిన ప్రాంతం కావటం, ఒక స్కూల్ కరస్పాండెంట్‌గా దాదాపు ఇరవై అయిదు ఏళ్లుగా ఇక్కడే ఉండటంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంబంధాలు ఏర్పడ్డాయి. చాలాసార్లు వాళ్లను కలవటం, మాట్లాడటం, వీలైనన్ని పద్ధతుల్లో వారిని తీర్చిదిద్దటం జరిగింది. మారుతున్న సమాజంలో ప్రజలకు సేవచేసే రంగాలెన్నో ఉన్నాయి. కానీ.. రాజకీయాల్లో ఉంటే ప్రజలను మరింత చైతన్యవంతులను చేయవచ్చు. అధికారం గుప్పిట్లో ఉంటే ప్రజలకు మరింత సేవ చేసేందుకు అవకాశముంటుంది. మనకున్న ఆలోచనను, విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు అభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకున్నా.
ఉద్యమంతోనే ఎంట్రీ
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉడతాభక్తిగా నావంతు సహాయ సహకారాలు అందించాలని అనుకున్నా. మూడేళ్ల కిందటే రాజకీయాల్లోకి వచ్చినా. టీఆర్‌ఎస్‌లో చేరినా. పార్టీలో చేరేటప్పుడే ఏదో ఒక పదవి, ఏదో ఒక అవకాశం వస్తుందని అనుకున్నా. మా బాస్ కేసీఆర్‌పైనే నమ్మకం పెట్టుకున్నా. అదే నిజమైంది. పార్టీ టిక్కెట్టు ఇచ్చి నన్ను పోటీ చేయమన్నారు. కష్టపడ్డాను.. నిర్విరామంగా ప్రజల్లో ఉండటంతోనే విజయం నన్ను వరించింది. విజయం తనంతట తానుగా ఎవరి దరి చేరదని నమ్మే వ్యక్తిని నేను. చిన్నప్పటి నుంచీ కష్టపడటం నేర్చుకున్నా. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది.
డ్రీమ్ ప్రాజెక్టు
తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాను. ప్రజలకు ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉంటాయి. అన్నింటినీ నెరవేర్చటం ఎవరివల్లా కాదు. నియోజకవర్గ స్థాయిలో అధికారుల సహకారంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ పక్కాగా ప్రజలకు చేరేందుకు ప్రయత్నిస్తాను. పత్తి పంట వేసి నష్టపోయినా.. వరిపొలం దెబ్బతింది.. అని రైతులు బాధ పడకూడదు. ప్రత్యామ్నాయంగా వ్యవసాయ అనుబంధ రంగాలను వృద్ధి చేయాలి. డెయిరీ, హార్టికల్చర్.. ఏదో ఒక తీరుగా రైతుకు అదనపు ఆదాయ వనరులు ఉండేలా ఒక ప్రాజెక్టు ఉండాలనేది నా డ్రీమ్.
సోషల్ మాస్టర్
Published Sun, Aug 3 2014 4:07 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM
Advertisement
Advertisement