సాక్షి, సిటీబ్యూరో: రోడ్ల మీద, ఖాళీ ప్రదేశాల్లో చెత్త, డెబ్రిస్ వేయడం, అనధికారికంగా కటౌట్లు, బ్యానర్ల ఏర్పాటు, తదితర పలు ఉల్లంఘనలకు సంబంధించి పౌరులు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.ఈ అంశాలపై బాధ్యులకు ఈ–చలాన్లు జారీ చేస్తోన్న జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం ఇకపై ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల వంటి సోషల్‌మీడియా ద్వారా అందే ఫిర్యాదులపైనా ఈ చలాన్లు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ప్రభుత్వ స్థలాలు, లేఔట్ ఖాళీస్థలాలు, పార్కులు, చెరువుల కబ్జాలను నిరోధించేందుకు యాంటీ ఎన్‌క్రోచ్‌మెంట్ సెల్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. ప్రజలెవరైనా తమ దృష్టికి వచ్చిన ఆక్రమణలను ఈసెల్ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారమివ్వవచ్చు. ఈ రెండు కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలో అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఈవీడీఎం విభాగంలోని దాదాపు 400 మందికి మాత్రమే సంబంధిత యాప్ లాగిన్ ఐడీలున్నాయి. వారు ఉల్లంఘనలకు సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేయడం ద్వారా ఈపెనాల్టీలు(చలానాలు) జారీ అవుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 14 టెర్మినళ్లలో నాలుగింటిని సోషల్‌మీడియా ద్వారా అందే ఫిర్యాదులను స్వీకరించి చలాన్లు జారీ చేయనున్నారు.
ట్విట్టర్, ఫేస్‌బుక్ హ్యాండిల్స్‌తో ఫిర్యాదుల్ని స్వీకరించనున్నారు. చాలినన్ని టెర్మినళ్లను సమకూర్చుకున్నాక జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల అధికారులకు, మలిదశలో ప్రజలకు కూడా ఉల్లంఘనల చిత్రాల్ని అప్‌లోడ్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల అధికారులకు ఈ సదుపాయం కల్పించాలంటే దాదాపు వంద టెర్మినళ్లు అవసరమవుతాయని అంచనా. ఈ వివరాలను ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు, పౌరులు దాన్నిసామాజిక బాధ్యతగా గుర్తించాలనే తలంపుతోనే నిబంధనలను అతిక్రమించేవారికి జరిమానాలు విధిస్తున్నామని స్పష్టం చేశారు. గత మూడునెలలుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తోన్న ఈ– పెనాల్టీ సిస్టమ్‌లో కచ్చితత్వం రుజువైందన్నారు. జియోట్యాగింగ్ వల్ల ఉల్లంఘన ప్రదేశంతోపాటు ఫొటో తేదీ, సమయం తదితర వివరాలుంటాయన్నారు. ఉల్లంఘనల ఫొటోలు తీసేవారికి, చలానా జారీ చేసేవారికి, నోటీసు అందజేసే వారికి సంబంధం ఉండదన్నారు. పెనాల్టీలకు సంబంధించిన ఈ–నోటీస్‌లకు యూనిక్ నెంబర్, క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, తద్వారా తప్పుడు నోటీసులకు తావుండదని తెలిపారు.నోటీసు గడువు ముగిశాక తదుపరి నోటీసుకు సంబంధించి సిస్టమే ఆటోమేటిక్‌గా అధికారిని అలర్ట్ చేస్తుందని తెలిపారు. ఈ విధానంలో పారదర్శకత, జవాబుదారీ తనం ఉంటాయన్నారు.
3 నెలలు..రూ.16 కోట్ల చలానాలు..
గత మూడు నెలల్లో 4,61,783 అనధికారిక బ్యానర్లు, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, వ్యర్థాల డంపింగ్‌లను తొలగించడంతో పాటు అందుకు కారకులైన వారికి 34,328 ఈ–చలాన్లు జారీ చేసినట్లు విశ్వజిత్ తెలిపారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ.16 కోట్లన్నారు. ఇప్పటి వరకు రూ.60.80 లక్షలు స్వచ్ఛందంగానే చెల్లించారని తెలిపారు. ఈ పెనాల్టీలు చెల్లించని వారికి పెనాల్టీల మొత్తాన్ని వారి ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్సుల్లో కలిపి వసూలు చేస్తామన్నారు. అక్రమ ఫ్లెక్సీలు, పోస్టర్లను గుర్తించేందుకు ప్రచురణకర్త, ప్రతుల సంఖ్యను కచ్చితంగా ముద్రించాలని, ఫ్లెక్సీలు, ప్రింటింగ్ ప్రెస్ యజమానులకు నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. అక్రమాలు జరిగేందుకు అవకాశమున్న సందర్భాల్లో జీహెచ్‌ఎంసీలోని అధికారులకు ముందస్తుగానే తెలియజేస్తూ విజిలెన్స్ కార్యకలాపాల్ని ప్రోయాక్టివ్‌గా నిర్వహిస్తున్నామన్నారు. 1842 ఆసుపత్రులకు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలపై నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. వాటిలో దాదాపు 300 ఆసుపత్రులు పేర్లు మార్చుకోవడం, తరలించడం, మూసివేయడం జరిగినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు వెయ్యి ఆసుపత్రులను తనిఖీ చేశామని, మిగతావి నెలాఖరులోపు చేస్తామన్నారు. సమావేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ శ్యాంకుమార్, సీపీఆర్‌ఓ వై.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment