జమ్మూకాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
ఎల్లారెడ్డిపేట : విహారయాత్రకు వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జమ్మూకాశ్మీర్ వరదల్లో చిక్కుకున్నాడు. వారందరినీ అధికారులు శ్రీనగర్‌లోని రాజ్‌భవన్‌కు తరలించారు. వరద ఉధృతితో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉత్కంఠ రేపుతోంది. ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన సురభి వనజ, రామారావు దంపతుల కొడుకు వంశీకృష్ణ మూడేళ్లుగా హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
ఈ నెల 4న తన ముగ్గురు మిత్రులు బాలకృష్ణ, గోపి, మరొకరితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. యాత్రలో భాగంగా జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తుండగా భారీ వర్షాలతో వరదలొచ్చాయి. దీంతో అక్కడున్న వారితోపాటు వంశీకృష్ణ, అతని మిత్రులను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వంశీకృష్ణ ఫోన్‌లో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే శ్రీనగర్‌లోని రాజ్‌భవన్‌లో తలదాచుకున్న వారికి నిత్యం భోజన వసతి లేక ఆకలితో అలమటిస్తున్నారని తమ కొడుకు చెప్పినట్లు తల్లి వనజ కన్నీళ్ల పర్యంతమయ్యారు. కొడుకు క్షేమంగా తిరిగిరావాలని దేవుడికి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.