- టెండర్లలో దేశంలోనే కొత్త రికార్డు
- సగటున యూనిట్‌కు రూ.6.72
- వచ్చేవారంలో టెండర్ల ఖరారు
సాక్షి, హైదరాబాద్: సోలార్‌విద్యుత్ టెండర్లలో కొత్తరికార్డు నమోదైంది. తెలంగాణలో సగటున రూ.6.72కే ఒక యూనిట్ విద్యుత్ లభ్యం కానుం ది. సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి దేశంలో అత్యల్ప సగటురేటు ఇదేనని తెలంగాణ ఎస్‌పీడీసీఎల్ అధికారులు ధ్రువీకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సోలార్‌పవర్ సగటు యూనిట్ రేటు రూ.6.80గా నమోదైంది. అక్కడితో పోలిస్తే కంపెనీలు బిడ్లు దాఖలు చేయడంలో పోటీపడ్డారు. దీంతో సగటురేటు తక్కువగా నమోదైందని టీఎస్ ఎస్‌పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రఘుమారెడ్డి తెలిపారు.
టెండర్ల పరిశీలన ఇటీవలే పూర్తయింది. వారం రోజుల్లో ఎంపికైన కంపెనీల కు ఇండెంట్ లెటర్లు పంపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముందుకొచ్చిన కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. 15 నెలల వ్యవధిలో కంపెనీలు విద్యుత్ సరఫరా చేయాలి. ఆలస్యమైతే జరిమానా విధించే నిబంధనలున్నాయి.
ఒప్పంద సమయంలో ఒక్కొక్క యూనిట్‌కు రూ.20 లక్షల చొప్పున డిస్కంలకు ఆయా కంపెనీలు బ్యాంకుగ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. విద్యుత్ సరఫరాకు నిర్దేశించిన గడువు పూర్తయ్యాక ఆరునెలలు దాటితే ఆ గ్యారంటీ మొత్తాన్ని డిస్కంలు జప్తు చేసుకుంటాయి.
తొలిసారి 500 మెగావాట్ల కొనుగోలు
రాష్ట్రంలో విద్యుత్తు కొరతను అధిగమించేందుకు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ గతనెలలో 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. దాఖలైన బిడ్లలో ఒక కంపెనీ కనిష్టంగా రూ.6.45 రేటును పేర్కొంది. టెండర్లలో పాల్గొన్న 108 కంపెనీలకు 1840 మెగావాట్ల సౌరవిద్యుత్ సమకూర్చే సామర్థ్యం ఉంది. అయితే, ముందుగా 500 మెగావాట్లు కొనుగోలుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
దీంతో తక్కువరేటు ప్రాతిపదికన రూ.6.45 నుంచి రూ.6.90 వరకు ధర కోట్ చేసిన 33 కంపెనీలకు టెండర్లు దక్కే అవకాశముం ది. ఇప్పటికే అధికారులు జాబితాను ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో రెండు మెగావాట్ల నుంచి 100 మెగావాట్లను ఉత్పత్తి చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీలు ఉన్నాయి. తక్కువరేటు కంపెనీల ఆసక్తి దృష్ట్యా 500 మెగావాట్లకు మించి విద్యుత్తు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.