కష్టతరంగా మారిన పేదోడి గూడు
కొత్త సర్కారు వచ్చింది.. రెండు గదుల ఇల్లు కాదు రెండు బెడ్‌రూంల ఇల్లు ఇస్తానన్నాడు. ఇక నాకు ఇంటి సమస్య తీరినట్టేనని భావించారు బడుగులు.. కానీ, ఇది కేవలం మాటలకే తప్ప చేతలకు కాదని తేలిపోయింది. కనీసం బడ్జెట్‌లో వీటి గురించి ప్రస్తావించకపోవడంతో సొంతిల్లు చెట్టెక్కినట్టయింది.
సాక్షి, మహబూబ్‌నగర్: పేదోడికి కాసింత గూడు కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌లో గృహ నిర్మాణ రంగానికి అతి తక్కువ కేటాయింపులు చేయడంతో పేదల సొంతింటి కల... కలగానే మిగిలిపోనుంది. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన రెండు పడక గదుల ఇళ్లు ఈ ఏడాది దాదాపుగా లేనట్లే అని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఇక గత ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి అగాథంలోకి నెట్టినట్టయింది. ప్రభుత్వం సీబీసీఐడీ విచారణ పేరుతో చేస్తున్న కాలయాపన కారణంగా సామాన్యులు నలిగిపోతున్నారు.
పైగా ఇంకా ఇప్పటికీ చెల్లింపులు పూర్తికాని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లుల పరిస్థితిపై అయోమయం నెలకొంది. వీటికి సంబంధించి కూడా బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలో గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు 2,78,447 ప్రశ్నార్థకంగా మారాయి. అందులో 1,91,081 ఇళ్లు పూర్తిగా రద్దయ్యాయి. అదేవిధంగా ఇళ్ల మంజూరు జరిగి ఎంతో కొంత బిల్లు చేసిన ఇళ్ల భవిష్యత్తు కూడా అయోమయంగానే ఉంది.
ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఆన్‌లైన్‌ను కూడా ప్రభుత్వం పూర్తిగా నిలిపేయడంతో దాదాపు 87,366 ఇళ్లకు బిల్లులు రాకుండా మధ్యలోనే నిలిచిపోయాయి. వీటిపై కూడా ప్రభుత్వం రీ వెరిఫికేషన్‌కు ఆదేశించింది. ఇది పూర్తికావడానికి ఎంత సమయం పడుతుందో అధికారులే చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో కొందరు అప్పులు చేస్తుంటే... మరికొందరు మధ్యలోనే నిలిపేశారు.
సగం ఇళ్లు అంతేసంగతి..!
పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నడుం బిగించారు. శ్యాచురేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థికసాయం అందజేయడం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించారు. అందులో భాగంగానే జిల్లాకు మొత్తంగా 5,80,725 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 3,89,644 ఇళ్లు ఆన్‌లైన్‌లో నమోదవగా, 3,02,278 ఇళ్లు పూర్తయ్యాయి. ఇంకా 87,366 ఇళ్లు వివిధ దశలలో పనులు నిలిచిపోయాయి.
అందులో బేసిమెంట్ స్థాయిలో 55,146 (బీఎల్) ఇళ్లు నిలిచిపోయాయి. దర్వాజ స్థాయి (ఎల్‌ఎల్)లో 7,172 ఉన్నాయి. చెత్తు స్థాయిలో (ఆర్‌ఎల్) 25,048 ఇళ్లు అర్థంతరంగా నిలిచిపోయాయి. ఇంకా మొదలుపెట్టని 1,91,081 ఇళ్లను రద్దుచేశారు. దీంతో జిల్లాకు మంజూరైన ఇళ్లలో 2,78,447 అంటే దాదాపు 55శాతం ఇళ్లను తిరిగి ప్రభుత్వం లాగేసుకున్నట్లయింది.
విచారణ పూర్తయ్యేదెన్నడు...?
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు బెడ్‌రూమ్‌లు, హాలు, కిచెన్, అటాచ్డ్ బాతురూం కలిగిన ఇంటిని రూ. 3లక్షల ఖర్చుతో నిర్మిస్తామని చెబుతోంది. అయితే అది కూడా సీబీసీఐడీ విచారణ పూర్తయిన తర్వాతనే అని సీఎం స్పష్టం చేశారు. కానీ జిల్లాలో సీఐడీ విచారణ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతోంది.
ప్రస్తుతంఎంపిక చేసిన అలంపూర్, కొడంగల్ నియోజకవర్గాల్లోని ప్రాంతాల్లో విచారణ సాగింది. ఇప్పటివరకు కేవలం 1,664 ఇళ్లకు సంబంధించి మాత్రమే విచారణ జరిపారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి విచారణ జరగడానికి ఎంత సమయమనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇళ్లకు అనుమతులు, బిల్లుల చెల్లింపు తంతులోని అవకతవకలను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకున్న తర్వాతనే కొత్త లబ్ధిదారుల ప్రక్రియ అంటే కనీసం ఏడాదికి పైగా పట్టే అవకాశముందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.