
త్వరలో రెండు భారీ రైల్వే టెర్మినళ్లు
- వట్టినాగులపల్లి, మౌలాలీలో విస్తరణ
- భూమి కేటాయింపునకు సర్కార్ సంసిద్ధత
- ప్రతిపాదనల రూపకల్పనలో ద.మ.రైల్వే
- జనరల్ మేనే జర్ శ్రీవాస్తవ వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరో రెండు భారీ రైల్వే టెర్మినళ్ల నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలను రూపొందిస్తోంది. మౌలాలి, వట్టినాగులపల్లిలో సకల సదుపాయాలతో విశాలమైన రైల్వేస్టేషన్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ తెలి పారు. గురువారం రైల్ నిలయంలో నూతన రైల్వే టైమ్ టేబుల్ ఆవిష్కరణ సందర్భంగావిలేకరుల సమావేశంలో ఆయన ఈ అంశాన్ని వెల్లడించారు.
సికింద్రాబాద్, నాం పల్లి, కాచిగూడ స్టేషన్‌లలో రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని వట్టినాగులపల్లి, మౌలాలీల్లో స్టేషన్‌ల ఏర్పాటుకు కావలసిన భూమిని అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని అన్నారు. సీఎం కేసీఆర్ ఈ టర్మినళ్ల పట్ల శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. ఈ మేరకు తాము ప్రస్తుతం ప్రతిపాదనలపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.
ముంబయి మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లకు వట్టినాగులపల్లి, కాజీపేట్ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లకు మౌలాలీ ప్రధాన స్టేషన్లుగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ స్టేషన్‌ల నుంచి ప్రయాణికులు నగరంలోకి చేరుకొనేందుకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుపనున్నట్లు జీఎం తెలిపారు.
ఏటా పెరుగుతున్న రైళ్లు...
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లపై ఏటా రైళ్ల ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 85 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో వందకు పైగా ప్యాసింజర్ రైళ్లు, 121 ఎంఎంటీఎస్ రైళ్లు ఈ మూడు స్టేషన్‌ల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి, వేసవి సెలవులు వంటి ప్రత్యేక రోజుల్లో ఈ రద్దీ రెట్టింపవుతోంది. మరోవైపు ఏటా 15 నుంచి 25 కొత్త రైళ్లు ఈ స్టేషన్‌ల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.
దీనికి అనుగుణంగా స్టేషన్‌లను విస్తరించేందుకు అవకాశం లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో రాకపోకల్లో గంటల కొద్దీ జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో ఉదయం 5-6 గంటల మధ్య సికింద్రాబాద్ స్టేషన్‌కు రావలసినరైళ్లలో 80 శాతం గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా చేరుకోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో మౌలాలీని విస్తరించాలని రైల్వేశాఖ ఎప్పటి నుంచో ఆలోచిస్తోంది. దీనివల్ల సికింద్రాబాద్ పైనే కా కుండా కాచిగూడ స్టేషన్ పైనా ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.