
ముంబై తరహా క్యూ..
- ప్రభుత్వం యోచన..
- బస్‌షెల్టర్లు, బస్‌బేల అభివృద్ధి
- బోర్డులపై రాకపోకల డిస్‌ప్లే
- ప్రతి 5-10 నిమిషాలకో బస్సు
- అధికారులకు సీఎం ఆదేశం
సాక్షి,సిటీబ్యూరో: నిత్యం కిక్కిరిసిపోయే బస్సులు... ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణం... బస్టాపుల్లో గంటల తరబడి పడిగాపులు... ఉన్నఫలంగా రద్దయ్యే ట్రిప్పులు...బస్టాపులు, షెల్టర్ల వద్ద ఆగని బస్సులు.. మరోవైపు ట్రాఫిక్ రద్దీ. ప్రతిరోజు నరకాన్ని చవిచూస్తున్న లక్షలాది మంది ఆర్టీసీ ప్రయాణికుల బాధలపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ప్రజలకు మె రుగైన, నాణ్యమైన రవాణా సదుపాయం అందజేసేందుకు ప్రణాళికలను రూపొందించే పనిలో పడింది.
ప్రజా రవాణా, ట్రాఫిక్ రద్దీ, నగ రంలో బస్‌షెల్టర్లు, తదితర అంశాలపై సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ వివి ద ప్రభుత్వ విభాగాలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా ముంబైలో ప్రయాణికులు బస్సెక్కేందుకు పాటిస్తున్న ‘క్యూ’ పద్ధతిని హైదరాబాద్‌లోనూ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రయాణికులు ఒక్కసారిగా తోసుకుంటూ ఎక్కాల్సిన అవసరం, ఆందోళన లేకుండా ప్రయాణం చేసేందుకు ఈ క్యూ పద్ధతి బాగుంటుందని సీఎం అధికారులతో అన్నారు.
ఇందుకు అనుగుణంగా ఆయా రూట్లలో ప్రయాణికుల రద్దీ మేరకు, వారు ఎక్కువసేపు బస్టాప్‌లో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ప్రతి 5 లేదా 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. పడిగాపులు లేకుండా బస్సుల రాకపోకలను కూడా అన్ని ప్రధాన బస్టాపుల్లో ఎల్‌ఈడీ బోర్డులపై ప్రదర్శించాలని, సమయపాలనకు ప్రాధాన్యతం ఇవ్వాలని ఆదేశించారు. ఫుట్‌బోర్డింగ్ లేకుండా ప్రయాణికులు ప్రశాంతంగా, గౌరవప్రదంగా ప్రయాణం చేసేలా బస్సుల నిర్వహణ ఉండాలని సీఎం సూచించారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా..
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా ప్రజారవాణాను బలోపేతం చేయాలని ఆర్టీసీ అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. పరిశుభ్రమైన బస్సులను, బస్‌షెల్టర్లను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. కొత్త బస్సులను కొనుగోలు చేయాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలను అందజేసేందుకు ప్రణాళికల రూపకల్పనపై దృష్టి పెట్టామని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
ఇదీ ‘గ్రేటర్’లో ఆర్టీసీ ప్రగతి...
డిపోలు: 28,
బస్సులు: 3850
రూట్లు: 1052, రోజూ తిరిగే ట్రిప్పులు: 42 వేలు
వివిధ కారణాల వల్ల రోజూ రద్దయ్యే ట్రిప్పులు: 5 వేలు
రోజూ సిటీబస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య: 34 లక్షలు
గ్రేటర్ ఆర్టీసీకి రోజూ లభించే ఆదాయం: రూ.2.5 కోట్లు