సాక్షి, హైదరాబాద్: ఓ ఐడియా.. దక్షిణ మధ్య రైల్వేకు భారీ పొదుపుతోపాటు రైల్వే శాఖ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. లాభాలను పెంచుకోవాలంటే కేవలం ఆదాయంలో పెరుగుదల ఒక్కటే కాదు, వ్యయాన్ని తగ్గించటం కూడా చేయాలి. ఇదే మార్గాన్ని దక్షిణ మధ్య రైల్వే అనుసరిస్తోంది. ఓ వైపు సరుకు రవాణాను ఏటా భారీగా పెంచుకుంటూ.. మరోవైపు నిర్వహణ వ్యయానికి ముకుతాడు వేయటం ద్వారా లాభాల మొత్తాన్ని పెంచుకుంటోంది. రైల్వే స్టేషన్లు, సర్వీస్ భవనాల్లో విద్యుత్ రూపంలో అవుతున్న ఖర్చును తగ్గించే క్రమంలో చేపట్టిన చర్యలు ఇప్పుడు భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వేకు ప్రత్యేక స్థానం దక్కేలా చేశాయి. ఇందుకోసం చేపట్టిన చర్యల వల్ల దక్షిణ మధ్య రైల్వే ఏకంగా ప్రతినెలా రూ.కోటి చొప్పున పొదుపు చేయగలుగుతోంది.
సర్వం ఎల్‌ఈడీ మయం..
గడిచిన ఏడాది కాలంలో దక్షిణ మధ్య రైల్వే 100 శాతం ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేసుకుంది. రైల్వే స్టేషన్లకే పరిమితం కాకుండా అన్ని రైల్వే కార్యాలయా ల్లో సంప్రదాయ బల్బులు తీసి ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేసింది. ఇలా 100 శాతం ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటైన తొలి రైల్వే జోన్‌గా రికార్డు సాధించింది. ఇక్కడితో ఆగకుండా అన్ని ప్రధాన రైల్వే భవనాలపై సౌర విద్యుత్తు ఫలకాలు ఏర్పాటు చేసి 5.4 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. సాధారణ ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లు, ఇన్వర్టర్లు తొలగించి వాటి స్థానంలో 5 స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ ఉపకరణాలు ఏర్పాటు చేస్తోంది. దీంతో భారీగా విద్యుత్ వ్యయం తగ్గి.. ప్రతినెలా రూ.కోటి వరకు ఆదా అవుతోంది. మరోవైపు దాదాపు 4,900 టన్నుల మేర కర్బన ఉద్గారాల నియంత్రణ జరుగుతోంది. ఫలితంగా వాతావరణ కాలుష్యం కూడాతగ్గింది.
జీఎం వినోద్‌కుమార్‌కు పురస్కారం
రైల్వేల పనితీరు, సామర్థ్యం మెరుగుపరచడంలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి పురస్కారాలు రైల్వే శాఖ తాజాగా ఇవ్వాలని నిర్ణయించింది. 100 శాతం ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు, స్టార్ రేటింగ్ విద్యుత్ ఉపకరణాల బిగింపు, సొంతంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి, సహజ సిద్ధంగా సూర్య కాంతి పడేలా పరికరాలు బిగించి సంప్రదాయ విద్యుత్‌ను ఆదా చేయటం.. తదితరాలతో దక్షిణ మధ్య రైల్వే టాప్‌గా నిలిచింది. దీంతో ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్.. దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మూడు రోజుల క్రితం ఆయనకు ‘బెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇనీషియేటివ్’పురస్కారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది. మరోవైపు రైల్వే స్థలాల్లోని పాడుబడ్డ బావులను పునరుద్ధరించటం, నీటి రీ సైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుతో దాదాపు రూ.3 కోట్ల వరకు ఆదా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment