
సాక్షి, హైదరాబాద్ : లాక్‌డౌన్ కారణంగా నగరంలో చిక్కుకున్న బ్రిటన్ దేశస్తులను శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆ దేశానికి తరలించారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ప్రత్యేక విమానం బీఏ (9116 /బీఏ 9117) శుక్రవారం సాయంత్రం 4.59 గంటలకు బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. సాయంత్రం 6.46 గంటలకు 136 మంది యూకే జాతీయులను విమానంలో ఎక్కించుకుని అహ్మదాబాద్‌కు వెళ్లింది. అక్కడ మరికొందరు ఆ దేశానికి చెందిన వారు సైతం అదే విమానంలో ఎక్కారు. అక్కడి నుంచి తిరిగి బహ్రెయిన్ మీదుగా లండన్‌కు బయలుదేరింది.
శానిటైజ్ చేసిన టెర్మినల్ సిద్ధం చేశాక..
ఈ ప్రయాణికుల కోసం శంషాబాద్ విమానాశ్రయంలో పూర్తిగా శానిటైజ్ చేసిన ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ టెర్మినల్‌ను సిద్ధంగా ఉంచారు.యూకే డిప్యూటీ హై కమిషన్, తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న బ్రిటన్ ప్రయాణికులు మధ్యాహ్నం 3.30 గంటలకే విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ఎస్.జి.కె. కిశోర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో చిక్కుకున్న వివిధ దేశాలకు చెందిన వారిని ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక విమానాల్లో ఆయా దేశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.యూకే డిఫ్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ తెలుగురాష్ట్రాల్లో ఉన్న తమ దేశానికి చెందిన పౌరులు స్వదేశానికి తరలి వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4 వేల మందికి పైగా బ్రిటిష్ పర్యాటకులను తమ దేశానికి పంపించినట్లు చెప్పారు.
స్వదేశాలకు తరలిన 600 మంది.....
లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో ఉండిపోయిన వివిధ దేశాలకు చెందిన 600 మందిని హైదరాబాద్ æ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 8 ఎవాక్యుయేషన్ విమానాల ద్వారా జర్మనీ, అమెరికా, యూకే, తదితర దేశాలకు తరలించారు. ఒకవైపు నిరంతరం ప్రత్యేక విమానాల ద్వారా ప్రయాణికులను తరలిస్తూనే మరో వైపు నిత్యావసర వస్తువుల సప్లై చెయిన్ విమానాలను నడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment