
పరిశ్రమలకు పవర్
పత్యేక కోటా కేటాయించాలని టీ-సర్కార్ యోచన
రాష్ర్ట వ్యాప్తంగా అన్ని పరిశ్రమలు ఒకే గొడుగు కిందకు
అధ్యయనం చేసేందుకు ఓ సంస్థకు బాధ్యతల అప్పగింత
కరెంట్ సమస్య లేకుండా చేస్తామంటున్న ఇంధన శాఖ
సాక్షి, హైదరాబాద్:
పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేయాలని భావిస్తున్న తెలంగాణ సర్కారు ఆ దిశగానే అడుగులు వేస్తోంది. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామంటున్న కేసీఆర్ ప్రభుత్వం.. పరిశ్రమలకు కీలకమైన కరెంట్ విషయంలోనూ సరికొత్త యోచన చేస్తోంది. వాటి కోసం ప్రత్యేకంగా ఓ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)నే ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ డిస్కం ద్వారా రాష్ర్టం లోని మొత్తం పరిశ్రమలకు విద్యుత్‌ను పంపిణీ చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం విద్యుత్ లోటును పూడ్చుకునేందుకు రాష్ర్టంలో అమలు చేస్తున్న పవర్ హాలిడేలపై పరిశ్రమల యాజ మాన్యాలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్న సంగతి తెలి సిందే. కరెంట్ లేక ఉత్పత్తి తగ్గడంతో వేలాది చిన్న, మధ్యతరహా కంపెనీలైతే మూతపడే పరిస్థితికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణకు వచ్చే మొత్తం విద్యుత్ వాటాలో పరిశ్రమలకు కోటా నిర్ణయించి.. దాన్ని కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమల డిస్కంకు కేటాయించాలని భావిస్తోంది. ఈ కోటాను కేవలం పరిశ్రమలకే వినియోగించడం వల్ల వాటికి విద్యుత్ సమస్య తీరుతుందని అభిప్రాయపడుతోంది. ఈ మేరకు కసరత్తు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పరిశ్రమల కోసం ప్రత్యేకంగా డిస్కం ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఓ సంస్థను నియమించినట్టు సమాచారం. ఈ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లనున్నట్లు ఇంధన శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
పరిశ్రమలకు ప్రత్యేకంగా ఫీడర్లు
తెలంగాణలో ప్రస్తుతం రెండు డిస్కంలు సేవలంది స్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు టీఎస్-ఎస్‌పీడీసీఎల్ ఉండగా.. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు టీఎస్-ఎన్‌పీడీసీఎల్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఆయా జిల్లాల్లోని అన్ని వర్గాల వినియోగదారులకూ ఈ రెండు డిస్కంలే విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నాయి. ఒప్పందాల మేరకు వివిధ కేంద్రాల నుంచి రాష్ట్రానికి వచ్చే మొత్తం విద్యుత్‌లో డిస్కంలకు కోటా ఉంటుంది. మొత్తం విద్యుత్‌లో(తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని డిస్కంలను కలిపి తీసుకుంటే) టీఎస్-ఎస్‌పీడీసీఎల్‌కు 38.07 శాతం, టీఎస్-ఎన్‌పీడీసీఎల్‌కు 15.07 శాతం కోటా విద్యుత్ ఉంది. ఇవి ప్రస్తుతం వ్యవసాయం, గృహావసరాలకే అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఏ మాత్రం లోటు ఏర్పడినామొదట పరిశ్రమలకే కోత పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమల మనుగడకే కీలకమైన కరెంట్ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అవసరమైన మేరకు విద్యుత్‌ను సమకూర్చుకుంటూ.. ప్రత్యేక డిస్కంను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 వేల చిన్న తరహా పరిశ్రమల కనెక్షన్లు, 9 వేల వరకు భారీ పరిశ్రమల కనెక్షన్లు ఉన్నాయి. అయితే వీటికి ప్రత్యేకంగా ఫీడర్లు లేవు. కొన్ని చోట్ల గృహాలకు వెళ్లే ఫీడర్ల ద్వారానే పరిశ్రమలకూ విద్యుత్ సరఫరా అవుతోంది. ఇప్పుడు ప్రత్యేక డిస్కం ప్రతిపాదన తెరపైకి వచ్చినందున.. రాష్ర్టంలోని పరిశ్రమలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు వీలుగా పరిశ్రమలకు ప్రత్యేకంగా ఫీడర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఇంధన శాఖ వర్గాలు వివరించాయి.