రాష్ట్రంలో సుమారు 26 లక్షలకు పైగా చిన్న, సూక్ష్మ పరిశ్రమలు
2014 నుంచి 2023 నడుమ ఏటా 11 నుంచి 15 శాతం వృద్ధి
40 శాతానికి పైగా ఎంఎస్‌ఎంఈలు రాజధాని చుట్టూ కేంద్రీకృతం
ఉపాధికల్పనలో వ్యవసాయంతో చిన్న పరిశ్రమల పోటీ
33 లక్షల మందికి చిన్న పరిశ్రమలతో ఉపాధి
ఎస్‌ఎంఎస్‌ఈల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీల పాత్ర 25 శాతం లోపే
మూతపడుతున్న ఎస్‌ఎంఎస్‌ఈల్లో తెలంగాణలోనే అతి తక్కువ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. గడిచిన పదేళ్లుగా ఈ రంగంలో తెలంగాణలో గణనీయ పురోగతి సాధించింది. తయారీ, సేవా రంగాలతోపాటు రిటైల్, వాణిజ్య రంగాల్లోనూ వీటి పాత్ర అత్యంత కీలకంగా ఉంది. తెలంగాణలోని భారీ ప్రభుత్వ రంగ సంస్థలు, బహుళ జాతి కంపెనీల సరఫరా వ్యవస్థలో ఎంఎస్‌ఎంఈలు విడదీయరాని భాగంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఐటీ, దాని అనుబంధ సేవలు, ఫార్మా, రక్షణ, వస్త్ర, ఆహారశుద్ధి తదితర రంగాలకు సూక్ష్మ, చిన్న, పరిశ్రమలు వెన్నెముకగా ఉన్నాయి.
ఎస్‌ఎంఎస్‌ఈల కచి్చతమైన సంఖ్యపై స్పష్టత లేకున్నా సుమారు 26 లక్షల మేర ఉంటుందని 2015 నాటి నేషనల్ శాంపిల్ సర్వే అంచనా వేసింది. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రకారం 8.93 లక్షలు, టీజీ ఐపాస్ కింద 2014 నుంచి ఇప్పటి వరకు ఎస్‌ఎంఎస్‌ఈలకు ఇచ్చిన అనుమతులు 22,206 ఉన్నాయి. వీటిలో సూక్ష్మ పరిశ్రమలు సుమారు 90 శాతానికి పైగా ఉండగా, ఎక్కువగా మాన్యుఫాక్చరింగ్, సేవలు, రిటైల్, హోల్‌సేల్ రంగాల్లోనే ఉన్నాయి. రాష్ట్ర పారిశ్రామిక చట్టం టీజీ ఐపాస్ ప్రకారం 2014 నుంచి ఎంఎస్‌ఎంఈల నమోదులో గణనీయ పురోగతి నమోదవుతూ వస్తోంది. టీజీ ఐపాస్ కింద సూక్ష్మ, చిన్న పరిశ్రమల నమోదులో ఏటా 11 నుంచి 15 శాతం వృద్ధి కనిపిస్తోంది.
పెట్టుబడుల్లోనూ భారీ వృద్ధి
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. 2014–19లో ఒక్కో పరిశ్రమపై పెట్టుబడి సగటున రూ.కోటి రూపాయలు కాగా, 2023 నాటికి రూ.2.15 కోట్లకు చేరింది. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న సమయంలో ఓ దశలో (2021–22)లో సగటు పెట్టుబడి ఒక్కో పరిశ్రమపై రూ.4 కోట్లకు కూడా చేరుకుంది. ఇదిలా ఉంటే ఎంఎస్‌ఎంఈల్లో ఎక్కువ శాతం రాజధాని హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతమైనట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోనే 40 శాతం ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి.
⇒ రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈ యాజమాన్యాల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళలు 25 శాతంలోపే ఉన్నారు. ఉద్యమ్ పోర్టల్‌లో నమోదైన ప్రతీ వేయిమంది ఎంటర్‌ప్రెన్యూర్లలో మహిళలు కేవలం 3.1 శాతం మాత్రమే ఉన్నారు. ఎంఎస్‌ఎంఈ యాజమాన్యాల్లో ఎస్సీలు 14.94 శాతం, ఎస్టీలు 8.75 శాతం, ఓబీసీలు 27.69 శాతం, జనరల్ 48.62 శాతంగా ఉన్నారు.
⇒ 2020–23 మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా మూతపడిన సూక్ష్మ, పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే అతి తక్కువగా ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలతో పోల్చి చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లో మూతపడగా తెలంగాణలో కేవలం 231 ఎస్‌ఎంఎస్‌ఈలు మాత్రమే మూతపడ్డాయి. ఇదిలా ఉంటే నష్టాలతో మూసివేత బాటలో ఉన్న 1.340 ఎస్‌ఎంఎస్‌ఈలను తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. మూతపడిన మరో 115 చిన్న పరిశ్రమలు తిరిగి తెరుచుకునేలా తోడ్పాటు అందించింది.
⇒ రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాలతోపాటు అత్యధికంగా ఉపాధి కలి్పస్తున్న రంగాల్లో ఎంఎస్‌ఎంఈ కూడా ప్రధాన భూమిక పోషిస్తోంది. వీటిలో సేవల రంగంలోనే సుమారు 33 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. తర్వాతి స్థానంలో ఫుడ్ ప్రాసెసింగ్ 10 లక్షలు, ఖనిజ, ఇంజనీరింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో నాలుగేసి లక్షలకుపైగా మంది ఉపాధి కలి్పస్తున్నాయి.
ఎంఎస్‌ఎంఈ పాలసీ –2024
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను మరింత ప్రోత్సహిస్తే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ‘ఎస్‌ఎంఎస్‌ఈ పాలసీ–2024 ఆవిష్కరించింది. నూతన పాలసీలో భాగంగా ఎస్‌ఎంఎస్‌ఈల ఏర్పాటుకు అందుబాటులో భూమి, రుణ సదుపాయం, ముడి పదార్థాల లభ్యత, కార్మిక నైపుణ్యత, సాంకేతిక వినియోగానికి ప్రోత్సాహం, వ్యాపార విస్తరణకు పలు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తారు. తద్వారా జీఎస్‌డీపీలో ఎంఎస్‌ఎంఈల వాటా 10 శాతానికి చేరడంతో పాటు వాటి నమోదులో 15 శాతం వృద్ధి రేటును ప్రభుత్వం ఆశిస్తోంది.
ఉపాధి కల్పన, సమగ్రాభివృద్ధి, సాంకేతికత ఆధునీకరణ, ఉత్పాదకత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొత్త పాలసీతో ఎంఎస్‌ఎంఈల ద్వారా ఉద్యోగాల కల్పనలో 20 శాతం, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లలో 30 శాతం వృద్ధిని ఆశిస్తోంది. పెట్టుబడుల్లో మరో 2 0 శాతం వృద్ధిని కోరుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment