సాక్షి, హైదరాబాద్/అమరావతి : కరోనా బయటే ఉంది. భయపెడుతోంది. మనం ఇంట్లో ఉంటే అదేం చేయలేదు. అందుకే మనం సేఫ్‌గా ఉండాలంటే ఇంట్లోనే ఉండాలి. ఈ వారం రోజులు గడప దాటొద్దు. మనకు రాలేదు కదా అనే ధీమా.. మనకేమవుతుందిలే అనే నిర్లక్ష్యం వద్దు. ఆదివారం మనం కనబరిచిన బాధ్యతను రానున్న కొద్ది రోజులు మరింత నిబద్ధతగా కొనసాగించాలి. ఇది ఒకరి కోసం మరొకరు.. అందరూ పాటించాల్సిన ‘ఆరోగ్య ధర్మం’. కల్లోల సమయంలో ఎలా ఉండాలో, సమాజం, దేశం పట్ల ఎంత నిబద్ధతతో వ్యవహరించాలో మనకు కరోనా నేర్పిస్తోంది. ప్రస్తుతానికి కరోనాకు మన స్వీయ నియంత్రణే ఔషధం. అది సాధ్యం కావాలంటే మనం స్వీయ క్రమశిక్షణ పాటించాలి. ఇది ఇంట్లోనే కూర్చుని ప్రదర్శించే దేశభక్తి వంటిది. మనం మన ఇంట్లో ఉంటే చాలు.. ఇరుగుపొరుగు అందరికీ మేలు. అందరం ఇది పాటిస్తే మనల్ని, మన కుటుంబాన్ని, పొరుగు వారిని, గ్రామాన్ని, మండలాన్ని, జిల్లాను, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకున్నట్టే. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు చేస్తున్న సూచనలు, ఇస్తున్న ఆదేశాలను కచ్చితంగా పాటించాలి.
ఒక్క వారం త్యాగం చేయలేమా?
అనుక్షణం దేశాన్ని పహారా కాస్తూ మనం స్వేచ్ఛగా జీవించేందుకు సైన్యం అను నిత్యం పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎండనకా, వాననకా, గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయక, సరిగా తినీ తినక మన జవాన్లు చేస్తున్న త్యాగానికి, ప్రదర్శిస్తున్న వీరత్వానికి మించిన దేశభక్తి ఏముంది? వారు పడుతున్న కష్టంతో పోలిస్తే ఇంట్లోనే వారం పాటు ఉండటం పెద్ద కష్టమా? అందుకే, ఇప్పుడు దేశభక్తిని, సమాజ హితాన్ని కోరే యుక్తిని కొత్త విధంగా ప్రదర్శించే సమయమిది. మన ఇంట్లో మనం ఉంటూ, ఉన్నది తింటూ, కుటుంబసభ్యులతో కలిసి వారం పాటు ఉంటే చాలు.. అది దేశభక్తిని మించినది అవుతుంది. సైనికుల త్యాగాలతో పోల్చలేకపోయినా స్వీయ నియంత్రణ దాదాపు దానికి సమానమే. ప్రభుత్వాలు చెబుతున్న మాటలు తూచ తప్పకుండా పాటించడమే నిజమైన సమాజ సేవ. ప్రపంచం కల్లోల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓ వారం పాటు ఇంట్లోనే ఉంటూ నిశ్శబ్దంగా చేసే యుద్ధమిది. ప్రస్తుతానికి కోరోనా నిరోధానికి స్వీయ నియంత్రణను మించిన వ్యాక్సిన్ లేదు. పరిస్థితులు చక్కబడే వరకు బయటకు రాకపోవడమే దానికి మందు. ఇలాంటి పరీక్ష సమయంలో మనమంతా విజ్ఞతతో వ్యవహరించి.. కోరి తెచ్చుకున్న రాష్ట్రానికి విపత్తు రాకుండా చూడాలి. అది మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇది మన ‘బాధ్యత’.
మనకు రాలేదు కదా అనే ధీమా.. మనకేమవుతుందిలే అనే నిర్లక్ష్యం.. మనకు ఎందుకు వస్తుందనే మొండితనాన్ని కనీసం మరో వారం రోజుల పాటు మర్చిపోవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. కల్లోల సమయంలో మనిషిలోని మానవత్వం, సేవాగుణం.. నిబద్ధతను ప్రదర్శించాల్సిన అవసరాన్ని మనకు కరోనా నేర్పిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న విధంగా మనమంతా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని.. దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాను, మండలాన్ని, గ్రామాన్ని, మన కుటుంబాన్ని, మనల్ని కాపాడుకునేందుకు మనిషి విజ్ఞతతో వ్యవహరించాల్సి ఉందని ఈ వైరస్ పాఠం చెబుతోంది. అందుకే, ప్రజలెవరూ బయటకు రావద్దని.. అత్యవసరమైతేనే తప్ప నిబంధనలు కచ్చితంగా పాటించాలని అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు కోరుతున్నారు.
వారం రోజులు ఇంట్లో ఉండలేమా!
సరిహద్దుల్లో అనుక్షణం పహారా కాస్తూ.. మనం స్వేచ్ఛగా జీవించేందుకు సైనికులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఈ దేశాన్ని రక్షించే అవకాశం మనకూ వచ్చింది. మనం చేయాల్సిందల్లా మన ఇంట్లో మనం ఉండడమే. ఇంట్లోనే ఉండి హాయిగా టీవీ చూస్తూ.. పిల్లా పాపలతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తే చాలు దేశాన్ని రక్షించిన వారమవుతాం. సెల్ఫ్ ఐసోలేషన్ పాటిస్తేనే కరోనా నియంత్రణ సాధ్యమని నిపుణులు అంటున్నారు. అందుకే ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం సూచించింది.
స్వీయ నియంత్రణే వ్యాక్సిన్
కరోనా అంటు వ్యాధి. ఆ వైరస్ సోకిన వ్యక్తితో కరచాలనం చేసినా.. తాకినా.. ఆ వ్యక్తి తుమ్మినా సరే మరొకరికి ఆ వైరస్ సోకుతుంది. చైనాలోని వూహాన్‌లో బయటపడిన ఈ వైరస్ (కోవిడ్–19) ఇప్పటికే 194 దేశాలకు విస్తరించింది. వైరస్‌కు ఇప్పటి వరకు వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఇప్పటికే 3,51,705 మందికి సోకింది. 15,361 మందిని కబళించింది. ఇటలీలో మారణహోమం సృష్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment