
గచ్చిబౌలి:శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..గత శనివారం శ్రీచైతన్య జూనియర్ కళాశాలలకు చెందిన మాదాపూర్, కొండాపూర్ బ్రాంచ్‌లలో పులిహోర, కొబ్బరి రైస్ తిని దాదాపు 70 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దీంతో విద్యార్థులను కిమ్స్, తదితర ఆస్పత్రులకు తరలించిన యాజమాన్యం వారికి వైద్య చికిత్సలు అందించినట్లు తెలిసింది. ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కొందరిని ఇళ్లకు పంపించారు. మరికొందరు నీరసంగా ఉండటంతో మంగళవారం కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు సమాచారం. ఈ విషయం మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడినప్పటికీ కొందరు నిలదీయగా విద్యార్థులు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు చెప్పడం గమనార్హం. దీనిపై సమాచారం అందడంతో శేరిలింగంపల్లి హెల్త్ అసిస్టెంట్ పాండు కొండాపూర్‌లోని శ్రీచైతన్య కాలేజీని సందర్శించగా విద్యార్థులకు వైరల్ ఫీవర్ వచ్చిందని ప్రిన్సిపాల్ శ్రీదేవి చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment