sri chaithanya
-
చై.. నా... గిమ్మిక్కులు చానా!
ఇంటర్లో ప్రభంజనం.. స్టేట్ టాపర్ మా కళాశాల విద్యార్థే.. అంటూ రిజల్ట్ రోజున చెవులు చిల్లులు పడేలా టీవీల్లో నిమిషానికోసారి ప్రచారం చేసే కార్పొరేట్ కళాశాలల డొల్లతనం తేలిపోయింది. మనీతో మార్కులు సాధించిన తీరు బట్టబయలైంది. ప్రాక్టికల్స్‌లో కార్పొరేట్ కళాశాలలు చేసే గిమ్మిక్కులను టాస్క్‌ఫోర్స్ కమిటీ పట్టేసింది. 30కి 30 మార్కులు సాధించిన విద్యార్థుల పేపర్లను పునర్ మూల్యాకనం చేసి బోగస్ మార్కులకు చెక్‌పెట్టింది. కాసులకు కక్కుర్తి పడిన ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ల లెక్కలు కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ పరిణామంతో అందరిలో టెన్షన్ మొదలైంది. అనంతపురం విద్య: ఇంటర్ మార్కుల వెయిటేజీతో ర్యాంకులు తారుమారవుతాయి. అందుకే విద్యార్థి గణనీయమైన మార్కులు సాధించేలా కళాశాలలు ప్రణాళిక సిద్ధం చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని కళాశాలలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ప్రాక్టికల్స్‌లో గంపగుత్తగా మార్కులు కొట్టేసేందుకు మనీతో మాయ చేస్తున్నాయి. ఈ సారి కూడా కార్పొరేట్ కళాశాలలన్నీ ఏకమయ్యాయి. తమ కళాశాలల విద్యార్థులకు మంచి మార్కులు తెప్పించుకునేందుకు డబ్బు కుమ్మరించాయి. ఏకంగా ఎక్స్టర్నల్ అధికారులను కొనేసి మార్కులు వేయించాయి. అయితే ప్రాక్టికల్స్‌పై కన్నేసిన రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీని రంగంలోకి దించింది. దీంతో కార్పొరేట్ ఖరత్నాక్ కథలన్నీ ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. కాసులకు ఆశపడిన అధికారులపై వేటు రంగం సిద్ధమవుతోంది. టార్గెట్ 30కి 30 ఇంటర్లో జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ సబ్జెక్టుల్లో ప్రతి సబ్జెక్టుకు 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్ స్కోర్ బాగా ఉండాలంటే తప్పకుండా ప్రాక్టికల్స్‌లోనూ మంచి మార్కులు రావాల్సి ఉంటుంది. అందుకే కార్పొరేట్ కళాశాలలు తమ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో వీలైనన్ని మార్కులు తెప్పించుకునేందుకు కృషి చేస్తాయి. జిల్లా వ్యాప్తంగా 62 పరీక్ష కేంద్రాల్లో ఫిబ్రవరి 4 నుంచి 19 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించగా... 14వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ప్రాక్టికల్స్‌పై ఎప్పటినుంచో పథకం రచించిన జిల్లాలోని పలు కార్పొరేట్ కళాశాలలు.. అందులోనూ నారాయణ, చైతన్య జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తమదైన శైలిలో చక్రం తిప్పాయి. దీంతో చాలా మందికి 30కి 30 మార్కులు వచ్చాయి. షరా మామూలేనని భావించి... ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ప్రాక్టికల్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించింది. సీసీ కెమెరాలతో ప్రాక్టికల్స్ నిర్వహిస్తూ జంబ్లింగ్ విధానాన్ని అనుసరించి పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించింది. దీంతో ఇంటర్‌బోర్డు అధికారులు కూడా రోజూ పరీక్ష ముగిసిన వెంటనే వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి ఆర్ఐఓలతో సమీక్ష నిర్వహించారు. అయితే కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు మాత్రం షరా మామూలేనన్న రీతిలో వ్యవహరించాయి. ఎప్పటిలాగే ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లను పెద్దమొత్తంలో నగదు ముట్టజెప్పి ‘మార్కులు’ కొనుగోలు చేసేశారు. టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియామకాన్ని గోప్యంగా ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రాక్టికల్స్ ముగిసే రోజున రంగంలోకి దింపింది. దీంతో కార్పొరేట్ కళాశాల బాగోతం బట్టబయలైంది. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులపై వివక్ష ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులపై ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లు వివక్ష చూపారు. ప్రతిభ కనబరిచినప్పటికీ మామూళ్లు ఇవ్వలేదనే కారణంతో వారికి ఇవ్వాల్సి మార్కులు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. కార్పొరేట్ కళాశాల విద్యార్థులకు వచ్చిన మార్కులు, ప్రతిభ ప్రదర్శించినప్పటికీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు వచ్చిన మార్కుల్లో భారీ వ్యత్యాసం ఉండడంతో టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు చర్యలకు ఉపక్రమించారు. అధికంగా వేసిన మార్కుల్లో కోత విధించి.. మార్కులు ఎన్ని రావాల్సి ఉందో.. అన్నే మార్కులు వేశారు. రంగంలోకి టాస్క్ఫోర్క్ ఇంటర్ ప్రాక్టికల్స్ మార్కులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. వెంటనే టాస్క్‌ఫోర్స్ కమిటీని రంగంలోకి దింపింది. 30కి 30 మార్కులు వచ్చిన ప్రతి పేపర్‌ను పరిశీలించి పునర్ మూల్యాంకనం(రీవాల్యుయేషన్ ) చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 16 మందితో కూడిన నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లాలోని నారాయణ, చైతన్యతో పాటు ఇతర కార్పొరేట్ కళాశాలల విద్యార్థుల మార్కులను పరిశీలించాయి. నారాయణ కళాశాలలో చదివిన ఒక విద్యార్థికి కెమిస్ట్రీలో 30 మార్కులు వచ్చాయి. టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు పునఃపరిశీలన చేస్తే 10 మార్కులు కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. దీంతో కమిటీ సభ్యులు నివ్వెరపోయారు. ఎక్కువ మార్కులు వేశారు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లు ప్రాక్టికల్స్‌లో విద్యార్థి చేసిన దానికంటే అదనంగా మార్కులు వేసినట్లు టాస్క్‌ఫోర్స్ కమిటీలు గుర్తించాయి. ఇందుకు కారణాలను ఆరా తీశారు. ముఖ్యంగా 30కి 30 మార్కులు వచ్చిన జవాబుపత్రాలను పునర్మూల్యాంకనం చేశారు.– వెంకటరమణ నాయక్,ఆర్ఐఓ, అనంతపురం -
ఫీజు అడిగారని దౌర్జన్యకాండ
నెల్లూరురూరల్: తమకు కావాల్సిన వారి విద్యార్థిని ఫీజు చెల్లించాలని ఒత్తిడి తీసుకువచ్చారనే కారణంతో ఆగ్రహంతో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కళాశాలపై దాడికి దిగారు. ప్రిన్సిపల్‌ను దుర్భాషలాడి కర్రలతో దాడి చేసి గాయపరిచిన ఘటన నెల్లూరు రూరల్ పరిధిలోని ధనలక్ష్మీపురం శ్రీచైతన్య బాలుర జూనియర్ కళాశాల వద్ద గురువారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ పోలీసుల కథనం మేరకు శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు చెందిన విద్యార్థి భవానీ ప్రశాంత్‌కుమార్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం(ఎంపీసీ గ్రూపు) చదువుతున్నాడు. ఇతడు కళాశాలకు రూ.39,800 ఫీజు బకాయి ఉన్నాడు. కళాశాల ప్రిన్సిపల్ పత్తిపాటి మల్లికార్జున్ ఫీజు విషయమై విద్యార్థి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు. అనంతరం విద్యార్థి తండ్రి నెల్లూరులోని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడుకు విషయం చెప్పడంతో అతను తాను చూసుకుంటానని విద్యార్థి తండ్రికి హామీ ఇచ్చాడు. తర్వాత తిరుమలనాయుడు కళాశాల ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి తాను చెప్పిన సదరు విద్యార్థి చెల్లించాల్సిన ఫీజు విషయం మరచిపోవాలని చెప్పాడు. మరలా ప్రశాంత్‌కుమార్‌ను ప్రిన్సిపల్ యథావిధిగా ఫీజు చెల్లించాలని కోరడంతో విద్యార్థి తండ్రి మళ్లీ తిరుమలనాయుడుకు సమాచారం అందించాడు. దీంతో తిరుమలనాయుడు గురువారం సాయంత్రం కళాశాల ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి ‘‘నేను ఫీజు అడగవద్దంటే ఎందుకు అడిగావు.. నీ సంగతి తేలుస్తా.. అక్కడే ఉండు.. వస్తున్నా’’ అంటూ నానా దుర్భాషలాడాడు. కాసేపట్లో తిరుమలనాయుడుతోపాటు టీఎన్ ఎస్ ఎఫ్ నాయకులైన కిషోర్, అమృల్లా కూడా కళాశాల వద్దకు చేరుకున్నారు. కళాశాల ఆవరణలో హల్చల్ చేస్తూ ప్రిన్సిపల్ వద్దకు వెళ్లారు. ‘‘మేమంటే నీకు లెక్కలేకుండా పోయిందా.. మా సంగతి నీకు తెలియదు.. చంపేస్తాం’’ అంటూ వీరంగం సృష్టించి దౌర్జన్యానికి దిగారు. దౌర్జన్యాన్ని ప్రతిఘటించబోయిన ప్రిన్సిపల్‌పై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ప్రిన్సిపల్ కుడిచేతికి గాయమైంది. అనంతరం బాధిత ప్రిన్సిపల్ ఈ విషయాన్నంతా విజయవాడలోని శ్రీచైతన్య కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో శుక్రవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. దాడికి పాల్పడిన టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడు, నాయకులు కిషోర్, అమృల్లాలపై కేసు నమోదు చేశారు. -
కుళ్లిన మాంసం.. పాడైపోయిన కూరలు
సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్, కొండాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ హాస్టల్లో గతవారం కలుషిత ఆహారం తిని 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విజయనగర్ కాలనీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఆ మర్నాడే కలుషిత ఆహారం తిని 32 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 10 మంది విద్యార్థునులు ఆస్పత్రిలో చేరారు. సికింద్రాబాద్ వైఎంసీఏలో ఉపాధిహామీ కోర్సుల్లో శిక్షణ కోసం చేరిన నిరుద్యోగులు కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారు. నగరంలో ఇటీవల నగరంలో రోజూ ఏదో ఒక వసతిగృహంలో ఆహారం కలుషితమవుతూనే ఉంది. ఫుడ్కాంట్రాక్టర్ల కక్కుర్తి కారణంగా తరచూ పలువురు విద్యార్థులు ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు ఆయా వసతి వసతిగృహాల్లో తనిఖీలు నిర్వహించి ఆహార నాణ్యతను పరిశీలించాల్సిన జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసతి గృహాల ఏర్పాటుకు స్పష్టమైన విధివిధానాలు లేకపోవడం, కనీస మౌలిక సదుపాయాలు లేని భవనాల్లో వీటిని ఏర్పాటు చేస్తుండటం, మార్కెట్లో తక్కువ ధరకు లభించే కూరలు, మాంసం, నూనెలు వినియోగిస్తుండటంతో ఆహారం కలుషితమై విద్యార్థులు అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వసతి గృహాలపై నియంత్రణ ఏదీ? గ్రేటర్ పరిధిలో కార్పొరేట్ జూనియర్ కాలేజీలు, వాటికి చెందిన హాస్టళ్లు 500 పైగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు 100 వరకు ఉన్నాయి. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కాలేజీలకు అనుబంధంగా మరో 100 హాస్టళ్లు నడుస్తున్నాయి. వీటికితోడు వివిధ పోటీ పరీక్షల కోసం సన్నద్ధ మవుతున్న అనేక మంది నిరుద్యోగులు ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్, రామంతాపూర్, దిల్సుఖ్నగర్, అమీర్‌పేట్, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో లెక్కలేనన్ని హాస్టళ్లు ఉన్నాయి. చాలా మంది రద్దీ ప్రాంతాల్లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని, బోయ్స్, లేడీస్ హాస్టళ్లను ఓపెన్ చేస్తున్నారు. ఒక్కో గదిలో ఐదు నుంచి పది మందికి వసతి కల్పిస్తున్నారు. ఇక హోటళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ గల్లీలోకి చూసినా ఏదో ఒక హో టల్ కన్పిస్తుంది. రుచికరమైన నాణ్యమైన ఆహారంతో పాటు అహ్లాదకరమైన వాతావరణంలో వసతి కల్పిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నాయి. నిజానికి ఆయా వసతి గృహాల్లోని వంటగదుల నిర్వహణ అధ్వాన్నంగా ఉంటుంది. మార్కెట్లో తక్కువ ధరకు దొరికే పుచ్చి, పాడైపోయిన కూరగాయలు, కుళ్లిన మాంసంతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తున్నారు. రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని కిచిడీ రూపంలో ఉదయం టిఫిన్‌గా పెడుతున్నారు. కూరలు, పప్పు, సాంబార్ సహా ఇతర వంటలను వేడిచేసి మళ్లీ వడ్డిస్తున్నారు. ఈ కలుషిత ఆహారం తినడంతో విద్యార్థులు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, జ్వరంతో తీవ్ర అవస్వస్థతకు గురై చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాలపై నియంత్రణ లేకపోవడం, అధికారులు వీటిని తనిఖీ చేయకపోవడం, ఎప్పటికప్పుడు ఆహారం నాణ్యతను పరిశీలించకపోవడం వల్ల నిర్వహకులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరోక్షంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. అనుకోని విపత్తు లు, అగ్ని ప్రమాదాలు జరిగితే..ఎదుర్కొనే మౌలిక సదుపాయాలు లేవు. అంతేకాదు నగరంలోని వసతి గృహాల్లో 90 శాతం భవ నాలకు ఫైర్ సేఫ్టీ లేదంటే ఆశ్చర్యపోనవసరంలేదు. పని చేయని ‘మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్’.. కల్తీ ఆహార పదార్థాల భారి నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2018 ఫిబ్రవరిలో ఐపీఎంలో మొబైల్ ఫుడ్ సేప్టీ ల్యాబ్‌ను ప్రారంభిం చింది. నారాయణగూడ పరిసర ప్రాంతాలు సహా కుత్బుల్లాపూర్‌లో పర్యటించి హోటళ్లలో ఆహార పదార్థాల నమూనాలు సేకరించి...పరీక్షల పేరుతో హడావుడి చేసింది. ఆ తర్వాత విస్మరించింది. ప్రస్తుతం ఈ వాహనం జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు ఐపీఎం అధికారులు చెబుతున్నారు. ఆహార పదార్థాల నమూనాలు సేకరించి నాణ్యతను పరీక్షించాల్సిన ఈ మొబైల్ ఫుడ్ సేప్టీ ల్యాబ్ వెహికిల్ ప్రస్తుతం కేవలం పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలకే పరిమితమైంది. కలుషిత ఆహారంతో ఆరోగ్యం దెబ్బతిని ఆస్పత్రుల్లో చేసిన బాధితుల్లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప...జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
కలుషిత ఆహారం తిన్నందుకు....
గచ్చిబౌలి:శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..గత శనివారం శ్రీచైతన్య జూనియర్ కళాశాలలకు చెందిన మాదాపూర్, కొండాపూర్ బ్రాంచ్‌లలో పులిహోర, కొబ్బరి రైస్ తిని దాదాపు 70 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దీంతో విద్యార్థులను కిమ్స్, తదితర ఆస్పత్రులకు తరలించిన యాజమాన్యం వారికి వైద్య చికిత్సలు అందించినట్లు తెలిసింది. ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కొందరిని ఇళ్లకు పంపించారు. మరికొందరు నీరసంగా ఉండటంతో మంగళవారం కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు సమాచారం. ఈ విషయం మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడినప్పటికీ కొందరు నిలదీయగా విద్యార్థులు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు చెప్పడం గమనార్హం. దీనిపై సమాచారం అందడంతో శేరిలింగంపల్లి హెల్త్ అసిస్టెంట్ పాండు కొండాపూర్‌లోని శ్రీచైతన్య కాలేజీని సందర్శించగా విద్యార్థులకు వైరల్ ఫీవర్ వచ్చిందని ప్రిన్సిపాల్ శ్రీదేవి చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఎన్నికల రోజూ తరగతులా..?
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ నెల 6, 7 తేదీల్లో అధికారికంగా సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఎల్బీనగర్లోని శ్రీ చైతన్య రెసిడేన్షియల్ కాలేజీ ఏసీ క్యాంపస్ యాజమాన్యం యథావిధిగా హాస్టల్‌ను కొనసాగించింది. ఎన్నికల సందర్భంగా తమ ఊరికి వెళ్లి ఓటు వినియోగించునేందుకు అనుమతి ఇవ్వాలని పలువురు విద్యార్థులు కోరినా నిర్వాహకులు అంగీకరించకపోవడంతో వారు మనస్తాపానికి లోనయ్యారు. చేతిపై గాట్లు పెట్టుకుని నిరసన... ఎల్బీనగర్లోని శ్రీచైతన్య రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో 800 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీరిలో చాలా మందికి ఓటు హక్కు ఉండటంతో ఓటును వినియోగించుకునేందుకు సెలవు ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరగా నిర్వాహకులు అందుకు నిరాకరించారు. ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 సెక్షన్ 135(బి) ప్రకారంఎన్నికల తేదీల్లో విధిగా ఆయా సంస్థలకు వేతనంతో కూడిన అధికారిక సెలవు ప్రకటించాలని ఇటీవల ఎన్నికల కమిషన్ స్వయంగా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు కాలేజీలు, విద్యాలయాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా సదరు యాజమాన్యం లెక్కచేయకపోగా గురువారం యథావిథిగా తరగతులు నిర్వహించడంతో మనస్థాపానికి గురైన ఆరుగురు విద్యార్థినులు స్కేళ్లతో తమ చేతులపై గాట్లు పెట్టుకుని నిరసన తెలిపారు. తమ పట్ల యాజమాన్యం అమానుషంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ వాయిస్ రికార్డులను మీడియాకు పంపారు. దీంతో మీడియా ప్రతినిధులు హాస్టల్ కు చేరుకోగా, విద్యార్థినులను కలిసేందుకు యాజమాన్యం నిరాకరించింది. తమ హాస్టల్లో ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదని, ఆ వాయిస్ రికార్డ్ కూడా తమ హాస్టల్ విద్యార్థులది కావని డీన్ జగదీష్ పేర్కొన్నారు. ఏసీపీ విచారణ... దీనిపై బాలల హక్కుల సంఘం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌కు ఫిర్యాదు చేయగా, సీపీ ఆదేశాల మేరకు ఎల్బీనగర్ ఏసీపీ పృధ్వీధర్‌రావు కాలేజీకి వెళ్లి విచారణ చేపట్టారు. కాగా దీనిపై ఫిర్యాదు చేసేందుకు విద్యార్థినులు ముందుకు రాలేదు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. చర్యలు తీసుకుంటాం... ‘జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు రెండు రోజుల పాటు సెలవు ఇవ్వాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. నేనే స్వయంగా ఆయా కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలకు ఫోన్ చేశాను. ఎన్నికల విధుల్లో ఉన్నందున దాన్ని ఫాలో అప్ చేయలేక పోయాం. ఇప్పటి వరకు ఈ విషయం నా దృష్టికి రాలేదు. నిబధనలను ఉల్లగించిన సదరు కాలేజీపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం’ –సుధారాణి, ఇంటర్మీడియట్ బోర్డు అధికారిణి, రంగారెడ్డి జిల్లా -
శ్రీచైతన్య కళాశాల గురువు ఓ విద్యార్థినితో..
అనంతపురం: నగరంలోని శ్రీచైతన్య కళాశాలలో ఓ గురువు కీచక అవతారమెత్తాడు. ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం కీచక గురువు పోలీసుల అదుపులో ఉన్నాడు. బాధితుల బంధువుల వివరాల మేరకు... నగరంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినిని కెమెస్ట్రీ లెక్చరర్ కిరణ్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. సూటిపోటి మాటలు మాట్లాడుతుండడంతో రెండు నెలలుగా కళాశాలకు పోవడమే మానేసింది. కారణాలు ఆరా తీస్తున్నప్పటికీ విద్యార్థిని బయటకు చెప్పకపోవడంతో తల్లిదండ్రులు బతిమలాడుతూ వచ్చారు. సోమవారం గట్టిగా మందలించడంతో జరిగిన విషయాన్ని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేసింది. రోజూ సెల్‌కు ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్‌లో కూడా మేసేజ్ చేయాలని వేధిస్తున్నట్లు వాపోయింది. దీంతో బాధితురాలి తండ్రి మంగళవారం ఉదయం ప్రిన్సిపల్‌తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సదరు కీచక్ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని టూటౌన్ సీఐ ఆరోహనరావు తెలిపారు. -
శ్రీచైతన్య పాఠశాల సీజ్
అనంతపురం ఎడ్యుకేషన్ : స్థానిక కోర్టురోడ్డులో ఉన్న శ్రీచైతన్య స్కూల్‌ను మండల విద్యాశాఖ అధికారి వెంకటస్వామి మంగళవారం సీజ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన చేసిన నేపథ్యంలో ఎంఈఓ తనిఖీ చేశారు. గవర్నింగ్‌బాడీ మేరకు ఫీజులను నిర్ణయించి, వాటిని నోటీస్‌బోర్డులో ఉంచాలని స్వయంగా జాయింట్ కలెక్టర్ ఆదేశించినా యాజమాన్యం పాటించలేదని, ముందస్తు అడ్మిషన్లు కూడా చేస్తున్నారని ఎంఈఓ తెలిపారు. నిబంధనలు పాటించకపోవడంతో సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు బండి పరుశురాం, సాకే నరేష్, జనార్ధన్, సురేష్ తదితరులు ఉన్నారు. -
‘నారాయణ, శ్రీచైతన్యపై’ అనుమానం
హిమాయత్‌నగర్: ఎంసెట్–2 లీక్ వ్యవహారంలో నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కూడా విచారణ జరపాలని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్.ప్రదీప్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సత్య డిమాండ్ చేశారు. వందలోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులలో ఆ విద్యాసంస్థలకు చెందిన వారు కూడా ఉన్నారని ఆరోపించారు. నారాయణగూడ ఫ్లైఓవర్ కింద పీడిఎస్యూ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరరావు, మహేష్ పాల్గొన్నారు.