శ్రీచైతన్య కళాశాలలో దౌర్జన్యం చేస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, కళాశాల ఆవరణలో టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుల వీరంగం
నెల్లూరురూరల్: తమకు కావాల్సిన వారి విద్యార్థిని ఫీజు చెల్లించాలని ఒత్తిడి తీసుకువచ్చారనే కారణంతో ఆగ్రహంతో టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు కళాశాలపై దాడికి దిగారు. ప్రిన్సిపల్‌ను దుర్భాషలాడి కర్రలతో దాడి చేసి గాయపరిచిన ఘటన నెల్లూరు రూరల్ పరిధిలోని ధనలక్ష్మీపురం శ్రీచైతన్య బాలుర జూనియర్ కళాశాల వద్ద గురువారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ పోలీసుల కథనం మేరకు శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు చెందిన విద్యార్థి భవానీ ప్రశాంత్‌కుమార్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం(ఎంపీసీ గ్రూపు) చదువుతున్నాడు. ఇతడు కళాశాలకు రూ.39,800 ఫీజు బకాయి ఉన్నాడు. కళాశాల ప్రిన్సిపల్ పత్తిపాటి మల్లికార్జున్ ఫీజు విషయమై విద్యార్థి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడాడు. అనంతరం విద్యార్థి తండ్రి నెల్లూరులోని టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడుకు విషయం చెప్పడంతో అతను తాను చూసుకుంటానని విద్యార్థి తండ్రికి హామీ ఇచ్చాడు.
తర్వాత తిరుమలనాయుడు కళాశాల ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి తాను చెప్పిన సదరు విద్యార్థి చెల్లించాల్సిన ఫీజు విషయం మరచిపోవాలని చెప్పాడు. మరలా ప్రశాంత్‌కుమార్‌ను ప్రిన్సిపల్ యథావిధిగా ఫీజు చెల్లించాలని కోరడంతో విద్యార్థి తండ్రి మళ్లీ తిరుమలనాయుడుకు సమాచారం అందించాడు. దీంతో తిరుమలనాయుడు గురువారం సాయంత్రం కళాశాల ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి ‘‘నేను ఫీజు అడగవద్దంటే ఎందుకు అడిగావు.. నీ సంగతి తేలుస్తా.. అక్కడే ఉండు.. వస్తున్నా’’ అంటూ నానా దుర్భాషలాడాడు. కాసేపట్లో తిరుమలనాయుడుతోపాటు టీఎన్ ఎస్ ఎఫ్ నాయకులైన కిషోర్, అమృల్లా కూడా కళాశాల వద్దకు చేరుకున్నారు. కళాశాల ఆవరణలో హల్‌చల్ చేస్తూ ప్రిన్సిపల్ వద్దకు వెళ్లారు. ‘‘మేమంటే నీకు లెక్కలేకుండా పోయిందా.. మా సంగతి నీకు తెలియదు.. చంపేస్తాం’’ అంటూ వీరంగం సృష్టించి దౌర్జన్యానికి దిగారు. దౌర్జన్యాన్ని ప్రతిఘటించబోయిన ప్రిన్సిపల్‌పై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ప్రిన్సిపల్ కుడిచేతికి గాయమైంది. అనంతరం బాధిత ప్రిన్సిపల్ ఈ విషయాన్నంతా విజయవాడలోని శ్రీచైతన్య కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో శుక్రవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. దాడికి పాల్పడిన టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడు, నాయకులు కిషోర్, అమృల్లాలపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment