
యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా మంగళవారం అశ్వ పాదాలతో ప్రత్యేక మండప నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆ తర్వాత త్రిదళ రాజగోపురం ద్వారా లోనికి ప్రవేశించి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం పశ్చిమ రాజగోపురం నుంచి బయటికి వెళ్లే దారిలో ఒక ప్రత్యేక పోర్టికో (బాల్కనీ) వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
దీనికి ముందుగా స్థపతులు అశ్వపాదాల వంటి మూల స్తంభాల నిర్మాణం చేశారు. నాలుగు స్తంభాల కింద నాలుగు అశ్వస్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ఆలయ స్థపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఇవి గుర్రపు డెక్క ఆకారాన్ని పోలి ఉంటాయని తెలిపారు. ఈ పోర్టికో నుంచి ఆలయ ఆవరణ చూసిన ప్రతి భక్తుడు ప్రత్యేక అనుభూతిని పొందే విధంగా రూపొందిస్తున్నారు. కార్యక్రమంలో స్థపతులు సుందరరాజన్, వేలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment