వేగంగా పునరుజ్జీవం  | Sriram Sagar Project Works Process Nizamabad | Sakshi
Sakshi News home page

వేగంగా పునరుజ్జీవం 

Published Fri, Jun 14 2019 11:03 AM | Last Updated on Fri, Jun 14 2019 11:03 AM

Sriram Sagar Project Works Process Nizamabad - Sakshi

పునరుజ్జీవన పథకంలో భాగంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయం సమీపంలోని వరద కాలువ 0.100 మీటర్ల వద్ద మూడో పంప్‌ హౌజ్‌ నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. పైప్‌లైన్‌ ఫిట్టింగ్, వరద కాలువ నుంచి ఎత్తిపోసే గేట్లకు సంబంధించిన సిమెంట్‌ నిర్మాణం పనులు చేపట్టారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. వరద జలాలు అందుబాటులో ఉండే రెండు నెలల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీలోకి రివర్స్‌ పంపింగ్‌ చేసేలా నీటి పారుదల శాఖ ఈ పథకానికి రూపకల్పన చేసింది. 

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పనులు వడివడిగా సాగుతున్నాయి. నిర్దేశిత సమయంలోగా ఈ పథకం పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వయంగా ఈ పనులపై దృష్టి సారించడంతో పను లు వేగవంతమయ్యాయి. పంప్‌హౌస్‌ పనులతో పాటు, ఇతర నిర్మాణ పనుల న్నీ జూలై 15లోగా పూర్తి చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు ఎస్సారె స్పీ జలాశయం సమీపంలోని వరద కాలువ 0.100 మీటర్ల వద్ద చేపట్టిన మూడో పంప్‌ హౌజ్‌ నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి.

తొలుత మొదటి పంప్‌హౌజ్, రెండో పంప్‌హౌస్‌ 
నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మూడో పంప్‌హౌస్‌ పనులు కాస్త నత్తనడకన సాగాయి. తాజాగా మళ్లీ ఈ పనుల్లో కదలిక వచ్చినట్లయింది. ఇప్పుడు వడివడిగా సాగుతున్నాయని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పైప్‌లైన్‌ ఫిట్టింగ్, వరద కాలువ నుంచి ఎత్తిపోసే గేట్లకు సంబంధించిన సిమెంట్‌ నిర్మాణం పనులు చేపట్టారు. మరోవైపు పంప్‌హౌస్‌ నడిపేందుకు అవసరమైన విద్యుత్‌ కోసం సబ్‌స్టేషన్‌ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. నీటిని ఎస్సారెస్పీలోకి ఎత్తి పోసే చోట కూడా సిమెంట్‌ నిర్మాణం పనులను చేపట్టారు.
 
మహారాష్ట్ర మిగులు జలాలే ఆధారమైన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును నింపేందుకు ప్రభుత్వం ఈపునరుజ్జీవన పథకానికి శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీలోకి రివర్స్‌ పంపింగ్‌ చేసేలా నీటి పారుదల శాఖ ఈ పథకానికి రూపకల్పన చేసింది. వరద జలాలు అందుబాటులో ఉండే రెండు నెలల పాటు రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీలోకి ఎత్తిపోసుకునేలా డిజైన్‌ చేశారు. ఈ పనులకు 2017లో సీఎం కేసీఆర్‌ ఎస్సారెస్పీ వద్ద శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.1,091 కోట్ల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం 2017లో పరిపాలన అనుమతులు జారీ చేసింది. నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ ఈ పనులను దక్కించుకుంది. ఈ మేరకు రూ.927.12 కోట్లతో 2017 ఆగస్టులో పనులకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. వరద కాలువ మూడు చోట్ల పంప్‌హౌస్‌లను నిర్మిస్తున్నారు.

త్వరలో ముగియనున్న పొడగించిన గడువు.. 
ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 2017 ఆగస్టు నుంచి 15 నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంది. అయితే నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కాలేదు. దీంతో 2018లో పనులు పూర్తి చేసేందుకు నిర్దేశించిన గడువును (ఈఓటీ) ప్రభుత్వం పొడగించింది. పొడగించిన ఈ గడువు కూడా ఈనెల 23తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి.

ఇదీ పనుల ప్రగతి.. 

  • వరద కాలువ 0.100 మీటర్ల వద్ద చేపట్టిన మూడో పంప్‌హౌస్‌ పనులు ఇప్పటి వరకు 71 శాతం పూర్తయినట్లు నీటిపారుదల శాఖ పేర్కొంటోంది. 10.19 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌వర్క్‌ పూర్తయింది.  
  • కాంక్రీట్‌ పనులు.. 2.19 లక్షల క్యూబిక్‌ మీటర్లకు గాను, 1.47 లక్షల క్యూబిక్‌ మీటర్లు పూర్తయింది. ఇంకా 72 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేపట్టాల్సి ఉంది.  
  • ఈ పంప్‌హౌస్‌ వద్ద నుంచి రోజుకు 11,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసుకునేలా ఎనిమిది పంపులను బిగించాల్సి ఉంది. ఈ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.  
  • పంపులను నడిపేందుకు అవసరమైన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. ఒక్కో పంప్‌కు 6.5 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉండగా మొత్తం 52 మెగావాట్ల విద్యుత్‌ కావాల్సి ఉంది. ఇందుకోసం రెంజర్ల వద్ద రెండు భారీ విద్యుత్‌ టవర్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.  
  • ఎనిమిది చొప్పున డ్రాఫ్ట్‌ట్యూబులు, డ్రాఫ్ట్‌ట్యూబ్‌కోన్‌లు, స్టేరింగ్‌లు, పిట్‌లైనర్ల నిర్మాణం జరగాల్సి ఉంది.

వీలైనంత తొందరలో పూర్తి చేయిస్తాం..
రివర్స్‌ పంపింగ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులన్నీ పూర్తి చేయిం చేందుకు చర్యలు చేపట్టాము. వీలైనంత తొందరలో పనులు పూర్తి చేసేలా చూస్తు న్నాము. నిర్దేశిత గడువులోగా ఈ పనులు జరుగుతాయి. శ్రీకాంత్, పర్యవేక్షక ఇంజినీర్, వరదకాలువ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement