సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు వేగంగా అడుగంటుతున్నాయి. వేసవి రోజురోజుకూ తీవ్రమవుతుండటం, నీటి అవసరాలు ఎక్కువగా ఉండటంతో కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నిల్వలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టుల్లో నీటి లభ్యత 25టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ నీటితోనే ఆగస్టు వరకు రెండు తెలుగురాష్ట్రాలు ఎలా నెట్టుకొస్తాయన్నది ప్రశ్నగా మారింది. సాగర్‌లో మొత్తం 590 అడుగులకుగానూ ప్రస్తుతం 513 అడుగుల వరకు నీటి నిల్వలున్నాయి. ఇందులో 510 అడుగుల కనీస నీటిమట్టం వరకు నీటి లభ్యత 6 టీఎంసీలు మాత్రమే.
ఈ నీటితో ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలు తీరే అవకాశం లేకపోవడంతో కృష్ణాబోర్డు సాగర్‌లో 505 అడుగుల మట్టం వరకు నీటిని తీసుకునేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో 14.87 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునే అవకాశముంది. శ్రీశైలంలో 885 అడుగుల మొత్తం నీటిమట్టానికి గానూ 818.70 అడుగుల వరకు 39.83 టీఎంసీల నీరు లభ్యతగా ఉంది. కొరతను దృష్టిలో ఉంచుకుని కృష్ణా బోర్డు మరో 80 అడుగుల వరకు నీటిని తీసుకునేందుకు అవకాశమిచ్చింది. ప్రస్తుతం ఇక్కడ 10.87 టీఎంసీలు నీటిని వినియోగించుకోగలం. మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో కలిపి 25.74 టీఎంసీల మేర నీరు మాత్రమే లభ్యతగా ఉంది. ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటితో తెలంగాణ, ఏపీ తెలంగాణ అసవరాలకు 24.2 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉంది. ఇందులో ఏపీ వాటా 9.5 టీఎంసీలు, తెలంగాణ కోటా 14.7 టీఎంసీలు. ఈ అవసరాలకు మించి వాడుకున్న పక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడాలు తప్పవు.
వినియోగంపై జాగ్రత్త
రెండు ప్రాజెక్టుల్లో ఉన్న లభ్యత నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. ఈ ప్రాజెక్టుల్లో కేవలం 25 టీఎంసీల నీరే ఉందని, ఆగస్టు వరకు ఇదే నీటిపై ఆధారపడాల్సి ఉంటుందని తెలంగాణ, ఏపీలకు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం శుక్రవారం లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment