
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో త్వరలోనే వెల్లడిస్తామని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షలను హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసిన తెలిసిందే. అయితే మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు పరీక్షలను నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మరోసారి వాయిదా తప్పలేదు.
ఈ మేరకు భారత్‌లో కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ. సత్యనారాయణ రెడ్డి సోమవారం వెల్లడించారు. వాయిదా పడిన పదో తరగతి పరీక్షలతోపాటు అన్ని ఇతర పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను తర్వలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు. కాగా తెలంగాణలో కరోనా కేసులు సోమవారం నాటికి 70కి పైగా నమోదయ్యాయి.ఇక భారత్‌లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం ఉదయం నాటికి దేశంలో 1074 కేసులు నమోదయ్యాయి.
అప్‌డేట్: పది పరీక్షలు మళ్లీ వాయిదా..
టెన్త్ పరీక్షలను మరోసారి వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర హైకోర్టు సోమవారం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో పది పరీక్షలు వాయిదా వేయాలని ఉపాధ్యాయుదు బాలకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించలేమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ఉన్న స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15 తర్వాత పరిస్థితులను బట్టి తమ నిర్ణయం చెప్తామని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.