సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల కారణంగా ఇప్పటికే ఓసారి వాయిదా వేసిన పదో తరగతి పరీక్షలను సోమవారం నుంచి తిరిగి నిర్వహించేందుకు సిద్ధమైన ప్రభుత్వం చివరి నిమిషంలో వాటిని మళ్లీ వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణపై హైకోర్టు శనివారం సాయంత్రం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శనివారం రాత్రి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలతో ప్రభుత్వం టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు తీర్పు ఇవ్వగా కొన్ని ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించి మరికొన్ని చోట్ల నిర్వహించకపోవడం ఇబ్బందికరమనే భావనకు ప్రభుత్వం వచ్చింది. హైకోర్టు తీర్పుపై అధికారులతో సమీక్షించిన అనంతరం విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
పరీక్షల నిర్వహణ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై త్వరలోనే సీఎం కేసీఆర్‌తో సమావేశమై తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో పదో తరగతి పరీక్షలకు సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థుల్లో నెలకొన్న ఉత్కంఠ వీడింది. రాష్ట్రంలో మార్చి 19 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవగా కరోనా నేపథ్యంలో మార్చి 23 నుంచి ఏప్రిల్ 6 మధ్య జరగాల్సిన పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధితో పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ షెడ్యూల్ రూపొం దిం చింది. ఈ నెల 8 నుంచి టెన్త్ పరీక్షలను తిరిగి నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాలను రెట్టింపు చేసింది. విద్యార్థులు భౌతికదూరం పాటించేలా తగిన ఏర్పాట్లు చేయడంతోపాటు శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ పరికరాలను అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వం ఈ నెల 4న కోర్టుకు తెలియజేసింది. అయితే కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించవద్దని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో నిర్వహించుకోవచ్చని శనివారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఏం చేయాలన్న విషయంలో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో చివరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల వాయిదావైపే మొగ్గు చూపింది.
ఫలితాల్లో వ్యత్యాసం వద్దనే..
తొలుత కొన్ని ప్రాంతాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించి మిగిలిన ప్రాంతాల్లో ఆ తర్వాత పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాల్లో తేడాలు కచ్చితంగా ఉంటాయి. అన్ని ప్రాంతాల విద్యార్థులకు ఒకే రకమైన ప్రశ్నపత్రాలు ఉండవు. దానివల్ల ప్రశ్నల సరళి సైతం కఠినంగా లేదా సరళంగా ఉండే అవకాశం ఉంది. దాని ప్రభావం ఫలితాలపైనా పడే అవకాశం ఉండటంతో ఫలితాల్లోనూ తేడా ఉండే చాన్సుంది. ఈ పరిణామంతో విద్యార్థుల్లో అపోహలు ఏర్పడే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రస్తుతానికి పరీక్షల వాయిదాయే సరైనదని భావిస్తూ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది.
- రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు రాయనున్న విద్యార్థులు.. : 5,34,000
- ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే పరీక్ష రాయనున్న విద్యార్థులు.. :1,45,227
లక్షన్నర మంది విద్యార్థులు జీహెచ్‌ఎంసీలోనే..
హైదరాబాద్ జిల్లాలో 700 పరీక్ష కేంద్రాలు ఉండగా వాటిలో 82 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే మేడ్చల్ జిల్లాలోని 281 పరీక్ష కేంద్రాల్లో 32,871 మంది విద్యార్థులు, రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్, హయత్‌నగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని 258 కేంద్రాల్లో 30,356 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే 5.34 లక్షల మంది విద్యార్థుల్లో 1,45,227 మంది విద్యార్థులు హైదరాబాద్‌లోనే పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించకుండా ఇతర ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రశ్నల కఠినత్వం, ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అపోహలకు తావు ఏర్పడుతుందన్న అభిప్రాయంతో పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు జిల్లాలకు వెళ్లిపోయిన హాస్టల్ విద్యార్థులకు వారున్న ప్రాంతాల్లోనే పరీక్షలు రాసేలా అనుమతిస్తామని, ఇప్పుడు పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైనా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించినా హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్‌ఎంసీ ప్రాంతాల్లో పరీక్షలు వద్దని ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను వాయిదా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యార్థుల ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది?: హైకోర్టు
కరోనా వైరస్ కారణంగా పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలనే రెండు ప్రజాహిత వ్యాజ్యాలపై అంతకుముందు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా తీవ్రత నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో పరీక్షలను వాయిదా వేసి మిగతా ప్రాంతాల్లో నిర్వహించాలని కోర్టు సూచించగా ఈ ప్రతిపాదనను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకించారు. పరీక్షల నిర్వహణకు పాక్షిక అనుమతి ఇవ్వడం కంటే రాష్ట్రమంతా పరీక్షలను వాయిదా వేయడమే ఉత్తమమన్నారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం ఘాటుగా స్పందించింది.
‘శుక్రవారం ఒక్కరోజే జీహెచ్‌ఎంసీ పరిధిలో 116 కేసులు నమోదయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే అమాయక విద్యార్థుల ప్రాణాలకు ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? విద్యార్థుల ప్రాణాలు, ఆరోగ్యం కంటే ముఖ్యం ఏముంటుంది? ఒకవేళ ప్రాణం పోతే పరిహారం ఎంత ఇస్తారు? పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారని బలవంతంగా పరీక్షలకు అనుమతి ఇచ్చి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ప్రమాదంలోకి నెట్టేయలేం. మహారాష్ట్ర, పంజాబ్‌లలో చేసినట్లుగా ఇంటర్నల్ మార్కులను ప్రామాణికంగా చేసుకొని గ్రేడింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదో అర్ధం కావట్లేదు. కేసుల నమోదు తీరు చూస్తే పరిస్థితులు ఇప్పుడే అదుపులోకి వచ్చేలా లేదు. ప్రభుత్వం కూడా ప్రస్తుత తీవ్రతను పరిగణనలోకి తీసుకోవాలి. మనసుంటే మార్గం ఉంటుంది’అని వ్యాఖ్యానించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పరీక్షల వాయిదాపై ప్రభుత్వ వైఖరిని తెలుసుకోవాల్సి ఉందని ఏజీ చెప్పడంతో విచారణ తిరిగి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ సహా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, పాక్షిక ప్రాంతానికి అనుమతి కాకుండా మొత్తానికి అనుమతి ఇవ్వాలని ఏజీ కోరారు. దీంతో ధర్మాసనం పై ఉత్తర్వులు జారీ చేసి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వొచ్చా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యమయ్యేనా అన్న ఆలోచన అధికారుల్లో మొదలయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో కేసులు విపరీతంగా పెరుగు తుండటం.. హైకోర్టు కూడా జీహెచ్‌ఎంసీ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహిం చొద్దని చెప్పడంతో ఏం చేయాలా.. అని ఆలోచనలో పడ్డారు. పైగా ఈ నెలాఖరు, వచ్చే నెలల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్న వార్తల నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం అవుతుందా లేదా అన్న గందరగోళం నెలకొంది. పరీక్షలు నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో వార్షిక పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వొచ్చా అన్న ఆలోచనలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం కంటే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడమే ఉత్తమమని ఇటు ఉపాధ్యాయ సంఘాలతో పాటు ప్రైవేటు యాజమాన్యాలు కూడా తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. త్వరలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment