సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు వేదికగా ఉత్కంఠ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డిలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహంచడం సాధ్యమవుతుందా అని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పంజాబ్ తరహాలో పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ వాదించారు. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ.. అసలు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అని ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని కోరింది. పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ధర్మాసనం ప్రశ్నలకు స్పందించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం మళ్లీ మళ్లీ తయారుచేయడం ఇబ్బంది అవుతుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఏజీ వాదనపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా..సాంకేతిక అంశాలు ముఖ్యమా అని ప్రశ్నించింది. దీనిపై ఏజీ స్పందిస్తూ.. ప్రభుత్వాన్ని అడిగి పూర్తి వివరాలను తెలియజేస్తానని సమాధానమిచ్చారు. ఇక కరోనా తీవ్రత కారణంగా పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఆసక్తి చూపని విద్యార్థులు ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగే సప్లిమెంటరీలో పరీక్షలు రాస్తే వార్షిక పరీక్షలకు హాజరైనట్లుగా పరిగణిస్తారా లేదా అని ధర్మసనం అడగ్గా.. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గానే పరిగణించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. తదుపరి విచారణను శనివారం సాయంత్రం నాలుగు గంటలకు హైకోర్టు వాయిదా వేసింది. (సాధారణ పరీక్షగానే పరిగణిస్తారా?)
Comments
Please login to add a commentAdd a comment