బావర్చీ బిర్యానీ తినాలనీ ఉందా? | Staff And Chef Shortage in Hyderabad Hotels | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ ఆర్డరా.. వెయిట్‌ ప్లీజ్‌!

Published Tue, Jun 2 2020 11:23 AM | Last Updated on Tue, Jun 2 2020 11:42 AM

Staff And Chef Shortage in Hyderabad Hotels - Sakshi

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌): బావర్చీ బిర్యానీ తినాలనీ ఉందా? ఫుడ్‌ను ఆర్డర్‌ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మరో వారం రోజులు నిరీక్షించాల్సిందే. ఈ నెల 8 నుంచి హోటళ్లు తెరుచుకున్నా.. ఫుడ్‌ ఆర్డర్‌కు మాత్రం జర.. వెయిట్‌ ప్లీజ్‌ అంటూ సమాధానం వచ్చే అవకాశాలు లేకపోలేదు. కరోనా లాక్‌డౌన్‌ నుంచి హోటల్‌ రంగానికి మినహాయింపు లభించినా.. పూర్తిస్థాయిలో సర్వీస్‌ అందించే అవకాశాలు కనిపించడం లేదు. లాక్‌డౌన్‌లో హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర అతిథ్య సేవారంగాలకు ఈ నెల 8 నుంచి  మినహాయిస్తూ కేంద్రం గ్రీన్‌ సిగ్న్‌ల్‌ ఇచ్చినా.. హోటళ్లలో వంటావార్పు చేసే చెఫ్‌ నుంచి వెయిటర్‌ వరకు, మేనేజర్ల నుంచి సర్వీస్‌ బాయ్స్‌ వరకు అందుబాటులో లేకుండాపోయారు. ఒకవైపు సిబ్బంది కొరత వెంటాడుతుండగా.. మరోవైపు ఇప్పటికే  విద్యుత్‌ బిల్లులు, టాక్స్‌లు, నిర్వహణ భారం తడిసి మోపెడు కావడంతో ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. వ్యాపారం పునఃప్రారంభించినా కరోనా భయంతో కస్టమర్స్‌ వస్తారనే భరోసా లేకుండాపోయింది. దీంతో హోటల్స్, రెస్టారెంట్లను నడిపేదెలా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

హోటల్‌ రంగం కుదేల్‌..
లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌ మహానగరంలో హోటల్‌ రంగం కుదేలైంది. పర్యాటక రంగాన్ని పడకేసేలా చేసింది. ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ హోటళ్లు మూతపడ్డాయి. రెస్టారెంట్లు బంద్‌ అయ్యాయి. హోటల్‌ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ సుమారు సుమారు రెండు లక్షల మంది ఉద్యోగ, ఉపాధికి ముప్పు వాటిల్లింది. హోటల్స్, రెస్టారెంట్ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. వంట మాస్టర్స్‌ నుంచి క్లీనర్లు, బేరర్ల వరకు ఒక్కో రెస్టారెంట్‌లో సగటును 30 మందికి తగ్గకుండా పని చేసేవారు. లీజు తీసుకుంటే మాత్రం నెలకు కనిష్టంగా రూ.2లక్షల అద్దె చెల్లించాల్సిందే. వంటశాలలో గ్రైండర్లు, హీటర్లు, గ్రీజర్ల మోతలు సరేసరి. రెస్టారెంట్‌లోనూ ఏసీలు, ఫ్యాన్లు ఉండాల్సిందే. విద్యుత్‌ చార్జీలు కమర్షియల్‌ టారీఫ్‌లో గూబ గుయ్యిమనిపిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ తర్వాత తిరిగి రెస్టారెంట్లు కొనసాగేదెలా తెలియని పరిస్థితి నెలకొంది.  హోటల్స్‌ పరిస్థితి కూడా రెస్టారెంట్లకు భిన్నంగా ఏమీ లేదు. 

లక్ష మందికిపైనే..  
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని హోటల్స్, రెస్టారెంట్లు, స్టార్‌ హోటల్స్, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌లో షెఫ్స్, కుక్స్, హెల్పర్స్, సప్లయర్స్‌గా  సుమారు లక్ష మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో 70 శాతం వరకు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అసోం, మణిపూర్, ఒడిశా, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మిగిలిన 30 శాతమే స్థానికులు. లాక్‌డౌన్‌తో హోటల్‌ రంగం సిబ్బంది దాదాపు సుమారు 70 శాతం వరకు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇప్పట్లో కూడా వచ్చే అవకాశాలు కానరావడం లేదు. ఇక స్టార్‌ హోటల్స్‌ సిబ్బందికి ఎలాంటి జీతాలు చెల్లించకపోగా,  మే మాసంలో ఏకంగా నోటీసులు జారీ చేసి జీతాలు లేకుండా ఆగస్ట్‌ 31 వరకు సెలవుల్లో ఉండాలను ఆదేశించినట్లు తెలుస్తోంది. 

ధీమా కరువే..
లాక్‌డౌన్‌ మినహాయింపుతో హోటల్స్, రెస్టారెంట్స్, అతిథ్య రంగం వ్యాపారం పునః ప్రారంభించినా..వ్యాపారం జరుగుతుందనే గ్యారంటీ లేదన్న భావన  నిర్వాహకులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేకపోవడం, ప్రైవేటు ఉద్యోగులకు జీతాలు లేకపోవడం, ఉద్యోగంపై భరోసా లేకపోవడం తదితర కారణాలతో ప్రజల్లో కొనుగోలు శక్తిని తీవ్రంగా దెబ్బతీస్తాయని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వీకెండ్స్‌ పేరుతో బయటకు వెళ్లడం, ఎంజాయ్‌ చేయడం వంటి వాటికి స్వస్తి చెప్పేస్తారని వ్యాపారులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ భయంతో పాటు ఇప్పట్లో ఎవరూ ఇల్లు కదిలే అవకాశం ఉండకపోవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో హోటళ్లను తిరిగి తెరిచినా వ్యాపారులు నిర్వహణ ఖర్చులను భారీగా తగ్గించుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్‌ టెక్‌ అవేపైనా ప్రభావం..
నగరంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్స్‌పైనా కరోనా ఎఫెక్ట్‌ పడింది. లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్, టెక్‌ అవే ఫుడ్స్‌కు మినహాయింపు ఇచ్చినా.. వ్యాపారం మాత్రం పెద్దగా ముందుకు సాగడం లేదు. 12 గంటల్లో ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ 25 నుంచి 40 వరకు ఆర్డర్లు దొరికేవి. ఇప్పుడా సంఖ్య 2 నుంచి 5కు మించడం లేదనే ఆవేదన వ్యక్తవుతోంది. టెక్‌ అవే గిరాకీ కూడా పూర్తిగా ఐదు శాతానికి పడిపోయింది.

ప్రభుత్వం ఆదుకోవాలి  
లాక్‌డౌన్‌తో ఆర్థికంగా దెబ్బతిన్న హోటల్‌ రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తాజా మినహాయింపుతో హోటళ్లను తెరిచినా అతిథుల రాక పెద్దగా ఉండకపోవచ్చు. జనం కొన్నాళ్లపాటు భయపడి ఇంట్లోనే ఉండిపోతారు. దీంతో బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు వాయిదాలు కట్టే పరిస్థితి కూడా హోటల్‌ నిర్వాహకులకు ఉండదు. కనీసం ఏడాది పాటు జీఎస్టీ రద్దు చేయాలి. విద్యుత్‌ చార్జీల్లో రాయితీలు కల్పించాలి.
– ఎస్‌ వెంకట్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement