రంగస్థలంపై ‘కొండంత’ అభిమానం | Stage Artist Kondal Rao Life Story Hyderabad | Sakshi
Sakshi News home page

రంగస్థలంపై ‘కొండంత’ అభిమానం

Mar 10 2020 8:36 AM | Updated on Mar 10 2020 8:36 AM

Stage Artist Kondal Rao Life Story Hyderabad - Sakshi

ఆ రోజుల్లో నాటకాలంటే భలే క్రేజ్‌.. ఎక్కడ నాటకాలు వేసినా గుంపులుగా జనం వెళ్లేవారు.. దాంతో అతడికి నాటకాలపై మక్కువ పెరిగింది. ఎలాగైనా నాటకాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు. చివరకు అనుకున్నది సాధించి నాటక రంగంలో దూసుకుపోయాడు. తను ఏ పాత్ర వేసినా జనంలోంచి విజిల్స్‌ చప్పుడు.. కేకలు.. అరుపులు.. అవే అతడిలో మరింత ఆసక్తి పెంచాయి. నాటకాన్నే జీవనోపాధిగా మార్చుకున్నాడు. ఆరోజుల్లో నాటకాలకు ఉన్న ఆదరణ ప్రస్తుతం లేకపోవడంతో బతుకు భారమైంది. కల నుంచి బయటకు వచ్చి.. కళను వదిలిపెట్టి.. పొట్టనింపుకునేందుకు దర్జీ పని మొదలు పెట్టారు. మార్కెట్లో రెడీమేడ్‌ దుస్తుల పోటీని తట్టుకోలేక బతుకును భారంగా వెళ్లదీస్తున్నారు కొండల్‌రావు.

రహమత్‌నగర్‌: రహమత్‌నగర్‌ డివిజన్‌లోని ఎన్‌ఎస్‌బీ నగర్‌కు చెందిన కొండల్‌రావు(75)కు భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్నతనం నుంచే నాటకాలపై ఉన్న మక్కువతో ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు, సత్కారాలు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగస్థల సంస్థలతో సంబంధాలు పెంచుకొని రాష్ట్రవ్యాప్తంగా నాటకాలు వేసి శెభాష్‌ అనిపించుకున్నారు. ఈయన వేసిన క్రిష్ణార్జున యుద్దం, మాయాబజార్, చింతామణి, çసత్యహరిచంద్ర, నాటకాలు బహుమతులు అందుకొని ప్రశంసలు అందుకున్నారు. 2011 ఫిబ్రవరిలో రవీంద్రభారతిలో నంది నాటకోత్సవం ప్రశంస పత్రం అందుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మశంకర్‌ బస్తీలో టైలర్‌గా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఓవైపు వృద్ధాప్యం.. మరోవైపు ఆర్థిక పరిస్థితులు ఆయనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఏళ్లుగా నాటక రంగంలో ఉన్నా కనీసం ప్రభుత్వ గుర్తింపు కార్డు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కళాకారులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement