ఉత్సవ శోభ | Starts Ujjain Mahankali ammavari jathara | Sakshi
Sakshi News home page

ఉత్సవ శోభ

Published Sun, Aug 2 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

ఉత్సవ శోభ

ఉత్సవ శోభ

మహంకాళి బోనాలకు సర్వం సిద్ధం
నేటి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర నేడు బోనాల సమర్పణ...రేపు ‘రంగం’
 
సికింద్రాబాద్  ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. ఆదివారం బోనాలు సమర్పిస్తారు, సోమవారం ‘రంగం’ కార్యక్రమం ఉంటుంది. 48 గంటల పాటు అమ్మవారిని నిరంతరాయంగా దర్శించుకునే అవకాశంకల్పించారు. దాదాపు 15 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారుల అంచనా.
రాంగోపాల్‌పేట్:
తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్  ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో జరిగే ఈ ఉత్సవాలకు వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు, సోమవారం ‘రంగం’ కార్యక్రమం ఉంటుంది.

జంటనగరాల్లోనే ఎంతో వైభవంగా నిర్వహించే మహంకాళి బోనాల ఉత్సవాల్లో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. జంటనగరాల నుంచే కాకుండా తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన భక్తులు కూడా ఇక్కడి అమ్మవారికి సాక పెట్టి బోనం సమర్పించడం ఆనవాయితీ. ఆదివారం ఉదయం 4 గంటలకు స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అమ్మవారికి మొదటి పూజ చేస్తారు. అనంతరం భక్తులకు అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతినిస్తారు. 48 గంటల పాటు అమ్మవారిని నిరంతరాయం దర్శించుకునే అవకాశం కల్పించారు.
 
ఆలయం ముస్తాబు...
ఈ సంవత్సరం మహంకాళి బోనాల జాతరలో సుమారు 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవాలయాన్ని మొత్తం రంగులతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్ల నిర్మాణాలు, ప్యాచ్ వర్కులు పూర్తి చేశారు. మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు రెండు జనరేటర్లు, 2 మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో ఉంచుతున్నారు.  క్యూలైన్లో ఉండే భక్తుల కోసం రెండు బారీ తెరలు ఏర్పాటు చేసి దేవాలయం లోపల, బయట జాతర దృశ్యాలను ప్రదర్శిస్తారు.
 
బోనంతో వచ్చే భక్తులకు ప్రత్యేక లైను
భక్తుల కోసం 5 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే మహిళలు 20 నిమిషాల్లో అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. వీఐపీలు, వీవీఐపీలు వచ్చిన సమయంలోనూ ఈ క్యూలైన్ ఆపకుండా భక్తులను లోపలికి పంపిస్తారు. బాటావైపు నుంచి బోనాలతో వచ్చే మహిళల క్యూలైన్, రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ నుంచి ఒకటి, వీఐపీ పాస్‌లతో వచ్చే వారికి దీని పక్కనే మరొకటి, సాధారణ భక్తులకు క్యూలైన్, అంజలీ థియేటర్, టొబాకో బజార్ నుంచి రెండు సాధారణ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీవీఐపీలు వచ్చిన సమయంలో దేవాలయ ఆర్చ్ గేటు నుంచి నేరుగా దేవాలయం లోపలికి తీసుకుని వెళ్తారు.
 
ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నాలుగు కూడళ్లలో 550 మంది కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్, బాటా చౌరస్తా, సీఎంఆర్, రాణిగంజ్ చౌరస్తాలో ఈ కళాబృందాలు భక్తులను అలరించనున్నాయి. 3వ తేదీ సోమవారం రంగం రోజు అంబారీ ఊరేగింపులోనూ ప్రత్యేకత ఉంటుంది. గుర్రాలు, ఒంటెలు, లంబాడా నృత్యాలు, బాజా బజంత్రీలతో కోలాహలంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
 
ఉచిత ప్రసాదాల పంపిణీ
మొట్టమొదటి సారిగా ఈ సంవత్సరం జాతరకు వచ్చే భక్తులకు దేవాలయం తరుపున ఉచితంగా ప్రసాదం (పులిహోర) పంపిణీ చేస్తున్నారు. దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత టొబాకో బజార్‌లో ఈ కౌంటర్ ఏర్పాటు చేశారు.
 
మొబైల్ టాయిలెట్లు
మహిళలకు పురుషులకు నాలుగు చోట్ల మొబైల్ టాయిలెట్లను జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్ వద్ద, అంజలీ థియేటర్ వద్ద రెండు సాధారణ ప్రజలకు, పోలీస్‌స్టేషన్‌కు మరోవైపు, దేవాలయం వెనుకవైపు వీఐపీలకు టాయిలెట్లు సిద్ధం చేశారు. వీటితో పాటు చుట్టు పక్కల ఉండే టాయిలెట్లు అందుబాటులో ఉంచారు.
 
1200 మంది పోలీసులు
బోనాల జాతర కోసం ఉత్తర మండలం డీసీపీ ప్రశాశ్‌రెడ్డి నేతృత్వంలో 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అదనపు డీసీపీలు, 12 మంది ఏసీపీలు, 55 మంది సీఐలు, 155 మంది ఎస్సైలు, 700 మంది కానిస్టేబుళ్లును నియమించారు. అలాగే 10 ప్లాటూన్ల బలగాలను, సాయుధ బలగాలను ఏర్పాటు చేశారు.
 
పార్కింగ్ ప్రదేశాలు ఇవే..
బోనాల జాతరకు వాహనాల్లో వచ్చే వారికి ఐదు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సీఎంఆర్, ప్యారడైజ్, పార్క్‌లేన్ గాంధీ విగ్రహం, రాణిగంజ్ అడవయ్య చౌరస్తాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
 
నేడు ఘటాల ఊరేగింపు...
చార్మినార్:
ఆషాడ బోనాల ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం పాతబస్తీలో ఘటాల సామూహిక ఊరేగింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  శాలిబండలోని కాశీ విశ్వనాథ ఆలయం నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఊరేగింపు లాల్‌దర్వాజా మోడ్ మీదుగా ఆయా ఆలయాలకు చేరుకుంటుంది. లాల్‌దర్వాజా మోడ్ వద్ద  హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఘటాలకు స్వాగతం పలుకుతారు.
 
ప్రత్యేక పూజలు
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద శనివారం సందడి కనిపించింది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బోనాలు, సాక, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నగర అదనపు కమిషనర్ (ట్రాఫిక్) జితేందర్ ఏర్పాట్లు పరిశీలించారు. ఐజీ నాగిరెడ్డి, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి,  తదితర ఉన్నతాధికారులతో కలిసి ఆయన శాంతిభద్రతలు, ట్రాఫిక్ గురించి సమీక్షించారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్, బండ కార్తీకరెడ్డి, ఎమ్మెల్యే సంపత్ తదితరులు శనివారం మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
 
గాజులు, పసుపు కుంకుమ పంపిణీ
మున్నూరు కాపు మహాసభ కాచిగూడ ఆధ్వర్యంలో మహిళా భక్తులకు గాజులు, పసుపు, కుంకుమలు పంపిణీ చేశారు. అధ్యక్షులు ఆనంద్‌కుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహులు, కార్యదర్శి చామకూర ప్రదీప్, సభ్యులు మానిక్‌ప్రభు, శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement