పెన్షన్‌.. టెన్షన్‌! | State Government employees are concerned | Sakshi
Sakshi News home page

పెన్షన్‌.. టెన్షన్‌!

Published Fri, Sep 1 2017 1:16 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

పెన్షన్‌.. టెన్షన్‌! - Sakshi

పెన్షన్‌.. టెన్షన్‌!

గందరగోళంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌
ఆందోళనలో 1.2 లక్షల మంది ఉద్యోగులు
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సామూహిక సెలవు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004 సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లో ఉన్న కాంట్రిబ్యుటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) గందరగోళంగా మారింది. పాత పెన్షన్‌ విధానంలో ఉన్న ప్రయోజనాలేవీ వర్తించకపోగా.. ఉన్న ప్రయోజనాలూ సరిగా అందని దుస్థితి నెలకొంది. రిటైర్‌మెంట్‌ తర్వాత ప్రభుత్వం నుంచి అందే లాభాలేమీ పెద్దగా లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు సీపీఎస్‌ కింద చెల్లించిన సొమ్ముకు సంబంధించిన ఖాతాలు, లెక్కలు సరిగా లేకపోవడం, పెన్షన్‌ ఫండ్‌లో ఉన్న సొమ్ముకు కనీస వడ్డీ కూడా అందని పరిస్థితి ఉండడం సమస్యగా మారింది. దీంతో అసలు సీపీఎస్‌ను రద్దు చేయాలని.. తిరిగి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.  శుక్రవారం సామూహిక సెలవు పెట్టడం తోపాటు నిరసన చేపట్టనున్నారు.

సీపీఎస్‌తో ప్రయోజనం అంతంతే!
కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్‌ 1 నుంచి సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం... పెన్షన్‌ కోసం ఉద్యోగి తన వాటాగా వేతనంలో 10 శాతం చెల్లిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మరో 10 శాతం చెల్లిస్తుంది. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) వద్ద జమవుతూ ఉంటుంది. ఉద్యోగి రిటైరైనపుడు తన ఖాతాలో ఉన్న సొమ్ములో 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతం సొమ్మును పీఎఫ్‌ఆర్‌డీఏ తమ వద్దే ఉంచుకుని.. దానిని స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులుగా పెడుతుంది. ఆ సొమ్ము నెట్‌ అసెట్‌ వ్యాల్యూ ప్రకారం లెక్కించి ఉద్యోగికి పెన్షన్‌ను ఇస్తుంది.

వేల మంది ఖాతాలు గందరగోళమే..!
రాష్ట్రంలో 1.2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఉంటే.. అందులో దాదాపు 40 శాతం మంది పెన్షన్‌ ఖాతాల్లో సొమ్ము ఎంత జమ అయిందో తెలియని పరిస్థితి నెలకొంది. 2004 నుంచే సీపీఎస్‌ను అమలు చేస్తున్నా.. 2013లో కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టం చేసింది. ఈ మధ్య కాలంలో నియమితులైన దాదాపు 50 వేల మంది ఉద్యోగుల ఖాతాల నిర్వహణ గందరగోళంగా మారింది.

సీపీఎస్‌ పరిధిలో లేని త్రిపుర, బెంగాల్‌
వాస్తవానికి త్రిపుర, బెంగాల్‌ రాష్ట్రాలు ఇప్పటికీ సీపీఎస్‌ పరిధిలో లేవని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కూడా సీపీఎస్‌ రద్దు కోసం కమిటీలను వేశాయని, మన రాష్ట్రంలోనూ సీపీఎస్‌ రద్దుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి. అయితే సీపీఎస్‌ రద్దు, ఫ్యామిలీ పెన్షన్‌ వర్తింపు, పాత పెన్షన్‌ విధానం అమలు అంశాలు కొంతమేర కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి. గ్రాట్యుటీ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఈ నేపథ్యంలో సీపీఎస్‌ ఉద్యోగులకు వెంటనే గ్రాట్యుటీ సదుపాయాన్ని కల్పించాలని  డిమాండ్‌ చేస్తున్నారు.

పాత పెన్షన్‌ విధానంలో ప్రయోజనాలెన్నో
రాష్ట్రంలో 2004 సెప్టెంబర్‌ 1వ తేదీకి ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం వర్తిస్తుంది. దాని ప్రకారం.. ఆ ఉద్యోగి పదవీ విరమణ రోజు నాటికి ఉన్న మూల వేతనంలో సగం మేర సొమ్ము ఆ తర్వాత నెలనెలా పెన్షన్‌గా అందుతుంది. ఇందుకు ఉద్యోగి ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఆ ఉద్యోగి మరణిస్తే.. వారిపై ఆధారపడిన కుటుంబానికి కుటుంబ పెన్షన్‌ వస్తుంది.  గరిష్టంగా రూ.12 లక్షల వరకు గ్రాట్యుటీ అందజేస్తారు.  జీపీఎఫ్‌లో దాచుకున్న సొమ్ము వడ్డీతో సహా వస్తుంది. కానీ 2004 సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ సిస్టం (సీపీఎస్‌)లో ఈ ప్రయోజనాలేవీ ఉండవు.

నిరసనలు చేపడతాం
‘‘సీపీఎస్‌ రద్దు కోసం జాక్టో తరఫున సామూహిక సెలవు పెడుతున్నాం. దానితోపాటు నిరసన కార్యక్రమాలు  చేపడతాం..’’     
    – భుజంగరావు, ఎస్టీయూ అధ్యక్షుడు

సీపీఎస్‌ నుంచి వైదొలగవచ్చు
‘‘త్రిపుర, బెంగాల్‌ రాష్ట్రాలు అసలు సీపీఎస్‌లోనే లేవు. కాబట్టి తెలంగాణ కూడా సీపీఎస్‌ నుంచి వైదొలిగే వీలుంది. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తరఫున జిల్లా కేంద్రాల్లో సామూహిక ధర్నాలు నిర్వహిస్తాం..’’
– చావ రవి, యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి  

వెంటనే గ్రాట్యుటీ ఇవ్వాలి
‘‘సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే. దీనిపై కేంద్రంతో వెంటనే మాట్లాడాలి.  గ్రాట్యుటీ ఇచ్చే ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం..’’
– కారెం రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు

సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే..
‘‘సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే. తెలంగాణ ఎంప్లాయీస్‌ జేఏసీ తరఫున ఇందుకోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం..’’
– వి.మమత, టీజీవో అధ్యక్షురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement