సీఐపై ‘స్టింగ్’ ఆపరేషన్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అనుమానిత వ్యక్తులు, దొంగలు, తీవ్రవాదుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టడం సహజం. కానీ సొంత శాఖపోలీసుల కదలికలపై నిఘా పెట్టి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడితే... ఏం చేయాలి? కరీంనగర్ జిల్లాలో ఇదే జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సొంత శాఖ సిబ్బందిపై అదే శాఖ సిబ్బంది స్టింగ్ ఆపరేషన్ నిర్వహించడమేంటనే చర్చ జరుగుతోంది. రాష్టస్థాయిలో ఫిర్యాదు చేసేందుకు బాధిత పోలీసులు సిద్ధమవుతున్నారు.
కరీంనగర్ రెవెన్యూ డివిజన్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో సరిగ్గా నెల రోజుల క్రితం సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్టేషన్‌లో కూర్చొని రోజు మాదిరిగానే ఫిర్యాదుదారుల సమస్యలు వింటూ కేసు నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో నిఘా విభాగానికి చెందిన ఓ అధికారి వచ్చాడు. పరిచయస్తులే కావడంతో ఇద్దరు కలిసి పలు అంశాలపై చర్చించుకుంటున్నారు. అయితే సదరు నిఘా అధికారి మాటల మధ్యలో పదేపదే ఉన్నతాధికారుల గురించి గుచ్చిగుచ్చి పశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టుకుంటూ జేబును అటూ ఇటూ సర్దుకుంటున్నాడు.
అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా నిఘా అధికారి వ్యవహారశైలి ఉండటంతో సీఐకి అనుమానం వచ్చింది. నిఘా అధికారి చొక్కాను పరీక్షగా చూడగా.. గుండీల మధ్యలో రహస్య కెమెరా ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే ఆ కెమెరాను లాక్కొని చూడగా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలన్నీ అందులో రికార్డయి ఉన్నాయి. షాక్ తిన్న సీఐ తీవ్ర ఆగ్రహంతో నిఘా అధికారిని ఎందుకిలా చేశావంటూ నిలదీశాడు. ‘పై నుంచి’ వచ్చిన ఆదేశాలతోనే స్టింగ్ ఆపరేషన్ చేయడానికి వచ్చానని చెప్పడంతో విస్తుపోవడం సదరు సీఐ వంతైంది. ఆ వెంటనే తేరుకున్న సీఐ సదరు నిఘా అధికారిపై తదుపరి చర్యలకు ఉపక్రమించాడు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాడు.
నిఘా ఎందుకు పెట్టినట్లు?
జిల్లాకు కొత్తగా వచ్చి బాధ్యతలు చేపట్టిన ఆ సీఐని తన చెప్పుచేతల్లో ఉంచుకుని చెప్పినట్లుగా వ్యవహారాలు నడిపించుకోవాలని సదరు నిఘా అధికారి భావించాడు. అందుకే బాధ్యతలు స్వీకరించిన దగ్గరనుంచి సదరు సీఐపై నిఘా ఉంచారు. అయితే సీఐ ఎక్కడా తప్పు చేసినట్లుగా దొరకకపోవడంతో... ఇక లాభం లేదనుకుని స్టింగ్ ఆపరేషన్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా తాజా ఉదంతంపై పోలీసులు డీజీపీ స్థాయి అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సదరు ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగి రహస్య విచారణ జరిపి నివేదిక తెప్పించుకున్న పోలీస్ ఉన్నతాధికారులు తదుపరి చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.