ప్రమాణం చేస్తున్న మంత్రి నాయిని, డీజీపీ అనురాగ్ శర్మ తదితరులు
సాక్షి, సిటీబ్యూరో: రోజు రోజుకూ బాలలపై ఇంటా బయటా లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ అఘాయిత్యాలపై చిన్నారులు, తల్లిదండ్రులు పెదవి విప్పితే రేపటికి ముందడుగు వేయొచ్చని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర పోలీస్ శాఖ చేయని విధంగా ‘స్టాప్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్’ (లైంగిక వేధింపుల నియంత్రణ) కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిందని హోంమంత్రి స్పష్టం చేశారు. ఏడాదిపాటు జరిగే ఈ క్యాంపెయిన్‌లో లైంగిక వేధింపులపై అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో కలిసి పనిచేసేందుకు ముందుకువచ్చిన పోలీస్ శాఖకు అందరూ సహకరించాలని ఆయన సూచించారు.
శుక్రవారం నెక్లెస్ రోడ్డులో బ్లూక్రాస్ వ్యవస్థాపకురాలు అమల అక్కినేని, హీరోయిన్ రాశిఖన్నా, గాయని సునీత, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, నిర్మాత దగ్గుపాటి సురేష్‌బాబు, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి, విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య, ఐజీలు సౌమ్యామిశ్రా, చారు సిన్హా తదితరులు క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 800 పోలీస్‌స్టేషన్లలో ‘చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్’పై ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో అవగాహన కల్పించనున్నామన్నారు.
ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ.. ‘జాగో బద్లో, బోలో’ అనే నినాదంతో ముందుకెళ్లండని పిలుపునిచ్చారు. విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య మాట్లాడుతూ.. మా అందరి ఉద్దేశం మీరంతా బాగుండాలనేదేనన్నారు.
అంతకుముందు చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘సెంటర్ ఫర్ ఆర్ట్స్ మీడియా అండ్ సోషల్ వెల్ఫేర్’ ఆర్గనైజేషన్ సభ్యుల ప్రదర్శన అలరించింది. సమావేశం అనంతరం వేలాదిమంది విద్యార్థులు, ప్రముఖులు ర్యాలీగా కొవ్వొత్తుల ప్రదర్శనతో ‘స్టాప్ చైల్డ్ అబ్యూజ్’ అంటూ స్లోగన్స్ ఇచ్చారు.
మాట్లాడటానికి భయపడొద్దు
చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై మాట్లాడేందుకు భయపడొద్దు. పిల్లల్ని రక్షించేందుకు, సమాజాన్ని మెరుగుపరిచేందుకు, లైంగిక దాడులను అరికట్టేందుకు మన పోలీసులు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. - అమల అక్కినేని, బ్లూక్రాస్ వ్యవస్థాపకారులు
ఏ ధైర్యంతో చేస్తున్నారు..?
ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతలో చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఏ ధైర్యంతో వారు చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. మొదట ఇంటి నుంచే ఆ ప్రశ్నల వర్షం కురవాలి. – దగ్గుబాటి సురేష్, ప్రొడ్యూసర్
మౌనం.. ప్రమాదకరం..
చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను ఎదుర్కొనేందుకు తల్లిదండ్రులకు, చిన్నారులకు ధైర్యం కావాలి. ఏ విధమైన దాడులు జరిగినా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చెప్పాలి. మౌనంగా ఉంటే పెను ప్రమాదం అవుతుంది. – రాశిఖన్నా, సినీనటి
న్యాయం చేసేవారు పోలీసులే
సాయం ప్రతి ఒక్కరూ చేస్తారు. కానీ న్యాయం చేసేది మాత్రం పోలీసులే. అటువంటి న్యాయం కోసం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మన పోలీసుల్ని ప్రత్యేకంగా అభినందించాలి.
–బోయపాటి శ్రీను, సినీదర్శకుడు
అరమరికలు, సమస్యలు లేకుండా..
మన చుట్టూ ఉన్న చిన్నారులకు అరమరికలు, సమస్యలు లేని బాల్యాన్ని ఇద్దాం. దీంతో బాల్యం నుంచే చిన్నారులు అవగాహన కలిగి ఉంటారు. ‘చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్’పై అవగాహన ఏడాదిపాటు చేసేందుకు డీజీపీ కృతనిశ్చయంతో ఉన్నారు. – మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ
పిల్లలకు సంతోషాన్ని పంచుదాం
సమస్యలు చాలా మందికి ఉంటాయి. బయటకు చెప్పేందుకు వెనకాడతాం. కానీ ఇప్పటి నుంచి సమస్యలను చెప్పేందుకు భయపడొద్దు. తల్లిందడ్రులు పిల్లలకు సంతోషాన్ని పంచాలి. చిన్నారుల సమస్యలపై ప్రశ్నించి వారికి ఆనందాన్ని ఇవ్వాలి. – సునీత, గాయని
బీ అలర్ట్ ఫ్లీజ్
పిల్లలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా శుక్రవారం రాత్రి నెక్లెస్‌రోడ్డులో స్పెషల్ అవేర్‌నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. హోంమంత్రి నాయిని, డీజీపీ అనురాగ్ శర్మతోపాటు హీరోయిన్ రాశిఖన్నా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment