అదృష్టం వరించింది..
- 27 దుకాణాలకు సింగిల్ దరఖాస్తులు
- రాత్రి వరకు సాగిన లక్కీడ్రా
- బినామీలతో టెండర్లు వేసిన వైనం
- ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి
- కలెక్టర్ జగన్మోహన్
ఆదిలాబాద్ క్రైం : ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూసిన వారిలో అదృష్టవంతులు ఎవరనేది వెల్లడైంది. జిల్లాలోని 158 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్ల విజేతలను బుధవారం ప్రకటించారు. ఆదిలాబాద్‌లోని జనార్దన్‌రెడ్డి గార్డెన్స్‌లో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. లక్కీ డ్రాను ప్రారంభించిన అనంతరం కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ మద్యం టెండర్ల ప్రక్రియల్లో ప్రభుత్వానికి సహకరించి ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. టెండర్‌దారులు సిండికేట్, మామూళ్ల పద్ధతిని రూపుమాపి మద్యం దుకాణాల ద్వారా ఆదాయం సమకూర్చాలని చెప్పారు. జిల్లాలో కల్తీ విక్రయాలు జరగకుండా నిరోధించాలని పేర్కొన్నారు. కల్తీ కల్లు వల్ల ప్రజల ప్రాణాలకే ముప్పు ఉందని, దీనిపై అధికారులు దృష్టి సారించి కల్తీ కల్లు విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం సంయుక్త కలెక్టర్ సుందర్ అబ్నార్ టోకెన్ నెంబర్ తీసి మొదటి లక్కీ విజేతను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శివరాజ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు అనిత, శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా 62 దరఖాస్తులు వచ్చిన బెజ్జూర్ మద్యం దుకాణం లక్కీ డ్రాలో కాగజ్‌నగర్‌కు చెందిన బి.ప్రకాశ్‌కు దక్కింది. ఆదిలాబాద్ పట్టణంలో అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన షాప్ నెంబర్-2ను సోనాలకు చెందిన సి.భోజారెడ్డి దక్కించుకున్నారు. ఈ దుకాణానికి 47 దరఖాస్తులు రాగా స్థానికేతరుడిని అదృష్టం వరించింది. పట్టణంలోని షాప్-1 అల్లూరి నాగార్జునరెడ్డి, షాప్-3 అల్లూరి రమేశ్‌రెడ్డి, షాప్-4 మనోహర్‌రావు, షాప్-5 కొరటాల రమేశ్, షాప్-6 మంజూల దక్కించుకున్నారు. బేలలోని షాప్-7 మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన నవీన్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. ఆదిలాబాద్ యూనిట్ పరిధిలో 8, మంచిర్యాల యూనిట్ పరిధిలో 19 సింగిల్ దరఖాస్తులు వచ్చాయి. దుకాణాలు దక్కించుకున్న వారి నుంచి 1/6 వంతుగా ఫీజు తీసుకున్నారు.
బినామీల జోరు
జిల్లా వ్యాప్తంగా 156 మద్యం దుకాణాలకు 1,541 దరఖాస్తులు వచ్చాయి. కొంతమంది వ్యాపారులు ఒక్కొక్కరు ఐదు నుంచి పది వరకు దరఖాస్తులు వేసినట్లు తెలుస్తోంది. బినామీ పేర్లపై టెండర్ వేసి దుకాణాలు దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో మద్యం దుకాణం దక్కించుకున్న వారే ఈసారి కూడా ఎలాగైనా దక్కించుకుకోవాలనే ఉద్దేశంతో తన అనుచరులతోపాటు, ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువులతో కూడా టెండర్ వేసినట్లు తెలుస్తోంది. కొంతమంది వ్యాపారులు ముందే సిండికేట్‌గా ఏర్పడి పది మంది కలిసి ఒకే దుకాణానికి దరఖాస్తు వేసుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ దుకాణానికి 20 దరఖాస్తులు రాగా అందులో బినామీ పేర్లతో వేసిన వ్యాపారులకు కాకుండా.. ఒకే ఒక్క దరఖాస్తు చేసుకున్న టెండర్‌దారుడికి దుకాణం దక్కినట్లు సమాచారం. అధికార పార్టీ నాయకులతోపాటు ఇతర పార్టీల రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు సిండికేట్ వ్యవహారానికి తెరలేపినట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారితో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.