ఇక కిక్కే కిక్కు..
- లక్కీ విజేతలు ఖరారు..
- 149 షాపులకు 974 దరఖాస్తులు
- 25 దుకాణాల వైపు చూడని వ్యాపారులు
- సింగిల్ టెండర్లపై 35 దుకాణాలు
- రాత్రి వరకూ కొనసాగిన లక్కీ డ్రా
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలోని 174 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్ల విజేతలను ప్రకటించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పి.జనార్దన్‌రెడ్డి గార్డెన్‌లో జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఎస్‌ఎస్ రాజ్ లక్కీడ్రా ప్రారంభించగా.. ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగింది. టెండర్ దారులతో సందడి నెలకొంది. ఆదిలాబాద్ ఏఎస్పీ జోయల్‌డేవిస్, టూటౌన్ సీఐ నారాయణ భద్రతను పర్యవేక్షించారు.
జిల్లాలోని 174 గాను 149 దుకాణాలకు అధికారులు టెండర్లు ఖరారు చేశారు. నూతన మద్యం పాలసీ ద్వారా మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వం ఈనెల 16 నుంచి దరఖాస్తులు స్వకరించింది. మొత్తం 174 దుకాణాలకు 974 దరఖాస్తులు దాఖలయ్యాయి. 25 దుకాణాల కోసం ఎవరూ ముందుకు రాలేదు. 149 దుకాణాల్లో 35 దుకాణాలకు ఒక్కో దరఖాస్తు రాగా 114 దుకాణాలకు పోటాపోటీగా టెండర్లు వేశారు. ఇదిలా ఉంటే.. మొదటి నుంచీ మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న వారికి కాకుండా కొత్తవారిని ఈసారి అదృష్టం వరించింది.
బెజ్జూర్‌లోని మద్యం దుకాణానికి అత్యధికంగా 44 దరఖాస్తులు రాగా.. ఆదిలాబాద్‌లోని ఎన్టీఆర్ చౌక్‌లోని దుకాణానికి 42 వచ్చాయి. ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న దుకాణానికి 32, ధస్నాపూర్‌లోని మద్యం దుకాణానికి 24 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 42 దరఖాస్తులు వచ్చిన ఎన్టీఆర్ చౌక్‌లోని మద్యం దుకాణాన్ని లాటరీ ద్వారా సుధావిలాస్‌రెడ్డి దక్కించుకున్నారు. జిల్లాలోనే అత్యధికంగా 44 దరఖాస్తులు వచ్చిన బెజ్జూరు దుకాణాన్ని సంతోష్‌జైస్వాల్ చేజిక్కించుకున్నారు.
సింగిల్ టెండర్లు దక్కించుకున్న మహిళలు..
జిల్లాలోని 35 దుకాణాలకు సింగిల్ టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో ఇద్దరు మహిళలకు అవకాశం దక్కింది. ఇచ్చోడ గెజిట్ నెం.57 షాపును ఎ.పార్వతి, ఆసిఫాబాద్ ఎక్స్‌రోడ్ గెజిట్ నెం.65 షాపును జాదవ్ విమలాబాయిలకు కేటాయించారు.
టెండర్‌దారుల ఆందోళన
కాగా.. లక్కీ డ్రా ప్రారంభమైన తర్వాత టెండర్‌దారులు ఆందోళనకు దిగారు. టెండర్ దక్కించుకున్న వారందరూ 1/3 వంతు డబ్బులు కట్టాలని అధికారులు ప్రకటించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి నిబంధనలు చెప్పలేదని, ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు కట్టాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. ఎంతో దూరం నుంచి వచ్చిన తాము వెంట డబ్బు తెచ్చుకోలేదని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. డబ్బులు తప్పనిసరిగా కట్టాల్సిందేనని తేల్చడంతో టెండర్‌దారులు ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శివరాజ్, ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.అనిత, మంచిర్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.