కిక్కే...కిక్కు
- మద్యం షాపులకు వెల్లువెత్తిన దరఖాస్తులు
- చివరిరోజు పోటెత్తిన వ్యాపారులు
- నగర పరిధిలో షాపులకు యమగిరాకీ
- ఏజెన్సీ షాపులకు స్పందన శూన్యం
సాక్షి, విశాఖపట్నం: ఊహించని రీతిలో మద్యం షాపు లవేలం కాసుల వర్షం కురిపిస్తోంది. దరఖాస్తు చేసేందుకు చివరిరోజు కావడంతో శనివారం వ్యాపారులు క్యూకట్టారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని షాపుల కోసం పోటీపడిన వ్యాపారులు ఏజెన్సీ పరిధిలోని షాపుల వైపు కన్నెత్తి చూసేపరిస్థితి కన్పించడం లేదు. జిల్లాలో 406 మద్యం దుకాణాలుండగా, వీటిలో 39 షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది. మిగిలిన 367 షాపులకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు.
ఇందుకోసం స్థానిక శివాజీపాలెంలో ఉన్న సవేరా ఫంక్షన్‌హాలులో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. ఈ నెల 23వ తేదీన ప్రారంభం కాగా, తొలి మూడు రోజులు అంతంతమాత్రంగా ఉన్న స్పందన శుక్రవారం సాయంత్రానికి 134 షాపులకు 404 దరఖాస్తులు వచ్చాయి. 233 షాపులకు శుక్రవారం వరకు ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాలేదు. చివరి రోజైన శనివారం ఊహించని రీతిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఉదయం నుంచి మొదలైన తాకిడి అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం మేరకు సుమారు 315షాపుల కోసం 2,586 దరఖాస్తులు వచ్చాయి. మరో 500 మంది వరకు దరఖాస్తు చేసేందుకు ఎదురు చూస్తున్నారు.
ఏజెన్సీపరిధిలో 25 షాపులతో పాటు గ్రామీణ జిల్లాలోని మరో 25 షాపులకు దరఖాస్తులు పడలేదని తెలుస్తోంది. సిటీ పరిధిలోని 62 షాపులతో పాటు జీవీ ఎంసీ పరిధిలోకి వచ్చిన పెందుర్తి, భీమిలి, గాజువాక, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లోని షాపులకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. ఈ షాపుల కోసం ఎక్కువగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. నగర పరిధిలోని జ్ఞానాపురం, ఓల్డ్ పోస్టాఫీస్, ఆర్టీసీ బస్టాండ్, ఎన్‌ఎడీ జంక్షన్ వంటి ప్రాంతాల్లోని మద్యం షాపులకు 50 నుంచి 100 వరకు దరఖాస్తులు పడినట్టు తెలుస్తోంది. ఒక్క జ్ఞానాపురం షాపుకే అత్యధికంగా 110 దరఖాస్తులు దాఖలైనట్టుగా చెబుతున్నారు. లెసైన్సింగ్ ఫీజుల రూపంలోనే సుమారు రూ.పాతికకోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశాలు కన్పిస్తన్నాయి. ఆదివారం ఉదయానికి గానీ ఏ షాపునకు ఎన్ని దరఖాస్తులు దాఖలయ్యాయి.ఏఏ షాపులకు దరఖాస్తులు పడలేదో చెప్పలేమని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.