
కాజీపేట అర్బన్: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో విద్యనభ్యసించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం లభిస్తుందని.. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. కాజీపేటలోని నేషనల్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వార్షికోత్సవాల ను మంగళవారం అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీజీపీ మాట్లాడుతూ.. వివిధ దేశాల విద్యార్థులు చదువు కోసం ఇక్కడకు వస్తుండటంతో జాతీయ సమైక్యతకు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు. తాను నాటి ఆర్‌ఈసీ.. నేటి నిట్‌లో 1990లో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో చేరానని డీజీపీ గుర్తు చేసుకున్నారు. ఆనాటి ప్రిన్సిపాల్ కోటేశ్వర్‌రావు ప్రోత్సాహంతో పాటు అధ్యాపకులు మానవీయ విలువలతో కూడిన విద్యనందిం చడం ద్వారానే తాను ఈ స్థాయికి ఎదిగానన్నా రు. అప్పట్లో తనకు తెలుగు మాత్రమే వచ్చని పేర్కొన్నారు. ఆర్‌ఈసీ తనకు ఎంతో నేర్పించి సమాజానికి సేవ చేసే ఉద్యోగమైన డీజీపీ స్థాయికి చేరడానికి దోహదపడిందని తెలిపారు.
ప్రపంచంలోనే నిట్ వరంగల్ ప్రత్యేకం
ప్రపంచంలోనే నిట్ వరంగల్‌కు ప్రత్యేక గుర్తిం పు ఉందని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు నాంది పలుకుతున్న నిట్‌లో ఏటా ఉత్తమ ప్రతి భ కనబరుస్తున్న విద్యార్ధులకు గోల్డ్ మెడల్స్, క్యాష్ ప్రైజ్ అందించి ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. అనంతరం 27 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 78 మంది విద్యార్ధులకు క్యాష్ ప్రైజ్, ప్రశంసా పత్రాలను డీజీపీ చేతుల మీదుగా అందజేశారు. అలాగే, డీజీపీ మహేం దర్‌రెడ్డిని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు ఘనంగా సన్మానించారు.