'ఆ నెంబరే' కొంప ముంచుతుందా ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఈ తరుణంలో ప్రస్తుత కార్పొరేటర్లకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం నగర పౌరుల నుంచి మున్సిపల్ ఫిర్యాదుల కోసం తాజాగా '211' అంటూ ట్రోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇదే జరిగితే తమ పని గోవిందా అంటూ నగర కార్పొరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. గతంలో కూడా ఇలాగే మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో నగర పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది.
ఇక ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటే ... మా వీధిలో లైట్ వెలగడం లేదు... నీళ్లు రావడం లేదు అంటూ రకరకాల కారణాలతో తమ వద్దకు సమస్యలు చెప్పుకునేందుకు డివిజన్ వాసులు ఎవరు వస్తారంటూ ప్రభుత్వంపై కార్పొరేటర్లు గొడవకు దిగారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఓ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. అందుకోసం ప్రజల్లో కూడా అవగాహాన కల్పించకుండా వదిలేసింది. ఆ తర్వాత 040 -21111111 అంటూ మరో నెంబర్ ఏర్పాటు చేసింది. ఈ నెంబర్ కూడా తెలంగాణలో జరిగిన సర్వే సమయంలోనే ప్రజలకు ఈ నెంబర్ ఉందనే విషయం తెలిసింది.
ఈ నెంబర్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పౌర సమస్యలను స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన 311 మాదిరిగా '211' ఏర్పాటు చేయాలని తలచింది. సాధ్యమైనంత త్వరలో ఈ మూడంకెల నెంబర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పాగా వేసేందుకే ఈ కొత్త ఎత్తుగడ అని ఇతర పార్టీలకు చెందిన ప్రస్తుత కార్పొరేట్లరు అనుమానిస్తున్నారు.
అసలే గ్రేటర్ ఎన్నికల సమయం... అదికాక రాష్ట్ర విభజనతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో హైదరాబాద్ మహానగరంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇది పరిస్థితి నగర శివారుల్లోని మరి స్పష్టంగా కనిపిస్తోంది. సదరు ప్రాంతాలలో సీమాంధ్ర ప్రజలు అత్యధికంగా నివసిస్తున్నారు. వీరంతా కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో వారి ఓట్లు రాబట్టేందుకు ప్రస్తుత కార్పొరేటర్లు ఎత్తగడలు వేస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎత్తగడల ముందు మన ఎత్తుగడలు ఫలిస్తాయో లేదోనని ఈ కార్పొరేటర్ల తెగ మదన పడిపోతున్నారని సమాచారం. నగర పౌరుల కోసం అంటూ ప్రస్తుతం టోల్ ఫ్రీ నెంబర్తో మొదలు పెట్టిన ఆ తర్వాత ఇంకేం తెస్తారో అంటూ వారు గుసగుసలాడుకుంటున్నారు. ఇదే జరిగితే మనమంతా 'కారు' ఎక్కాల్సిందేనని సదరు కార్పొరేటర్లు అనుకుంటున్నారట.